137

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  137* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 52* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

 _(నిన్నటి భాగము కొనసాగింపు)_ 

రాజు "నజాషీ" ఖురైష్ ప్రతినిధులతో...., "వీళ్ళను మీవెంట పంపించే ప్రసక్తే లేదు. ఇక మీరు వచ్చిన దారే వెళ్లిపోవచ్చు." అని అన్నాడు.

ఖురైష్ ప్రతినిధులు బిక్కమొహం వేసుకొని "నజాషీ" దర్బారు నుండి బయటకు వచ్చి మక్కా దారి పట్టారు.

అబీసీనియా వెళ్ళిన తమ ప్రతినిధులు, ముస్లిములను బంధించి తెస్తారని గంపెడాశతో మక్కాలో ఖురైష్ నాయకులు ఎదురుచూస్తున్నారు. తీరాచూస్తే తమ ప్రతినిధులు వాడిన ముఖాలతో వట్టిచేతులతో ఊపుకుంటూ రావడం చూసి నీరుగారిపోయారు.

"మేము చేయవలసినదంతా చేశాం. దర్బారీలకు, పాదరీలకు కూడా కానుకలు ముట్టజెప్పాం. కాని లాభం లేకపోయింది. జాఫర్ (రజి) వినిపించిన "ఖుర్ఆన్" వాణితో "నజాషీ" ప్రభావితుడై కంట తడిపెట్టాడు. అదేమీ చోద్యమోగాని ఈ ముస్లిములు ఎక్కడికి పోయినా జనం వారి బుట్టలో పడిపోతున్నారు. వీళ్ళను గట్టిగా అణచివేయకపోతే ఒక్క అరేబియా మాత్రమే కాదు, యావత్తు ప్రపంచమే వారికి వశమయిపోతుంది.” అన్నారు ప్రతినిధులు.

 *క్రైస్తవుల ఇస్లాం స్వీకరణ : -* 

మహనీయ ముహమ్మద్ (సల్లం) ప్రచారం చేస్తున్న నూతన ధర్మం గురించి అరేబియా అంతటా తెలిసిపోయింది. అబీసీనియాకు వలసపోయిన ముస్లింల ద్వారా అక్కడి క్రైస్తవులకు తెలియగానే నిజానిజాలు నిర్ధారించుకోవడానికి, అబీసీనియా క్రైస్తవులు ఒక ప్రతినిధివర్గాన్ని మక్కాకు పంపించారు. ఆ ప్రతినిధులు మక్కా చేరుకొని దైవప్రవక్త (సల్లం)ను కలుసుకున్నారు.

దైవప్రవక్త (సల్లం), అబీసీనియా క్రైస్తవుల ప్రతినిధివర్గాన్ని సాదరంగా ఆహ్వానించి కొన్ని "ఖుర్ఆన్" సూక్తులు వినిపించారు. దివ్యవాణి వినగానే వారి హృదయాలు దైవభీతితో ద్రవించిపోయాయి. నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి. వెంటనే వారు సత్య ధర్మం స్వీకరించారు. అనిర్వచనీయమైన ఆనందానుభూతితో తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ సంగతి తెలుసుకున్న ఖురైష్ నాయకుడు "అబూ జహల్" మరియు అతని సహచరులు దారిలో, అబీసీనియా క్రైస్తవుల ప్రతినిధివర్గాన్ని అటకాయించి అనరాని మాటలు అన్నారు.

"అబూ జహల్" అయితే మరింత పెట్రేగిపోయాడు; “దేవుడు మిమ్మల్ని నాశనం చేయ! మీ జాతి ప్రజలు మిమ్మల్ని నిజానిజాలు తెలుసుకుని రమ్మని పంపితే, మీరు విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండానే ముహమ్మద్ (సల్లం) వలలో పడిపోయారా? మీ సాంప్రదాయక మతాన్ని వదలి పెట్టి మతభ్రష్టులయ్యారా?” అన్నాడతను.

కాని ప్రతినిధివర్గం సభ్యులు ఖురైషీయుల దూషణలను ఏమాత్రం పట్టించుకోలేదు.

 *మేము లోగడ ఎవరికయితే గ్రంథం వొసగామో వారు దీనిని (ఖుర్ఆన్) కూడా విశ్వసిస్తారు (1). వారికి, దానిని (ఖుర్ఆన్ ను) చదివి వినిపించినప్పుడు, "ఇది మా ప్రభువు తరఫునుంచి వచ్చిన సత్యం అని మేము విశ్వసిస్తున్నాము. అసలు మేము దీనికి ముందు నుంచే ముస్లిములుగా ఉన్నాము" అని వారు చెబుతారు (2). తాము చూపిన నిలకడ (సహన స్థయిర్యాల)కు గాను వారు రెండింతల ప్రతిఫలం ప్రసాదించబడతారు. వారు మంచి ద్వారా చెడును పారద్రోలుతారు. మేము ప్రసాదించిన దానిలో నుంచి (దానధర్మాల రూపేణా) ఖర్చు పెడతారు (3). వారు ఏదైనా పనికిమాలిన విషయం విన్నప్పుడు, వినీవిననట్లుగా తరలిపోతారు. "మా కర్మలు మావి. మీ కర్మలు మీవి. అయ్యా! మీకో సలాం అజ్ఞానులతో వాదించదలచుకోలేదు" అని చెప్పేస్తారు (4). (ఖుర్ఆన్ 28:52-55)* 

 _(1 → వీరు ఒకప్పుడు యూదులుగా ఉండి ఇస్లాం స్వీకరించినవారు. ఉదాహరణకు; అబ్దుల్లా బిన్ సలాం (రజి) తదితరులు. లేదా అబీసీనియా నుంచి దైవప్రవక్త (సల్లం) వద్దకు వచ్చిన క్రైస్తవులు. దైవప్రవక్త (సల్లం) నోట "దివ్యఖుర్ఆన్" వాక్యాలను వినగానే వారు ఇస్లాం స్వీకరించారు (ఇబ్నె కసీర్))._ 

 _(2 → "దివ్యఖుర్ఆన్"లో పదే పదే నొక్కి వక్కాణించబడిన విషయమే ఇది. దేవుడు అన్ని కాలాలలో, అన్ని ప్రాంతాలలో తన సందేశహరుల ద్వారా మానవాళికి అందజేసిన ధర్మం ఇస్లాం ధర్మమే. వారంతా ఆయా ప్రవక్తల సందేశం విని విశ్వసించిన ముస్లింలే అనబడతారు. యూదులు, క్రైస్తవులు అనే ఈ ప్రత్యేక పరిభాష ప్రజలు తమంతట తాముగా కల్పించుకున్నది మాత్రమే. ప్రవక్తల తదనంతరం ఈ ‘పరిభాష’ పుట్టుకు వచ్చేది. నిజానికి ఆ ప్రవక్తల అనుయాయులు ముస్లింలే. అందుకే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం)ను విశ్వసించిన గ్రంథవహులు (యూదులు, క్రైస్తవులు) ఇలా అన్నారు: “మేము ముందు నుంచే ముస్లిములుగా ఉన్నాము.” అంటే మేము పూర్వపు ప్రవక్తలను విశ్వసించి, వారు చూపిన విధానాన్ని అవలంభిస్తూ ఉన్నాము.)_ 

 _(3 → ఇక్కడ ‘సబ్ర్’ (సహనం) అంటే స్థయిర్యం, నిలకడ అని అర్థం. అంటే సర్వకాల సర్వావస్థల్లో దైవప్రవక్తల మార్గంపై, దైవగ్రంథంలోని ఆజ్ఞాలపై స్థిరత్వం కలిగి ఉండటం అన్నమాట. పూర్వం వారు దైవగ్రంథంపై విశ్వాసం కలిగి ఉండేవారు. ఆ తరువాత "ఖుర్ఆన్" గ్రంథం అవతరించగా దాన్ని విశ్వసించారు. పూర్వం వారు తమ ప్రవక్త పై విశ్వాసం కలిగి ఉండేవారు. ఆ తరువాత మరోప్రవక్త (సల్లం) రాగా ఆయన్ని కూడా విశ్వసించారు. ఇలాంటి వారికి రెండింతల పుణ్యఫలం వొసగబడుతుంది. హదీసులో కూడా ఇలాంటి సజ్జనుల గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఇలా ప్రకటించారు: “మూడు రకాల మనుషులకు రెండింతల పుణ్యఫలం ప్రసాదించబడుతుంది. వారిలో ఒకరెవరంటే గ్రంథవహులు. ఇంతకు ముందు వారు తమ ప్రవక్తను విశ్వసించేవారు. ఆ తరువాత వారు నన్ను విశ్వసించారు.” (సహీహ్ బుఖారీ - కితాబుల్ ఇల్మ్; ముస్లిం – కితాబుల్ ఈమాన్)_ 

 _వారు దుర్మార్గాన్ని దుర్మార్గం ద్వారా ఎదుర్కొనరు. అపకారానికి బదులుగా అపకారం తలపెట్టరు. పైగా తమకు కీడు తలపెట్టిన వారిని ఉపేక్షిస్తారు. వారిని మన్నించి వదలిపెడతారు. చేతనైతే వారికి మేలు కూడా చేస్తారు. ఇది మహోపకారుల లక్షణం.)_ 

 _(4 → ఇక్కడ పనికిమాలిన విషయం అంటే అర్థం సత్యధర్మానికి వ్యతిరేకంగా అలనాడు ముష్రిక్కులు వ్యంగ్య ధోరణిలో చెప్పే మాటలన్నమాట. వీలు చిక్కినప్పుడల్లా వారు ఇస్లాంను, ముస్లిములను తమ ఎత్తిపొడుపు మాటలతో అవమానపరచ జూసేవారు. అలాంటి సమయాలలో ఈ త్యాగధనులు హుందాగా నిష్క్రమించేవారు. “మీకో సలాం” అంటే ఇక్కడ ఆశీర్వాదం లేక దీవెన అని అర్థం కాదు. “ఇక చాలించండి మీ అధిక ప్రసంగాన్ని. మీతో మేము వాదులాడదలచుకోలేదు” అన్న భావం ఇందులో ఇమిడి ఉంది.)_ 

ఏదిఏమైనా బహుదైవారాధకుల ఈ కుట్ర, కుతంత్రాలు విఫలం అయిపోయాయి. తమ విద్వేషవైషమ్యాలను బహిర్గతం చేసుకోడానికి, తమ అక్కసును కేవలం తమ అధికార పరిధిలోనే వెళ్ళగక్కడం తప్ప మరే గత్యంతరంలేదనే విషయం వారికి తెలిసిపోయింది. దీనికోసం వారు ఓ భయంకరమైన ప్రణాళిక గురించి అలోచించనారంభించారు. నిజానికి, ఈ ఉపద్రవాన్ని అడ్డుకోవడానికి వారి ముందు రెండే రెండు మార్గాలున్నాయన్న విషయం బాగా అర్థమైపోయింది :

1 - తమ శక్తినుపయోగించి దైవప్రవక్త (సల్లం)ను దైవసందేశ ప్రచారం చేయకుండా అడ్డుకోవడం.

2 - ఆయన (సల్లం)ను తుదముట్టించడం.

అయితే రెండో మార్గం అతి కష్టంతో కూడుకున్న మార్గం. ఎందుకంటే, "అబూ తాలిబ్" దైవప్రవక్త (సల్లం) రక్షకులుగా ఉంటూ, బహుదైవారాధకుల ముందు పటిష్టమైన ఇనుప గోడలా నిలబడి ఉండడం. అందుకని "అబూ తాలిబ్"తో ముఖాముఖిగా వ్యవహారాన్ని తేల్చుకోవడమే మంచిదని గ్రహించారు ఖురైష్ నాయకులు.

 *"అబూ తాలిబ్"కు ఖురైష్ బెదిరింపు : -* 

ఈ ప్రతిపాదన ప్రకారం, ఖురైష్ సర్దారులు "అబూ తాలిబ్" వద్దకు వెళ్ళారు. అపుడు ఖురైష్ నాయకులు, "అబూ తాలిబ్"ను ఉద్దేశించి....,

ఖురైష్ నాయకులు : - అబూ తాలిబ్! మీరు వయస్సు రీత్యా, గౌరవ మర్యాదల రీత్యా మాలో పెద్దవారు. మేము ఇదివరకే మీ సోదర కుమారుణ్ణి అడ్డుకోమని చెప్పాం. కాని మీరు అలా చేయలేదు. మా తాతముత్తాతల్ని తూలనాడడం, మా బుద్ధివివేకాల్లో లోపాలు ఎంచడం, మా ఆరాధ్య దైవాలను కించపరచడం మేము ఇక భరించలేం. మీరే గనక ఆయన (సల్లం)ను అడ్డుకోకపోతే మీతో, ఆయన (సల్లం)తో యుద్ధానికి దిగవలసివస్తుంది. అందు(లో) ఎవరో ఒకరు తుడుచుకుపోక తప్పదు. (అని చెబుతూ బెదిరించారు)

"అబూ తాలిబ్"పై ఖురైష్ నాయకుల ఈ బెదిరింపు బాగా ప్రభావం చూపింది.

 *ఆయన, ప్రవక్త (సల్లం)ను పిలిపించి....,* 

అబూ తాలిబ్ : - సోదర కుమారా! నీ జాతి నాయకులు నా వద్దకు వచ్చి ఇలా ఇలా అన్నారు. ఇక నీవు నా గురించి, నీ గురించి ఆలోచించు. నేను మోయ్యలేని భారాన్ని నాపై మోపకు. (అని నచ్చజెప్పారు)

ఇది విన్న దైవప్రవక్త (సల్లం), పినతండ్రి కూడా తమను వదిలేసేటట్లున్నాడు, ఆయన పట్టు బలహీనం అవుతున్నదని గ్రహించి ఇలా సెలవిచ్చారు....,

ముహమ్మద్ (సల్లం) : - పెదనాన్న! దైవసాక్షి! వీరు నా కుడి చేతిలో సూర్యుణ్ణి, ఎడమ చేతిలో చంద్రుణ్ణి తెచ్చి ఉంచినా, నేను ఈ కార్యాన్ని దాని హద్దు వరకు తీసుకుని వెళ్ళకుండా ఆగలేను. "అల్లాహ్", తన శిక్షనైనా అవతరింపజెయ్యాలి లేదా ఈ మార్గంలో నేనైనా నామరూపాల్లేకుండా పోవాలి. అప్పటి వరకు ఈ సందేశ ప్రచారాన్ని ఆపేది లేదు. (అని నిక్కచ్చిగా చెప్పారు)

ఆ తరువాత ప్రవక్త (సల్లం) కళ్ళు కన్నీటిమయమయ్యాయి. రోదిస్తూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోబోగా "అబూ తాలిబ్" ఆయన (సల్లం)ను కేకవేసి పిలిచారు. ప్రవక్త (సల్లం) ఎదురుకు రాగానే....,

అబూ తాలిబ్ : - కుమారా! నీకిష్టమైనట్లు ప్రచారం చెయ్యి. దైవసాక్షి! నేను నిన్ను ఎప్పుడూ ఏ కారణం చేత కూడా విడిచిపెట్టేది లేదు.

అని అంటూ ఈ క్రింది పద్యపంక్తుల్ని వల్లించారు.

అర్థం : - దైవసాక్షి! వారు తమ మందీమార్బలంతో నీ వద్దకు రానైనా రాలేరు. నేను చనిపోయి ఖననం అయిపోతే తప్ప. నీవు నీ మనోభీష్టాన్ని విడమర్చి చెప్పు. నీకేలాంటి ఆటంకమూ ఉండదు. సంబరపడు, నీ కళ్ళు చల్లపడతాయి.

 *ఖురైష్ బృందం మరోసారి "అబూ తాలిబ్" వద్దకు : -*

గతంలో చేసిన బెదిరింపుకు ఎలాంటి సమాధానమూ లభించలేదు. పైగా ప్రవక్త (సల్లం) తన పనిని చేసుకుంటూనే పోతున్నారు. అప్పుడు ఖురైష్ నాయకులకు అర్థమైపోయింది., అబూ తాలిబ్ ప్రవక్త (సల్లం)ని వదలలేరన్న సంగతి. పైగా ఆయన ఖురైష్ నుండి వేరుబడి, ఖురైషీయుల శత్రుత్వాన్ని కూడా కొని తెచ్చుకోడానికైనా సిద్ధంగా ఉన్నారన్న విషయం తేలిపోయింది. కాబట్టి ఖురైష్ నాయకులు "వలీద్ బిన్ ముగైరా" కుమారుణ్ణి వెంటబెట్టుకుని "అబూ తాలిబ్" దగ్గరకు వచ్చారు. అపుడు ఖురైష్ నాయకులు, అబూ తాలిబ్ ను ఉద్దేశించి....,

ఖురైష్ నాయకులు : - ఓ అబూ తాలిబ్! ఇతను ఖురైష్ కు చెందిన నవయవ్వనంలో ఉన్న అందమైన యువకుడు. ఇతని సహాయానికీ, ఇతని సంపాదనకు మీరే హక్కుదారులు కాగలరు. ఇతన్ని మీరు మీ పుత్రునిగా స్వీకరించండి. ఇతను మీవాడే అయిపోతాడు. ఇతనికి బదులుగా మీరు మీ సోదరుని కుమారుడు, ముహమ్మద్ (సల్లం)ని మాకు అప్పగించండి. అతను మా తాతముత్తాతల ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడు. మా జాతిని చిన్నాభిన్నం చేసేస్తున్నాడు. వారి తెలివితేటలకు సవాలు విసురుతున్నాడు. మేము అతణ్ణి చంపేస్తాం. ఒక మనిషికి బదులుగా మరొక మనిషిని ఇస్తున్నాం, లెక్కసరిపోతుంది చాలదా?

ఈ మాటలు వినగానే "అబూ తాలిబ్" కోపోద్రుకుడై పోయాడు.

 *మిగిలినది Insha Allah రేపటి భాగములో....,* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment