142

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  142* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 57* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

      *హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రజి) గారి ఇస్లాం స్వీకరణ : - 1* 

జులుం, హింసాదౌర్జన్యాల కారుమేఘాల ఈ భయానక వాతావరణంలో మరో మెరుపు మెరిసింది. దీని వెలుగు మునుపటి వెలుగు కన్నా కళ్లు మిరుమిట్లు గొలిపేదిగా ఉంది. అంటే, హజ్రత్ ఉమర్ (రజి) "ఇస్లాం"ను స్వీకరించారన్న మాట. ఈయన (రజి), దైవదౌత్య శకపు ఆరవ సంవత్సరంలోనే "ఇస్లాం" స్వీకరించడం జరిగింది. హజ్రత్ హమ్'జా (రజి) "ఇస్లాం" స్వీకరించిన మూడవ రోజున, "హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రజి)" గారు, "ఇస్లాం" స్వీకరించి ముస్లిం అయ్యారు.

"ఇస్లాం"ను స్వీకరించేలా చెయ్యమని, దైవప్రవక్త (సల్లం) "దుఆ" కూడా చేసి ఉన్నారు. ఇమామె తిర్మిజీ (రహ్మలై), ఇబ్నె ఉమర్ ఉల్లేఖనాన్ని ఉల్లేఖిస్తూ ఈ "దుఆ"ను ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. అలాగే, తిబ్రానీ, హజ్రత్ ఇబ్నె మస్ఊద్ మరియు హజ్రత్ అనస్ (రజి)ల ఉల్లేఖనాలను ఉల్లేఖిస్తూ దైవప్రవక్త (సల్లం) ఇలా సెలవిచ్చారని అంటారు.

 *"అల్లాహుమ్మ అఇజ్జల్ ఇస్లామ బిఅహబ్బి ర్రజులైని ఇలైక. బి ఉమరి బన్ ఖత్తాబ్ అవ్ బి అబీజహ్ల్ బిన్ హష్షామ్."* 

 *అర్థం : - ఓ ప్రభూ! "ఉమర్ బిన్ ఖత్తాబ్" లేదా "అబూ జహ్ల్ బిన్ హష్షామ్" వీరిద్దరిలో నీకు ప్రియమైన వారి ద్వారా "ఇస్లాం"ను శక్తివంతం చెయ్యి.* 

అల్లాహ్, ఈ "దుఆ"ను స్వీకరించడం వల్ల "హజ్రత్ ఉమర్ (రజి)" ముస్లిమైపోయారు. అల్లాహ్ దృష్టిలో, ఈ ఇద్దరిలో ఒక్క "హజ్రత్ ఉమర్ (రజి)" మాత్రమే ప్రియమైనవారు.

"హజ్రత్ ఉమర్ (రజి)" గారి హృదయఫలకంపై ఇస్లాం ముద్రింపబడిన ప్రప్రథమ సందర్భం గురించి, మునుపటి పుటల్లో మనం తెలుసుకున్నాం. అయితే ఆయన (రజి)లో, అజ్ఞానపు భావోద్రేకాలు, అంధానుకరణ, తాతముత్తాతల ఆచార సంప్రదాయాల గొప్పదనపు ఛాయలు మాత్రం తొలగిపోలేదు. హృదయాంతరంగంలో మెదిలే యదార్థం బయటకు రాలేకపోయింది. అందుకని ఆయన, తనలో దాగివున్న అంతరాత్మ ఘోషను లెక్క చేయకుండా "ఇస్లాం" విద్వేషంలో నిమగ్నమయ్యే ఉన్నారు.

 *హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించిన సందర్భం : -* 

బహుదైవారాధకులకు మక్కా పట్టణం గొప్ప సాంస్కృతిక, వాణిజ్య మతపరమైన కేంద్రం. కాబట్టి, సుదూర ప్రాంతాల నుంచి కూడా అనేకమంది యాత్రికులు ఇక్కడకు వస్తారు.

ఖురైష్ వంశస్థులే కాబా నిర్వాహకులు, ధర్మకర్తలైనందున వారికి యాత్రికుల నుండి అనేక రకాల కానుకలు, అపార సిరిసంపదలు లభిస్తాయి. సమాజంలో గౌరవం, పలుకుబడులు కూడా ఖురైష్ వంశస్థులకే బాగా ఉన్నాయి.

నలుమూలల "ఇస్లాం" వ్యాపించడం, ఖురైషీయుల మత వ్యాపారానికి, దుర్నడత దుర్వ్యసనాలకు పెద్ద గొడ్డలిపెట్టు. అందువల్ల అది రోజురోజుకు బలం పుంజుకుంటూ, నేల నాలుగు చెరగులా విస్తరిస్తూ పోతుంటే ఖురైషీయులు చూస్తూ ఎలా ఊరుకుంటారు?

దుష్ప్రచార పథకం బెడిసికొట్టడంతో అవిశ్వాసులు చిందులు తొక్కుతూ ముస్లిములపై విరుచుకుపడ్డారు. అవిశ్వాసుల్లో "ఉమర్ (రజి) బిన్ ఖత్తాబ్" కూడా ఉన్నాడు.

అవిశ్వాసుల హింసాదౌర్జన్యాలను తట్టుకోలేక ముస్లింలు మక్కా వదలి అబీసీనియా వెళ్ళిపోయారని విని అతను కూడా ఆగ్రహోదగ్రుడై పోయాడు.

“దీనికంతటికీ మూలకారకుడైన ముహమ్మద్ (సల్లం) అంతం చూస్తాను. జనాన్ని తప్పుదారి పట్టిస్తూ దేశంలో అశాంతి, అనైక్యతలు సృష్టిస్తున్నాడు. అలాంటివాడిని ఇక ఏమాత్రం సహించకూడదు. ఇప్పుడే పోయి అతని శిరస్సు ఖండిస్తాను. ఈ రోజుతో ముహమ్మద్ (సల్లం) కథ సమాప్తం."

ఈ విధంగా ఉమర్ (రజి), తన సహజ కఠిన ధోరణిలో కొట్టుకుపోతూ, మహాప్రవక్త (సల్లం) ఎడల విద్వేషాన్ని ప్రకటిస్తూ స్వయంగా ఖడ్గదారుడై ప్రవక్త (సల్లం)ని అంతమొందించటానికి బయలుదేరారు. కాని దారిలో "నయీమ్ బిన్ అబ్దుల్లా" ఎదురుపడ్డాడు. ★

 _("నయీమ్ (రజి) బిన్ అబ్దుల్లా" ఇదివరకే ఇస్లాం స్వీకరించారు. అయితే, ముస్లిములపై జరుగుతున్న దారుణాలు చూసి ఆయన (రజి), తన విశ్వాసాన్ని ఇంకా ప్రజల ముందు బహిర్గతం చేయలేదు.)_ 

ఖడ్గాన్ని చేతబట్టుకొని, ఆగ్రహావేశాలతో పెద్ద పెద్ద అంగల్లో వడివడిగా నడుస్తున్న "ఉమర్ (రజి)" వాలకం చూసి, ఏదో కీడుతలబెట్టబోతున్నారని "నయీమ్ (రజి)" గ్రహించారు.

నయీమ్ (రజి) : - ఉమర్ (రజి)! ఎక్కడికి ఇంత కోపంతో వెళుతున్నావు?

ఉమర్ (రజి) : - మన లాత్, ఉజ్జా దేవతలకు అపచారం తలపెట్టి, మనల్ని మతభ్రష్టుల కింద లెక్కగట్టిన ముహమ్మద్ (సల్లం) వద్దకు వెళుతున్నాను. అతడ్ని హతమార్చి, "ఇస్లాం" ప్రచారం ముందుకు కొనసాగకుండా ఇంతటితోనే అంతమొందిస్తాను.

నయీమ్ (రజి) : - అయితే ఉమర్ (రజి)! ముహమ్మద్ (సల్లం)ను హతమార్చి, "బనూ హాషిమ్", మరియు "బనూ జహ్రా" (తెగల) నుండి ఎలా తప్పించుకోగలవు?

ఉమర్ (రజి) : - ఒహో! అయితే నువ్వు కూడా నీ వెనుకటి మతాన్ని వదిలేశావన్న మాట. దీనికంతటికీ కారణమైన ముహమ్మద్ (సల్లం)ని వధించక తప్పదు.

ఉమర్ (రజి) ఆక్రోశం గురించి నయీమ్ (రజి) బాగా ఎరిగిన మనిషి. ఉమర్ (రజి) ఏదైనా చేయాలని సంకల్పిస్తే, ఖచ్చితంగా చేసి తీరతాడు. ఎలాగైనా ఉమర్ (రజి)ని దారి మళ్ళించాలని నయీమ్ (రజి) తలచాడు.

నయీమ్ (రజి) : - అయితే విను! నేనో ఆశ్చర్యకరమైన వార్త చెబుతున్నాను. నీ సోదరి "ఫాతిమా (రజి)" మరియు ఆమె భర్త "సయీద్ (రజి)" ఇద్దరూ నీ ధర్మాన్ని వదలి సత్యధర్మాన్ని స్వీకరించి ముస్లిములయ్యారు. ఇది నీకు తెలుసా?

ఇది విన్న "ఉమర్ (రజి)" గారికి, తన తల తీసేసినట్టయింది. ఆయన గారి ఉక్రోషానికి, రౌద్రానికి హద్దులేకుండా పోయింది.

ఉమర్ (రజి) : - ఏమిటీ! నా కుటుంబసభ్యులు "ఇస్లాం" స్వీకరించారా! నేను ఇప్పుడే వెళ్ళి వారి సంగతి చూస్తా!!

అని చెప్పి, పట్టరాని కోపంతో పళ్ళు కొరుకుతూ నేరుగా సోదరి, ఆమె భర్త ఉన్న చోటికి బయలుదేరారు.

 *ఫాతిమా (రజి) ఇంట్లో : -* 

ఆ సమయంలో "ఫాతిమా (రజి)" దంపతులకు, "హజ్రత్ ఖబ్బాబ్ (రజి) బిన్ అరత్", "తాహా" సూరా రాసి ఉన్న గ్రంథపత్రాన్ని పఠింపజేస్తున్నారు. "ఖుర్ఆన్" బోధించడానికి "హజ్రత్ ఖబ్బాబ్ (రజి)" అక్కడికి రావడం మామూలే.

అయితే! "హజ్రత్ ఉమర్ (రజి)" ఆ ఇంటి దరిదాపులకు రాగానే, అప్పటికే "హజ్రత్ ఖబ్బాబ్ (రజి)" గారి "ఖుర్ఆన్" పారాయణ స్వరం "ఉమర్ (రజి)" చేవుల్లోబడి ఉంది.

హజ్రత్ "ఫాతిమా (రజి)" దంపతులు మరియు "ఖబ్బాబ్ (రజి)", "ఉమర్ (రజి)" రాకను గమనించారు. "ఖబ్బాబ్ (రజి)" వెంటనే "ఖుర్ఆన్" పఠనాన్ని నిలిపివేసి, ఇంటిలోనికి వెళ్ళి దాక్కున్నారు. "ఖబ్బాబ్ (రజి)"కు ఎదురుగా కూర్చోని "ఖుర్ఆన్" పఠనాన్ని వింటున్న "ఫాతిమా (రజి)" దంపతులు, "ఖుర్ఆన్" పత్రాన్ని దాచేసి, కంగారుకంగారుగా ఏదో ఒక మూల దాక్కోవడానికి ప్రయత్నించారు.

"ఉమర్ (రజి)", తన సోదరి ఇంటికి చేరుకోగానే, ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. ఆ వెంటనే ఆయన (రజి), మూసి వున్న తలుపులను ధబాధబా తట్టాడు. దానికి లోపలినుంచి ప్రతిస్పందన లేదు. అసలే ఆవేశంలో ఉన్న "ఉమర్ (రజి)", తలుపులు బద్దలయ్యేలా బాదసాగాడు.

అపుడు హజ్రత్ "సయీద్ (రజి)" భయం భయంతోనే మెల్లగా తలుపులు తెరిచాడు. ఆగ్రహంతో ఉన్న "ఉమర్ (రజి)" లోపలికి ప్రవేశిస్తూనే, ఇంట్లో నలువైపులా పరికించి చూశాడు. అపుడు ఆయన (రజి)....,

ఉమర్ (రజి) : - నేను ఇప్పుడే ఆ మందస్వరంలో విన్నది ఏమిటి, ఆ కంఠస్వరం ఎవరిది?

“అదేమిలేదే! మేము మాట్లాడుకుంటున్నాం అంతే!” అని కంగారుగానే బదులిచ్చారు వారు.

ఉమర్ (రజి) : - మీరు ధర్మభ్రష్టులైపోయి "ఇస్లాం" స్వీకరించారని నేను విన్నాను. అది నిజమేనా?

అపుడు ఉమర్ (రజి)గారి, బావ "సయీద్ (రజి)" అందుకొని....,

సయీద్ (రజి) : - ఉమర్ (రజి)! సత్యం అనేది మీ ధర్మంలో కాకుండా మరే ధర్మంలోనైనా ఉండి ఉంటే? (అప్పుడు ఏం చేస్తారు?)

"హజ్రత్ ఉమర్ (రజి)" ఈ మాటల్ని వినగానే కోపోద్రేకంతో బావను చితకబాదేశారు. సయీద్ (రజి) ఒళ్ళు హూనమయ్యేలా పిడిగుద్దుల వర్షం కురిపించాడు.

"ఫాతిమా (రజి)", తన భర్తను రక్షించే ఉద్దేశ్యంతో అడ్డం వచ్చి, సయీద్ (రజి)ను ఉమర్ (రజి) బారి నుండి ప్రక్కకు లాగారు. అంతే! వెంటనే ఉమర్ (రజి), తన సోదరిపై కూడా చెయ్యెత్తాడు. పెల్లుమని గట్టిగా చెంపదెబ్బ వేశారు సోదరి చెక్కిలిపై. అంతటితో ఊరుకోకుండా ఆ చెంప ఈ చెంప ఎడాపెడా వాయించసాగాడు. తన తోబుట్టువు అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా కొట్టసాగాడు. దాంతో ఆమె ముఖం రక్తసిక్తమైపోయింది. "ఇబ్నె ఇస్'హాక్" ఉల్లేఖనం ప్రకారం, ఆమె తలకు కూడా దెబ్బ తగిలింది.

ఇక తమను ప్రాణాలతో విడిచిపెట్టడని భావించిన ఫాతిమా (రజి), ఉమర్ (రజి)కు ఎదురుతిరిగింది. అపుడు ఫాతిమా (రజి) ఉద్రేకంతో ఊగిపోతూ....,

(ఫాతిమా : - ఉమర్ (రజి)! ఆగు. నువ్వు ఖత్తాబ్ కొడుకువయితే నేను ఖత్తాబ్ కూతురిని. నేను నీకేమి తీసిపోను. ఔను, మేము ఇస్లాం స్వీకరించాం. ఇక మేము ఇస్లాం నుంచి ఒక్క అంగుళమైనా వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో.)

ఫాతిమా (రజి) : - నీ ధర్మం కాకుండా మరే ధర్మమే సత్యం అయినట్లయితే నీవేమి చేస్తావు?” (అని ప్రశ్నించి) *"అష్'హదుఅల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్'హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్" (అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ (సల్లం) అల్లాహ్ ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను)* . (అని గట్టిగా పలికారు.)

ఇది విన్న హజ్రత్ ఉమర్ (రజి) నిశ్చేష్ఠులైపోయి ఎటూ తోచక నిలబడిపోయారు. అపుడు, తన ముఖంపై రక్తాన్ని తుడుచుకుంటున్న ఫాతిమా (రజి)ని చూసి ఉమర్ (రజి) సిగ్గుపడ్డారు. ఫాతిమా (రజి) పలుకులు ఉమర్ (రజి) అంతరాత్మను కలచివేసింది. అపుడు ప్రశాంత హృదయంతో....,

ఉమర్ (రజి) : - ఏదీ మీ వద్ద ఉన్న ఆ గ్రంథాన్ని నాకివ్వండి, నేనూ చదువుతాను.

ఫాతిమా (రజి) : - లేదు! నీవు అపవిత్రుడవు. ఈ గ్రంథాన్ని కేవలం పరిశుద్ధులైన వారే తాకగలరు. లేచి! స్నానం చేసిరా.

ఆ తర్వాత "హజ్రత్ ఉమర్ (రజి) వెళ్ళి స్నానం చేసివచ్చారు. ఆ గ్రంథాన్ని చేతబట్టుకొని చదవనారంభించారు. *“బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్”* *(అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను)* . తన నోట ఈ పలుకులు వెలువడగానే...., “ఓహో! ఇది ఎంత పరిశుద్ధమైన నామం!” అంటూ "తాహా" సూరా ప్రారంభించారు. 

 *“ఇన్ననీన అనల్లాహు లాఇలాహ ఇల్లా అనా ఫఅ్'బుద్'నీ వఅఖిమిస్సలాత లిజిక్'రీ.” (ఖుర్ఆన్ 20:14).* 

 *అర్థం : - నిశ్చయంగా నేనే అల్లాహ్ ను. నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు. నన్ను జ్ఞాపకం చేయటానికి నమాజును నెలకొల్పు. (ఖుర్ఆన్ 20:14).* 

వరకు చదివిన తర్వాత, “ఇది ఎంత మహత్తరమైన వాక్కు, ఎంత పరిశుద్ధమైన వచనం!" అంటూ ఉమర్ (రజి) నోట ఈ మాటలు వెలువడ్డాయి.

ఈ మాటలు వింటున్న "హజ్రత్ ఖబ్బాబ్ (రజి)" లోపలి నుండి బయటకు వచ్చి....,

ఖబ్బాబ్ (రజి) : - ఉమర్ (రజి)! సంబరపడు! దైవప్రవక్త (సల్లం) గురువారం రాత్రి నీ గురించి ఇలా "దుఆ" చేశారు. (ఓ అల్లాహ్! "ఉమర్ బిన్ ఖత్తాబ్" లేదా "అబూ జహల్ బిన్ హష్షామ్" వీరిద్దరిలో నీకు ఎవరు ప్రియులో వారి ద్వారా ఇస్లాంను శక్తివంతం చెయ్యి). ఆయన (సల్లం) చేసిన "దుఆ" ప్రభావమే ఇది. విశ్వప్రభువు అయిన "అల్లాహ్" నీ విషయంలోనే ఈ "దుఆ" అంగీకరించి ఉండవచ్చు. ఇక ఈ సత్యధర్మాన్ని వదిలిపెట్టకు.

ఉమర్ (రజి) : - నేను "ఇస్లాం" స్వీకరించదలచాను. ముహమ్మద్ (సల్లం) ఎక్కడున్నారో తెలుపండి. నేను వెంటనే వెళ్ళి ఆయన (సల్లం)ను కలవాలి.

హఠాత్తుగా ఉమర్ (రజి)లో వచ్చిన ఈ మార్పు చూసి, ఖబ్బాబ్ (రజి) పరమానందం భరితులయ్యారు. ఇక ఫాతిమా (రజి), సయీద్ (రజి) ల ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి.

ఖబ్బాబ్ (రజి) : - దైవప్రవక్త (సల్లం) ఇప్పుడు సఫా కొండపై ఉన్న గృహంలో ఉన్నారు.

 *మిగిలినది Insha Allah రేపటి భాగములో....,* 

 _(★ → కాని దారిలో నయీమ్ బిన్ అబ్దుల్లా అల్ఖామ్ అద్వీని■ లేదా బనీ జహ్రా◆ లేదా బనీ మగ్జూమ్ కు చెందిన ఓ వ్యక్తి●ని కలుసుకోవడం జరిగింది._ 

 _■ → ఇది ఇబ్నె ఇస్'హాక్ కథనం, చూడండి. ఇబ్నె హష్షామ్ - 1/344_ 

 _◆ → తారీఖ్ ఇబ్నె ఖత్తాబ్ అల్ ఇబ్నె జూజీ - పుట 10; ముక్తతరుస్సీరీత్ - షేక్ అబ్దుల్లా, పుట - 103._ 

 _● → ఇబ్నె అబ్బాస్ (రజి) వారి ఉల్లేఖనం చూడండి. ముక్త మెరస్సీరత్ డిటో - పుట. 102.)_ 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment