138

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  138* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 53* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

 *ఖురైష్ బృందం మరోసారి "అబూ తాలిబ్" వద్దకు : -*

గతంలో చేసిన బెదిరింపుకు ఎలాంటి సమాధానమూ లభించలేదు. పైగా ప్రవక్త (సల్లం) తన పనిని చేసుకుంటూనే పోతున్నారు. అప్పుడు ఖురైష్ నాయకులకు అర్థమైపోయింది., అబూ తాలిబ్ ప్రవక్త (సల్లం)ని వదలలేరన్న సంగతి. పైగా ఆయన ఖురైష్ నుండి వేరుబడి, ఖురైషీయుల శత్రుత్వాన్ని కూడా కొని తెచ్చుకోడానికైనా సిద్ధంగా ఉన్నారన్న విషయం తేలిపోయింది. కాబట్టి ఖురైష్ నాయకులు "వలీద్ బిన్ ముగైరా" కుమారుణ్ణి వెంటబెట్టుకుని "అబూ తాలిబ్" దగ్గరకు వచ్చారు. అపుడు ఖురైష్ నాయకులు, అబూ తాలిబ్ ను ఉద్దేశించి....,

ఖురైష్ నాయకులు : - ఓ అబూ తాలిబ్! ఇతను ఖురైష్ కు చెందిన నవయవ్వనంలో ఉన్న అందమైన యువకుడు. ఇతని సహాయానికీ, ఇతని సంపాదనకు మీరే హక్కుదారులు కాగలరు. ఇతన్ని మీరు మీ పుత్రునిగా స్వీకరించండి. ఇతను మీవాడే అయిపోతాడు. ఇతనికి బదులుగా మీరు మీ సోదరుని కుమారుడు, ముహమ్మద్ (సల్లం)ని మాకు అప్పగించండి. అతను మా తాతముత్తాతల ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడు. మా జాతిని చిన్నాభిన్నం చేసేస్తున్నాడు. వారి తెలివితేటలకు సవాలు విసురుతున్నాడు. మేము అతణ్ణి చంపేస్తాం. ఒక మనిషికి బదులుగా మరొక మనిషిని ఇస్తున్నాం, లెక్కసరిపోతుంది చాలదా?

ఈ మాటలు వినగానే "అబూ తాలిబ్" కోపోద్రుకుడై పోయాడు.

అబూ తాలిబ్ : - దైవసాక్షి! మీరెంత నికృష్టమైన బేరానికి దిగారు. మీరేమో పెంచి,పోషించి పెద్దజేయడానికి మీ పుత్రుణ్ణి నాకప్పగిస్తున్నారా? నా కుమారుణ్ణి చంపేయండని మీకు అప్పజెప్పాలా? దైవసాక్షి! ఇది అయ్యే పని కాదు.

దీనికి "నౌఫిల్ బిన్ అబ్దె మునాఫ్" మనవడు "ముత్'యిమ్ బిన్ అద్దీ" అందుకుని....,

ముత్'యిమ్ : - దైవసాక్షి! ఓ అబూ తాలిబ్! నీ జాతి ప్రజలు చెప్పేవి న్యాయసమ్మతమైన మాటలే. నీకు అయిష్టమైన దాని నుండి నిన్ను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మా శక్తికి మించి అన్ని విధాలా ప్రయత్నించాం. కానీ ఫలితం లేదు. మీతో ఎన్నో సార్లు విన్నవించుకున్నాం కూడా. మీరేమో ఏ ఒక్కరి మాటా వినేటట్లు అగుపించడం లేదు.

అబూ తాలిబ్ : - దేవుడే సాక్షి! మీరేమి న్యాయసమ్మతమైన మాటలు మాట్లాడటం లేదు. నీవు కూడా నన్నొదలి నాకు వ్యతిరేకులైన వారి కొమ్ముకాస్తే కాయి. పో! ఏది జరుగనుందో అదే జరిగితీరుతుంది.

 _(సీరత్ ఆధారాల్లో పై సంభాషణ జరిగిన సంవత్సరం ఏదో ఇతమిత్థంగా నిర్ణయం కాలేదు. ఈ రెండు సంభాషణలు బహుశా దైవదౌత్య శకం ఆరవ సంవత్సరం మధ్యభాగంలో జరిగి ఉండవచ్చని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. రెంటి నడుమ చాలా తక్కువ కాలమే గడచి ఉండవచ్చు.)_ 

 *ప్రవక్త (సల్లం)ను హత్య చేసే ఆలోచన : -* 

ఈ రెండుమార్లు "అబూ తాలిబ్"తో జరిగిన చర్చ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనందున ఖురైష్ హింసా దౌర్జన్యాలకు సంబంధించిన భావోద్రేకాలు మరీ పెచ్చు పెరిగిపోయాయి. బాధలకు గురిచేసే క్రమం మునుపటి కంటే వేగంగా పుంజుకుంది. ఆ రోజుల్లోనే దైవధిక్కారుల మెదళ్ళలో, దైవప్రవక్త (సల్లం)ను హత్య చేయాలనే ఆలోచన వచ్చింది. ప్రవక్త (సల్లం)పై జరుగుతున్న ఈ హింసా దౌర్జన్యాల జోరు, ప్రవక్త (సల్లం)ని హత్య చేసే ఆలోచన మక్కా నగరానికే చెందిన ఇద్దరు మహాయోధులు "హజ్రత్ హమ్'జా (రజి) బిన్ అబ్దుల్ ముత్తలిబ్" మరియు "హజ్రత్ ఉమర్ (రజి) బిన్ ఖత్తాబ్" లను ఇస్లాం స్వీకరించేటట్లు ప్రేరేపించాయి. కాకపోతే అవి వారి ద్వారా ఇస్లాం ధర్మానికి బలం చేకూరడానికి దోహదపడ్డాయి. 

హింసాకాండకు, ఆగడాలకు సంబంధించిన క్రమం అలా పెచ్చు పెరుగుతూనే పోయింది. వీటికి సంబంధించిన రెండు ఉదాహరణలు ఇక్కడ వివరించదలిచాము.

ఓ రోజు "అబూ లహబ్" కుమారుడు "ఉతైబా", ప్రవక్త (సల్లం) వద్దకు వచ్చి, “వన్నజ్మిఇజాహవా” మరియు “సుమ్మదనా ఫతదల్లా”ను (అంటే "ఖుర్ఆన్" ఆయత్ లను) నేను తిరస్కరిస్తున్నాను అని చెప్పి, ప్రవక్త (సల్లం) ను కొట్టనారంభించాడు. ప్రవక్త (సల్లం) గారి చొక్కాను చింపేసి ముఖాన ఉమ్మివేశాడు. ఆ ఉమ్మి ఆయన (సల్లం)పై పడలేదు. ఈ సందర్భంగా దైవప్రవక్త (సల్లం) అతన్ని, “ఓ అల్లాహ్! నీ కుక్కల్లోంచి దేన్నయినా ఇతనిపైకి ఉసిగొల్పు” అని శపించారు. దైవప్రవక్త (సల్లం) పెట్టిన ఈ శాపాన్ని "అల్లాహ్" మన్నించాడు.

"ఉతైబా" ఓ సారి ఖురైష్ కు చెందిన కొందరు వ్యక్తుల వెంట ప్రయాణం చేయాల్సి వచ్చింది. సిరియా దేశంలో ఉన్న “జర్కా” అనే ప్రదేశంలో విడిది చేశారు. రాత్రి పూట ఓ పులి ఆ బిడారం చుట్టూ తిరుగుతూ ఉండగా "ఉతైబా" చూశాడు. చూడగానే, “అయ్యో నా ఖర్మ! దైవసాక్షి! నన్ను చంపేయడానికే ఇది వచ్చింది. ప్రవక్త (సల్లం) ఆనాడు నన్ను శపించారు. చూడండి! నేను సిరియా దేశంలో ఉన్నాను. కాని ఆయన (సల్లం) మక్కాలో ఉంటూ నన్ను చంపేస్తున్నాడు” అని అరిచాడు.

మిగిలినవారందరూ "ఉతైబా"ను వారి పశువుల నడుమన ఉంచి చుట్టూ కాపలా కాశారు. కానీ, పులి వారందరిపై నుండి లంఘించి నేరుగా "ఉతైబా"ను పట్టుకుని చీల్చిపారేసింది.
____________________

ఓసారి "ఉక్బా బిన్ ముఅయిత్", దైవప్రవక్త (సల్లం) సజ్దా చేస్తుండగా మెడను బలంగా త్రొక్కడం వల్ల ఆయన (సల్లం) కళ్ళు బయటకు వచ్చినంత పనైంది.

"ఇబ్నె ఇస్'హాక్" ఉల్లేఖించిన ఓ సుదీర్ఘ ఉల్లేఖనంలో కూడా హింసా దౌర్జన్యాలకు సంబంధించిన ఆగడాలను గురించి ప్రవక్త (సల్లం)ను హతమార్చే ప్రయత్నంపై వెలుగు పడుతోంది. ఈ ఉల్లేఖనంలో ఇలా చెప్పడం జరిగింది....,

ఓ సారి "అబూ జహల్" ఇలా అన్నాడు; “ఖురైష్ సోదరులారా! ముహమ్మద్ (సల్లం) మన ధర్మాన్ని ఎలా తూలనాడుతున్నాడో, మన తాత ముత్తాతలను ఎలా ఎత్తిపొడుస్తున్నడో, మన బుద్ధీ వివేచనల్ని ఎలా సవాలు చేస్తున్నాడో మీకు తెలుసు. మన ఆరాధ్య దైవాలను కించపరిచే విధం ఎలాగుందో మీరెరుగుదురు. అందుకని నేడు నేను "అల్లాహ్"పై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఓ భారమైన బండరాయిని తీసుకుని కూర్చుని ముహమ్మద్ (సల్లం) సజ్దా చేసినప్పుడు, దాంతో ఆయన (సల్లం) తల నుజ్జునుజ్జు అయ్యేటట్లు తలపై ఎత్తి వేస్తాను. ఆ తరువాత మీరు నన్ను అసహాయునిగా వదిలేస్తారో, నాకు సహాయపడతారో అన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. "అబ్దె మునాఫ్" కూడా వారి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించినా సరే!” అని ప్రతిజ్ఞ చేశాడు.

“లేదు, లేదు! దైవసాక్షి! మేము ఈ వ్యవహారంలో నిన్ను నిస్సహాయునిగా వదిలేసేవారం కాదు. నీవు చేసేది చేసి చూపించు” అని ఖురైష్ నాయకులంతా అతనికి ధైర్యం చెప్పారు.

తెల్లారగానే "అబూ జహల్" బరువైన బండరాయినొకదాన్ని దగ్గర పెట్టుకుని ప్రవక్త (సల్లం) కోసం ఎదురు చూస్తున్నాడు. దైవప్రవక్త (సల్లం) మాములుగా కాబా గృహం దగ్గరకొచ్చి నిలబడి నమాజులో నిమగ్నమయ్యారు. ఖురైష్ కూడా అక్కడ చేరి తమాషా చూస్తున్నారు. దైవప్రవక్త (సల్లం) “సజ్దా” చేయగానే "అబూ జహల్" బండరాయిని బలవంతంగా పైకి ఎత్తుకున్నాడు. మెల్లగా ఆయన (సల్లం) వైపునకు కదిలాడు. ప్రవక్త (సల్లం) దగ్గరకు వెళ్ళగానే ఓడిపోయినవాడిలా వెనక్కు పారిపోయి వచ్చేస్తున్నాడు. "అబూ జహల్" ముఖకవళికలు మారిపోయి ఉన్నాయి. అతని ముఖాన రక్తం చుక్క లేదు. రెండు చేతుల్లో ఎత్తుకుని ఉన్న రాయి కూడా క్రిందపడనట్లు అతుక్కు పోయి ఉంది. ఎంతో కష్టం మీద దాన్ని క్రింద పడవేయగలిగాడు.

అటు ఖురైష్ కు చెందిన కొందరు లేచి అతని దగ్గరకు వచ్చి, “అబుల్ హకం! నీకేమైంది ?” అని అడిగారు.

అబూ జహల్ : - నేను రాత్రి మీతో చెప్పినట్లుగానే చేయబోయాను, కాని ఆయన (సల్లం) దగ్గరకు వెళ్ళగానే ఓ ఒంటె నాకు, ఆయన (సల్లం)కు నడుమ వచ్చేసింది. దైవసాక్షి! నేనెప్పుడూ అలాంటి ఒంటెను చూడలేదు. భయంకరమైన దాని తలా, మెడ, పళ్ళు నేనిప్పటివరకు ఎక్కడా చూడలేదు. అది నన్ను తినేయడానికి ముందుకు రాసాగింది. (అని చెప్పాడు)

"ఇబ్నె ఇస్'హాక్" ఉల్లేఖనంలో, దైవప్రవక్త (సల్లం) ఆయనతో ఇలా అన్నారని ఉంది.

"ఆయన జిబ్రీల్ (అలైహి). అబూ జహల్ గనక నా దగ్గరకు వచ్చి ఉంటే, అతణ్ణి హతమార్చి పారేసేవారు."

 *[ఇబ్నె హష్షామ్ - 1/298,299.]* 

 *ఇదే కథనం, మరో "సీరతున్నబి కితాబ్" ప్రకారం : - ↓* 

●"మిత్రులారా! దైవసాక్షిగా చెబుతున్నా! వినండి. రేపు ఒక పెద్ద బండరాయిని తీసుకొని కాబా దగ్గర కూర్చుంటాను. ముహమ్మద్ (సల్లం) నమాజు చేయడానికి వస్తాడు కదా! అతను (సల్లం) "సజ్దా"లోకి పోగానే, బండరాయిని ఎత్తి అతని (సల్లం)పై పడవేస్తాను. ఒకే ఒక్క దెబ్బకు అతని తలకాయ చితికిపోతుంది. మీరు సహకరించినా, సహకరించకపోయినా నేను ఈ పనిచేసి తీరతాను.  ఆ పైన ఏమౌతుందో చూస్తా. మునాఫ్ తెగ వాళ్ళు ఏం చేస్తారో అదీ చూద్దాం."

"మిత్రమా! మేము నీతో సహకరించకపోవడమనేది ఎన్నటికీ జరగదు. నీవు అనుకున్న పని నిర్భయంగా చేసేయ్యి. నీకు మా మద్దతు పూర్తిగా ఉంటుంది." అన్నారు అతని సహచరులు అతన్ని మరింత ఉసిగొల్పుతూ.

మరునాడు ఉదయం "అబూ జహల్" అనుకున్న పథకం ప్రకారం ఒక పెద్ద బండరాయిని తీసుకుని, కాబా దగ్గర దైవప్రవక్త (సల్లం) రాకకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కాసేపటికి దైవప్రవక్త (సల్లం) వచ్చి నమాజులో నిమగ్నులైపోయారు. ఆయన (సల్లం) "సజ్దా" లోకి పోగానే "అబూ జహల్" బండరాయిని ఎత్తుకొని ముందుకు నడిచాడు.

కొంచెం దూరంలో కూర్చున్న అతని సహచరులు జరగబోయే తమాషా కోసం ఊపిరి బిగబట్టి చూడసాగారు.

అబూ జహల్, మరో రెండడుగులు ముందుకు వేసి ఎందుకో అకస్మాత్తుగా ఆగిపోయాడు. ఆ తరువాత మరో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక ముచ్చెమటలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. చేతుల్లో బండరాయి అలాగే పట్టుకొని గజగజా వణికిపోతూ నిల్చున్నాడు.

అతని స్నేహితులు అది చూసి మ్రాన్పడిపోయారు. దగ్గరకు వెళ్ళి, "అబూ జహల్! ఏమైంది? అలా వణికిపోతున్నావు!" అని అడిగారు.

"గుడ్డి వెధవల్లారా! మీకు కన్పించడం లేదా? నా ముందు అగ్నిగుండం భగభగా ఎలా మండుతుందో చూడండి. ఇక ఏ మాత్రం అడుగు ముందుకేసిన కాలి బూడిదయిపోతాను." అని అన్నాడు అబూ జహల్ రొప్పుతూ.

ఈ మాటలు విని వారు మరింత ఆశ్చర్యపోయారు.

"అగ్నిగుండమా! ఏదీ, ఎక్కడ? కాదు, ఇదంతా నాటకం. ఇతను ఈ పని చేయడానికి భయపడుతున్నాడు. తప్పించుకోవడానికి ఇదో ఎత్తుగడ." అని అనుకున్నారు వారు.

అయితే వారిలో ఒకడు "అబూ జహల్" ఎత్తుకున్న రాయిని తీసుకుని, దైవప్రవక్త (సల్లం)ని సమీపించబోయాడు. అతను కూడా ఠక్కున ఆగిపోయాడు. ముందుకు అడుగు వేయలేక జావగారిన ముఖంతో వెనక్కు మరలాడు. ●

ఆ తరువాత "అబూ జహల్" చేసిన మరో దుష్కృతం, "హజ్రత్ ఉమర్ (రజి)"ను మరియు "హజ్రత్ హమ్'జా (రజి)"ను ఇస్లాం స్వీకరించేటట్లు చేసింది. వివరణ ముందు రాబోతోంది.

మిగిలినది Insha Allah రేపటి భాగములో....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment