140

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  140* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 55* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

        *"హజ్రత్ హమ్'జా (రజి)" గారి ఇస్లాం స్వీకారం* 

"అబూ జహల్" దైవప్రవక్త (సల్లం)ను వేధించడం మానలేదు. అతను ఎల్లప్పుడూ దైవప్రవక్త (సల్లం)ను వెన్నాడుతూ అవకాశం చిక్కినపుడల్లా ఆయన (సల్లం)ను భాధించేవాడు.

 *దైవప్రవక్త (సల్లం)ను దూషించిన అబూ జహల్ : -* 

ఓ రోజు దైవప్రవక్త (సల్లం) దారిన వెళ్తున్నారు. దారిలో "అబూ జహల్" ఎదురయ్యాడు. "అబూ జహల్", దైవప్రవక్త (సల్లం)ను చూడగానే మండిపడుతూ అకారణంగా దూషించడం మొదలుపెట్టాడు. అనరాని మాటలు అని మనసులోని అక్కసంతా వెళ్ళబోసుకున్నాడు. కారుణ్యమూర్తి (సల్లం) మటుకు పల్లెత్తి మాట అనలేదు. "అబూ జహల్" వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

అయితే దైవప్రవక్త (సల్లం) సమాధానమైన ఇవ్వకపోవడంతో "అబూ జహల్" మరింత రెచ్చిపోయాడు. కోపోద్రేకాలతో చిందులు తొక్కాడు. దారి ప్రక్కనే ఉన్న కంకర్రాళ్ళు తీసుకుని ఆయన (సల్లం) మీదికి విసిరి కొట్టాడు.

అయినా మహాప్రవక్త (సల్లం) అతని దౌర్జన్యానికి ఏమాత్రం బాధపడలేదు. ప్రతిక్రియ కోసం అసలే పూనుకోలేదు. ఆయన (సల్లం) సహనంతో అతడ్ని నుంచి మెల్లిగా తప్పించుకొని మౌనంగా వెళ్ళిపోయారు.

వీళ్ళిద్దరికీ కొంచెం దూరంలో ఇదంతా ఓ దాసి గమనిస్తూ నిల్చుంది. సత్యసంధుడు, నిజాయితీపరుడైన దైవప్రవక్త (సల్లం) పట్ల "అబూ జహల్" ప్రవర్తించిన తీరు చూసి ఆమె హృదయం ద్రవించిపోయింది.

ఆమె ఇదివరకే "ఇస్లాం"ను విశ్వసించింది. ఆమెకు దైవప్రవక్త (సల్లం) పట్ల అపారమైన అభిమానం ఉంది. ఈ విషయం ఆమె ఇంకా బయట పెట్టలేదు. తన యజమానికి తెలిస్తే అతను తనను చిత్రహింసలు పెట్టి చంపుతాడు. అందువల్ల ఆమె "ఇస్లాం" పట్ల తన విశ్వాసాన్ని కొంతకాలంపాటు రహస్యంగానే ఉంచవలసివచ్చింది.

దైవప్రవక్త (సల్లం)పై అకారణంగా "అబూ జహల్" చేసిన దౌర్జన్యం చూడగానే ఆ దాసిలోని విశ్వాసం ఉరకలు వేసింది. ఎలాగైనా ఆ దుర్మార్గుడి ఆట కట్టించాలని అనుకున్నది.

ఆ రోజు సాయంత్రం పట్నం వెలుపల కొండల వైపు దారి తీసింది. అలా ఆమె ఓ కొండ పక్కగా నడుస్తుంటే ఎదురుగా "అబ్దుల్ ముత్తలిబ్" కొడుకు "హజ్రత్ హమ్'జా (రజి)" రావడం కనిపించింది. అతని నడుముకు కరవాలం వ్రేలాడుతుంది. భుజానికి విల్లు, వీపు వెనుక అంబులపొది కూడా ఉన్నాయి. బంధుత్వం రీత్యా దైవప్రవక్త (సల్లం)కు పినతల్లి కుమారుడు అవుతాడు. పైగా ఇద్దరూ ఒకే స్త్రీ పాలు తాగి ఉన్నందున దైవప్రవక్త (సల్లం)కు స్థన్యసంబంధ సోదరుడు కూడా అవుతాడు.

"హమ్'జా (రజి)" వేటకు పోయివస్తున్నాడు. దాసి "హమ్'జా (రజి)"ను చూడగానే ఇలా అన్నది....,

దాసి : - అబూ ఉమారా (హమ్'జా)! మీలో ఆత్మాభిమానం మచ్చుకైనా లేదా? "బనీ మఖ్జూమ్" తెగ ప్రజలు, ముహమ్మద్ (సల్లం)ను విచ్చలవిడిగా హింసిస్తుంటే మీరు ఏమీ పట్టనట్లు ఉంటారేమిటి?

నడుచుకుంటూ వెళ్తున్న "హమ్'జా (రజి)", దాసి మాటలు వినగానే ఠక్కున ఆగిపోయాడు. అపుడు ఆయన (రజి) ఆశ్చర్యంతో....,

"హమ్'జా (రజి)" : - అబ్దుల్లా దాసీ! ఏమిటీ నువ్వంటున్నది?

దాసి : - ఏమని చెప్పను? ఈ రోజు మీ ముహమ్మద్ (సల్లం)కు ఏమైందో తెలుసా? ఆయన (సల్లం) ఉదయం ఏదో పనిమీద వెళ్తుంటే, "అబూ జహల్" ఎక్కడ్నుంచో ఊడిపడ్డాడు. వచ్చీరాగానే నోటికొచ్చినట్లు నానా తిట్లు తిట్టాడు. నేను సహించలేకపోయాను. సరే అంతటితో ఊరుకున్నాడా? పిడికెడు కంకర్రాళ్ళు తీసుకుని ఆయన (సల్లం) ముఖం మీదికి విసిరికొట్టాడు!

"హమ్'జా (రజి)" : - ఏమిటీ! నిజమా!! నువ్వు చూశావా? (అని అడిగాడు ఆగ్రహంతో)

దాసి : - ఔను! నేను నా కళ్ళారా చూశాను. చెవులారా విన్నాను.

"హమ్'జా (రజి)" : - అయితే ఉండు, ఇప్పుడే ఆ దుర్మార్గుడి సంగతి తేల్చుకుంటాను.

అని పలికి, నిప్పులు కక్కుతూ, పెద్దపెద్ద అంగాలు వేసుకుంటూ కాబా మందిరం వైపు నడిచాడు.

 *ఆగ్రహావేశాలతో కాబా దగ్గరికి చేరుకున్న "హమ్'జా (రజి)" : -* 

కాబా మందిరంలో ఓ మూల ఖురైష్ నాయకులు గుమికూడి "ఇస్లాం"కు వ్యతిరేకంగా మంతనాలు జరుపుతున్నారు. వారిలో "అబూ జహల్" కూడా ఉన్నాడు.

"హమ్'జా (రజి)" కోపంతో ఊగిపోతూ నేరుగా కాబాలయంలోకి ప్రవేశించి ఓసారి చుట్టూ కలియజూసాడు. ఖురైష్ నాయకుల మధ్య కూర్చున్న "అబూ జహల్" మీద దృష్టి పడగానే పళ్ళు పటపట కొరికాడు. నాలుగైదు అంగల్లో "అబూ జహల్" దగ్గరకి దూసుకుపోయాడు. హమ్'జా (రజి), భుజానికి ఉన్న తన ధనుస్సును చేతిలోకి తీసుకుని, "అబూ జహల్" తల మీద బలంగా కొట్టాడు.

అంతే, దెబ్బకు అబూ జహల్ తల పగిలిపోయింది. చిల్లిపడిన కుండలా, రక్తం బొటబొట కారసాగింది. అతని ముఖమంతా రక్తసిక్తమయ్యింది. క్షణంపాటు కళ్ళుబైర్లు కమ్మాయి. తరువాత తేరుకుని "హమ్'జా (రజి)" వైపు చూశాడు. "హమ్'జా (రజి)" కళ్ళ నుంచి అగ్నికణాలు రాలుతున్నాయి.

హమ్'జా (రజి) : - దుర్మార్గుడా! ముహమ్మద్ (సల్లం) ఎవరనుకున్నావ్? ఆయన నా అన్నకొడుకు. నువ్వు అనాథ అని చులకనగా భావించినవాడు, నీ తిట్లు దెబ్బలు తిన్నవాడు నా సొంత అన్న కొడుకని తెలియదా?

హమ్'జా (రజి), ఠీవి, దర్పం గల మనిషి. అతనికి కోపం వస్తే అందరూ వణికిపోతారు. ఏదైనా వ్యవహారం బెడిస్తే, అతని ముందు పెదవి విప్పడానికి కూడా ఎవరూ సాహసించలేరు. అందువల్ల "అబూ జహల్" పరిస్థితి గ్రహించి నెమ్మదిగా నోరు విప్పాడు.

అబూ జహల్ : - హమ్'జా (రజి)! ముహమ్మద్ (సల్లం) మనల్ని మూర్ఖుల కింద జమకట్టాడు. మన బుర్రలనే మరమ్మత్తు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మన తాతముత్తాతల ఆచారాల మీద దాడి చేస్తున్నాడు. పైగా మన దేవతలను కూడా విమర్శిస్తున్నాడు. బానిసల్ని రెచ్చగొట్టి మత భ్రష్టులని చేస్తున్నాడు. (అన్నాడు ముఖం మీది రక్తం తుడుచుకుంటూ)

హమ్'జా (రజి) : - మూర్ఖుడా! అల్లాహ్ ను కాదని విగ్రహాలను పూజిస్తున్నావు కదూ! బాగా విను. నేను మా ముహమ్మద్ (సల్లం) పక్షం వాడినే. ఆయన (సల్లం)కే నా పూర్తి మద్దతు. ఇకనుంచి నేను ఇస్లాం కోసమే జీవిస్తాను, ఇస్లాం కోసమే మరణిస్తాను.

ఈ మాటలు విని, "అబూ జహల్"తో పాటు అక్కడున్నవారంతా విస్తుబోయారు. వాళ్ళలో "అబూ జహల్"కు చెందిన "బనీ ముఖ్జూమ్" తెగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని "అబూ జహల్"కు సహాయం చేయడానికి సిద్ధమయ్యారు.

"బనీ ముఖ్జూమ్" తెగ ప్రజలు : - హమ్'జా (రజి)! నీ వాలకం చూస్తుంటే నువ్వు మన పూర్వీకుల మతం వదలి ఇతరుల వలలో పడినట్లు అనిపిస్తోంది.

హమ్'జా (రజి) : - ఔను! ఇస్లాం సత్యధర్మం అని తెలిసినప్పుడు దానిని నేనెందుకు స్వీకరించను? ముహమ్మద్ (సల్లం) చెప్పే విషయం పరమ సత్యం. అందులో నాకెలాంటి అనుమానం లేదు. దైవసాక్షి! ఆ సత్యాన్ని నేనూ స్వీకరిస్తాను. చేతనైతే నన్ను ఎదిరించండి.

ఈ విధంగా చెప్పి "హమ్'జా (రజి)" అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సత్యతిరస్కారులు ఏమీ చేయలేక వెళ్తున్న "హమ్'జా (రజి)" వైపు చూస్తూ ఉండిపోయారు.

హమ్'జా (రజి), కాబా మందిరం నుండి ఇంటికి వచ్చాడు. పరమ కిరాతకుడైన "అబూ జహల్" మదం అణగినందుకు ఆయనకిప్పుడు తృప్తిగా ఉంది. కాని నూతన ధర్మం విషయంలో మటుకు ఆయన (రజి) మనస్సు పరిపరి విధాల ఆలోచనలకు పోతోంది. “ఇంతకూ నేను అన్న మాట సరయినదేనా? కొంపతీసి నేను ఉద్రేకపు ఉరవడిలో పడి పొరపాటు చేయలేదుకదా? ఏమో, ఆ దేవుడే కాపాడాలి. దేవా! నాకు సన్మార్గం చూపు.” అంటూ దైవాన్ని ప్రార్థించాడు "హమ్'జా (రజి)".

ఆ రాత్రి "హమ్'జా (రజి)"కు నిద్ర పట్టలేదు. మనసులో దేవుడ్ని ప్రార్థిస్తూ గడిపాడు. రాత్రి చివరి ఘడియల్లో కాస్తంత కునుకు పట్టింది. అంతలో తెల్లారింది. కళ్ళుతెరచి చూస్తే ప్రకృతి శోభాయమానంగా కనిపించింది. మనసు తేలిక పడినట్లు అనిపించింది. అంతర్యం విశ్వాస జ్యోతితో ప్రకాశవంతమైనట్లు అనుభూతి కలిగింది.

దాంతో ఆయన (రజి) నూతనోత్సాహంతో లేచారు. గబగబా కాలకృత్యాలు ముగించుకొని, ప్రవక్త (సల్లం)ను కలవడానికి బయలుదేరారు.

 *దైవప్రవక్త (సల్లం) సన్నిధికి చేరుకున్న "హమ్'జా (రజి)" : -* 

దైవప్రవక్త (సల్లం) సన్నిధికి చేరుకున్న తర్వాత, "అబూ జహల్" గర్వాన్ని అణచిన సంగతి చెప్పి, దైవప్రవక్త (సల్లం)ను సంతోషపరచాలని అనుకున్నాడు. అపుడు హమ్'జా (రజి), ముహమ్మద్ (సల్లం)తో....,

హమ్'జా (రజి) : - నా సోదరకుమారా! నువ్వు ఈ సంగతి వింటే చాలా సంతోషిస్తావు. నేను నీ తరపున "అబూ జహల్" మీద ప్రతీకారం తీర్చుకున్నాను.

ముహమ్మద్ (సల్లం) : - పెదనాన్న! ఇలాంటి మాటలు నాకు సంతోషం కలిగించవు. మీరు "ఇస్లాం" స్వీకరిస్తే మాత్రం నాకెంతో సంతోషంగా ఉంటుంది.

ఈ విషయం గురించి "హమ్'జా (రజి)" రాత్రంతా తీవ్రంగా అలోచించి ఒక నిర్ణయానికి రావడం వల్ల వెంటనే ఆయన (రజి) "ఇస్లాం" స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.

హమ్'జా (రజి) : - దైవప్రవక్తా! ఇకనుండి నేను అంతిమశ్వాస వరకు సత్యధర్మం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటాను.” (అన్నారు అమితోత్సాహంతో)

ఈ మాటలు వినగానే దైవప్రవక్త (సల్లం) ముఖారవిందం విప్పారి పున్నమి చంద్రునిలా వెలిగిపోయింది. అంతరంగం ఆనందంతో ఉప్పొంగింది. “దేవా! "హమ్'జా (రజి)"ను సత్యధర్మంలో స్థిరంగా ఉంచు.” అన్నారు ఆయన (సల్లం) అప్రయత్నంగా.

"హజ్రత్ హమ్'జా (రజి)" ఇస్లాం స్వీకరించడంతో అవిశ్వాసులు ఓ గొప్ప సాహసవంతుడ్ని, మహాయోధుడ్ని కోల్పోయారు. ఈ వార్త ముస్లిములను మాత్రం ఎంతో ఉత్తేజపరిచింది. ఔను మరి, హమ్'జా (రజి) సామాన్య వ్యక్తి కాదు. కాకలు తీరిన యోధుడు. ఆయన (రజి) పరాక్రమ గాధలు దేశం నలుమూలలా విస్తరించి ఉన్నాయి. అలాంటి హమ్'జా (రజి) ముస్లిం అయ్యాడంటే ఇస్లామీయ ఉద్యమం గొప్ప మలుపు తిరిగిందన్న మాట.

 *↑ ఇదే సంఘటన...., ముక్తసరుస్సీరత్, షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లా పుట - 66; రహ్మతుల్ లిల్ ఆలమీన్ - 1/68; ఇబ్నె హష్షామ్ - 1/291,292 ల ప్రకారం : - ↓* 

●"హజ్రత్ హమ్'జా (రజి)" ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి పురిగొల్పిన పరిస్థితి ఏమిటంటే....,

ఓ రోజు "అబూ జహల్" సఫా కొండ వద్ద దైవప్రవక్త (సల్లం) కూర్చుని ఉన్న చోటి నుండి వెడుతూ ఆయన (సల్లం)ను హింసించి, దుర్భాషలాడాడు. దైవప్రవక్త (సల్లం) ఏమీ అనుకుండా కూర్చున్నారు. అయితే అతను ఆయన (సల్లం) తలపై ఓ రాయిని విసిరి వేశాడు. ఆ రాయి తగలడం వలన తల నుండి రక్తం స్రవించనారంభించింది.

ఆ తరువాత అతను వెళ్లి కాబా గృహం దగ్గర తన మిత్రబృందంలో చేరి కూర్చున్నాడు. "అబ్దుల్లా బిన్ జుద్ఆన్" స్త్రీ బానిస అదంతా గమనిస్తూ ఉంది. ఆమె ఇల్లు సఫా కొండపైన్నే ఉంది. "హజ్రత్ హమ్'జా (రజి)" విల్లంబులు ధరించి వేట నుండి తిరిగి వస్తుండగా ఎదురుగా వెళ్లి విషయమంతా చెప్పేసింది.

"హజ్రత్ హమ్'జా (రజి)" కోపోద్రేకంతో ఊగిపోయాడు. ఈయన ఖురైష్ కు చెందిన అత్యంత శక్తిశాలి, దృఢకాయుడైన యువకుడు. దాసి చెప్పిన విషయాలను విని ఒక్క క్షణం కూడా జాగు చేయకుండా, "అబూ జహల్" కనపడగానే అతణ్ణి చితకబాదాలనే ఉద్దేశ్యంతో హుటాహుటిన అక్కడికి చేరారు. "మస్జిదె హరాం" లోనికి వెళ్లి "అబూ జహల్"కు ఎదురుగా నిలబడి, "ఒరేయ్ పిరికిపందా! నీవు నా సోదర కుమారుణ్ణి తిడతావా? నేను కూడా ఆయన (సల్లం) ధర్మాన్ని స్వీకరించాను తెలుసా?" అంటూ విల్లుతో "అబూ జహల్" తలపై ఒక్క దెబ్బ వేశారు. ఆ దెబ్బకు అతని తల బద్దలుగా పగిలిపోయింది.

ఇది చూసిన "బనూ మగ్జూమ్" తెగ, హమ్'జా (రజి) గారి తెగ "బనూ హాషిమ్" ఒకరిపై ఒకరు తలపడ్డారు. కాని "అబూ జహల్" వారిని వారిస్తూ, "పోనిద్దురూ! అబూ అమ్మారాను ఏమనకండి. నేను నిజంగానే ఆయన అబ్బాయిని బహుచెడ్డగా తిట్టాను." అని అన్నాడు.●

●మొదట "హజ్రత్ హమ్'జా (రజి)", తన బంధువును అగౌరవం పాలుజేసినందుకు రోశపడుతూ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారుగాని, "అల్లాహ్" ఆ తరువాత ఆయన (రజి) హృదయాన్ని ఆ ధర్మం కోసం తెరిచాడు. ఆయన (రజి) ఇస్లాం ధర్మాన్ని దృఢంగా పట్టుకోవడం జరిగింది.●

ముస్లిములకు ఆయన (రజి) ద్వారా గొప్ప గౌరవం, శక్తి లభించాయి. 

 *మెరిసిన మరో మెరుపు : - - : మరో యోధుడి ఇస్లాం స్వీకరణ : - - : ఓ గొప్ప యోధుడ్ని కోల్పోయిన అవిశ్వాసులు* 

జులుం, హింసాదౌర్జన్యాల కారుమేఘాల ఈ భయానక వాతావరణంలో మరో మెరుపు మెరిసింది. దీని వెలుగు మునుపటి వెలుగు కన్నా కళ్లు మిరుమిట్లు గొలిపేదిగా ఉంది. అదే, ఓ మహా సాహసవంతుడి ఇస్లాం స్వీకరణ....,

 *Insha Allah రేపటి భాగములో....,* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment