136

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  136* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 51* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

 _(నిన్నటి భాగము కొనసాగింపు)_ 

ఫలితం ఎలాగున్నా సరే, తాము పూర్తి యదార్థమైన విషయాన్నే తెలపాలన్న సంకల్పంతో ఆ ముస్లిం యువకులు రాజు సన్నిధికి హాజరయ్యారు.

ముస్లిములు దర్బారులోనికి వచ్చి నిలబడిన తర్వాత రాజు "నజాషీ" వారిని ఉద్దేశించి...., "మీరు మీ జాతి నుండి వేరుబడడానికి ఆధారభూతమైన ఆ క్రొత్త ధర్మం ఏమిటి? నేను విశ్వసించే ధర్మాన్ని (క్రైస్తవ ధర్మాన్ని) కూడా మీరు అవలంబించలేదు. మరే మతాల్లో దేన్నయినా విశ్వసించడం లేదు. దానికి కారణం ఏమిటి?" అని ప్రశ్నించాడు.

రాజు కు సమాధానంగా ముస్లింల వైపు నుంచి, దైవప్రవక్త (సల్లం) పెదనాన్న "అబూ తాలిబ్" గారి కుమారుడు "హజ్రత్ జాఫర్ (రజి)" ముందుకొచ్చి తన సమాధానాన్ని ఇలా వినిపించారు.

“ఓ మహారాజా! అజ్ఞానంలో కొట్టుమిట్టాడే జాతి మాది. ఇదివరకు మేము విగ్రహాల్ని పూజించేవారం. చనిపోయిన జంతువుల మాంసాన్ని భుజించేవారము. వ్యభిచారానికి పాల్పడేవారం. బంధువులతో సంబంధాల్ని త్రెంచుకునేవాళ్ళం. పొరుగువారి యెడల దురుసుగా ప్రవర్తించేవారం. మాలోని శక్తివంతుడు బలహీనుణ్ణి అణచివేసేవాడు. మేము ఈ పరిస్థితిలో ఉండగా "అల్లాహ్" మా జాతి నుండే ఓ ప్రవక్తను పంపాడు. ఆయన (సల్లం) వంశం ఉన్నతమైనది. ఆయన (సల్లం) సత్యసంధత, అమానతులను రక్షించడం, పవిత్రతను మేము మొదటి నుండే ఎరిగి ఉన్నవాళ్ళం. ఆయన (సల్లం) మమ్మల్ని "అల్లాహ్" మార్గం వైపునకు పిలిచాడు. మేము ఒకే దేవుణ్ణి విశ్వసించాలని, ఆయన్నే ఆరాధించాలని, ఆయన తప్ప ఏ రాయిరప్పలను విగ్రహాలను మా తాతముత్తాతలు మరియు మేము పూజిస్తూ వచ్చామో వాటిని విసర్జించాలని భోధించారు. సతతం సత్యం పలకడం, అమానతులను (అప్పగింతలను) అప్పజెప్పడం, సంబంధాలను పెంపొందించుకోవడం, పొరుగువారితో సద్వర్తనగా మెలగడాన్ని ప్రేరేపిస్తూ, వ్యభిచారం, రక్తపాతాన్ని వదిలేయమని ఆదేశించారు. దుష్కార్యాలలో చిక్కుకోవడం, అసత్యం పలకడం, అనాధల ఆస్తుల్ని కాజేయడం మరియు శీలవంతులైన మహిళలపై అపనిందలు వేయడం లాంటి కార్యాల నుండి మమ్మల్ని వారించారు. ఆయన (సల్లం) మమ్మల్ని ఒకే "అల్లాహ్"ను ఆరాధించమని, ఆయనకు సారి కల్పించవద్దని ఆదేశించారు. నమాజు చేయమని, రోజా వ్రతాన్ని పాటించమని, జకాత్ చెల్లించమని ఆజ్ఞాపించారు.”

హజ్రత్ జాఫర్ (రజి) అలానే ఇస్లాం సుగుణాలను ఏకరువు పెడుతూ, “మేము ఆ ప్రవక్తను సత్యప్రవక్తగా నమ్మాము, ఆయన్ను విశ్వసించాము. ఆయన (సల్లం) తెచ్చిన దైవధర్మం ప్రకారం నడుచుకుంటున్నాము. ఏయే విషయాలను ప్రవక్త (సల్లం) హరాం (నిషిద్ధం) చేశారో వాటిని హరాం గానూ, మరే వస్తువుల్ని హలాల్ (ధర్మసమ్మతం) చేశారో వాటిని ధర్మసమ్మతం అయినవిగానూ తలచాము.

దీనికి మా జాతి మా ఎడల ఉగ్రరూపం దాల్చింది. అది మాపై దౌర్జన్యాలు చేసి హింసించింది. మమ్మల్ని మా ధర్మం నుండి తప్పించడానికి పన్నాగాలు పన్నింది, మమ్మల్ని శిక్షించింది. మా జాతి మమ్మల్ని "అల్లాహ్" ఆరాధన చేయకుండా తిరిగి విగ్రహారాధన వైపు మరలేందుకు; ఏ అశుద్ధ పదార్థాలను వారు ధర్మసమ్మతం చేసుకున్నారో తిరిగి మేము వాటిని ధర్మసమ్మతమైనవిగా భావించాలని ఒత్తిడి తెచ్చింది. వీరిలా మాపై చేస్తున్న ఆగడాలను, హింసా దౌర్జన్యాలను అధికం చేసిన తరువాత, మాకు నిలువనీడ లేకుండా చేసినప్పుడు, మా నడుమ, మా ధర్మం నడుమ అడ్డంగా వచ్చి నిలబడినప్పుడు మేము తమ దేశానికి వలస రావలసివచ్చింది. ఇతరులకంటే మిమ్మల్నే నమ్మి మీ రక్షణలో ఉండడానికి సంసిద్ధులమై వచ్చాము. ఓ రాజా! మీ వద్ద ఉన్నంత వరకు మాపై ఎలాంటి జులుం జరుగదని మేము ఆశిస్తున్నాము.” అని విన్నవించుకున్నారు. 

నజాషీ : - మీ ప్రవక్త తెచ్చిన ధర్మంలోనిది ఏదైనా దైవవాణి మీ దగ్గర ఉందా?

జాఫర్ (రజి) : - ఉంది!

నజాషీ : - అయితే అదేమిటో చదివి వినిపించండి.

అపుడు హజ్రత్ జాఫర్ (రజి), "మరియం" సూరాలోని మొదటి ఆయత్ లను పఠించి వినిపించారు. "దివ్యఖుర్ఆన్" లోని ఈ పఠనాన్ని వినగానే రాజు "నజాషీ" మరియు క్రైస్తవ మతగురువులు బాగా రోదించారు. కన్నీటితో వారి గెడ్డాలు తడిసిపోయాయి.

 *ఆ తరువాత "నజాషీ" ఇలా అన్నారు...., ↓* 

"ఈ గ్రంథం మరియు ఈసా (యేసుక్రీస్తు - అలైహి) తెచ్చిన గ్రంథం ఒకే దివ్వె నుండి వెలిసిన వెలుగులు” అంటూ "అమ్రూ బిన్ ఆస్" మరియు "అబ్దుల్లా బిన్ రబీయా"ను ఉద్దేశించి...., “మీరిద్దరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నేను వీరిని మీకు అప్పగించేది లేదు. వీరికి వ్యతిరేకంగా ఏ ఎత్తుగడా ఇక్కడ పనికి రాదు” అని చెప్పాడు.

ఈ రాజాదేశం వెలువడ్డాక వారిరువురు దర్బారు నుండి బయటకు వచ్చారు. అపుడు "అమ్రూ బిన్ ఆస్" మాత్రం "అబ్దుల్లా బిన్ రబీ"ను ఉద్దేశించి....,

అమ్రూ బిన్ ఆస్ : - దైవసాక్షి! రేపు చూద్దువుగాని. వారి గురించి నేనే ఎత్తుగడ పన్నుతానో! వారు కూకటివ్రేళ్ళతో పెకిలించబడతారు.

అబ్దుల్లా బిన్ రబీయా : - పోనిద్దువూ! వారు మనకు వ్యతిరేకంగా చెప్పినప్పటికీ మన కుటుంబానికి, మన తెగకు చెందినవారే కదా!

"అబ్దుల్లా బిన్ రబీయా" ఈ విధంగా నచ్చజెప్ప ప్రయత్నం చేశాడు. కాని "అమ్రూ బిన్ ఆస్" మాత్రం ఆయన మాటల్ని పట్టించుకోలేదు. మరుసటి రోజు "అమ్రూ బిన్ ఆస్", "నజాషీ" దర్బారుకు వెళ్ళి...., "ఓ మహారాజా! వీరు మరియం (అలైహి) కుమారుడు హజ్రత్ ఈసా(అలైహి) (యేసు) పై ఓ తీవ్రమైన నిందను వేస్తున్నారు” అని చెప్పాడు.

దీనికి "నజాషీ" తిరిగి ముస్లిములను దర్బారుకు రప్పించాడు. ముస్లిములు హజ్రత్ ఈసా (అలైహి) గురించి చేస్తున్న ఆ తీవ్రమైన వాఖ్యలు ఏమిటో తెలుసుకునే ఉద్దేశ్యంతో, ఈ సారి ముస్లిములు కొంత తడబడ్డారు. అయితే వారు, ఏది చెప్పినా నిజాన్నే చెబుతామని, దాని పరిణామం ఏమైనాసరే అని నిర్ణయించుకొని దర్బారులో హాజరయ్యారు. "నజాషీ" వారినుద్దేశించి ఆ విషయాన్నే ప్రస్తావించాడు.

జాఫర్ (రజి) : - మహారాజా! మేము హజ్రత్ ఈసా (అలైహి) గురించి మా ప్రవక్త (సల్లం) చెప్పిందే చెబుతున్నాం. అదేమిటంటే, ఈసా (అలైహి) "అల్లాహ్" యొక్క ప్రవక్త అని, ఆయన ఒక ఆత్మ అని, కన్య అయిన పవిత్ర మరియం (అలైహి) గర్భాన జన్మించినవాడని, మా ప్రవక్త (సల్లం) మాకు బోధించారు.

దీనికి "నజాషీ" భూమ్మీద నుండి ఓ గడ్డిపోచ పైకెత్తి....,

నజాషీ : - దైవసాక్షి! మీరు చెప్పింది యదార్థం. హజ్రత్ ఈసా (అలైహి) ఈ గడ్డిపోచకంటే మెరుగైన వాడు కారు. (అని అన్నారు)

ఈ మాటలు విని, అక్కడున్న క్రైస్తవ మతగురువుల నోటి నుండి ఆశ్చర్యాన్ని వెలిబుచ్చినట్లుగా “ఆ, అదేమిటి!” అనే పలుకులు వెలువడ్డాయి.

"నజాషీ" వారి ఈ హూంకరింపును విని, “మీరు హూంకరించినా సరే (ఇది యదార్థం)!” అని పలికాడు.

ఆ తరువాత "నజాషీ", ముస్లిములను ఉద్దేశించి....,

నజాషీ : - వెళ్ళండి, నా రాజ్యంలో ప్రశాంతంగా బ్రతకండి. మీ యెడల దుర్భాషలాడేవానికి జరిమానా విధించబడుతుంది. మిమ్మల్ని బాధించడం వల్ల నాకు బంగారు కొండ లభించినా సరే, దాన్ని నేను సహించేదిలేదు.

ఆ తరువాత "నజాషీ", తన దర్బారులోని వారిని ఉద్దేశించి...., “వీరిద్దరు (ఖురైష్ నాయకులు) తెచ్చిన కానుకలను వారి ముఖాన పడవేయండి. దైవసాక్షి! నాకు, నా రాజ్యాన్ని తిరిగి ప్రసాదించేటప్పుడు "అల్లాహ్" ఎలాంటి లంచం పుచ్చుకోలేదు. అలాంటప్పుడు నేనెలా ఈ లంచాన్ని స్వీకరించగలను? దానికి తోడు "అల్లాహ్" నా విషయంలో ఎవరి మాటనూ వినలేదు. నేనెలా ఇతరుల మాటను వినగలను?” అని చెప్పి సభను చాలించాడు.

 *ఇదే సంఘటన గురించి వేరొక "సీరతుల్ కితాబ్" ప్రకారం : -* 

నజాషీ : - సరే, ఆయన (సల్లం)పై అవతరించిన దైవవాణి మీ దగ్గర ఏమైనా ఉందా? ఉంటే పఠించండి, నేను వింటాను.

హజ్రత్ జాఫర్ (రజి) ''మర్యం'' అధ్యాయంలోని కొన్ని సూక్తులు పఠించారు. "ఖుర్ఆన్" వాణి విని "నజాషీ" ఎంతో ప్రభావితుడై కంటతడి పెట్టాడు. పాదరీల కళ్ళు కూడా అప్రయత్నంగా అశ్రుపూరితాలయ్యాయి.

నజాషీ : - "దైవసాక్షి! ఈ వాణిలో సత్యతా పరిమళం తొంగి చూస్తుంది, ఈ వాణి మూసా (అలైహి)పై అవతరించిన "తౌరాత్"వాణి ఒకే చెట్టు కొమ్మలుగా, ఒకే జ్యోతి కిరణాలుగా గోచరిస్తున్నాయి. (అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ)

ఖురైష్ ప్రతినిధులు : - మహారాజా ! అక్కడే ఉంది కిటుకంతా. వీరు ముహమ్మద్ (సల్లం) రాసిచ్చిన ఈ వాణి పఠిస్తుంటే , శ్రోతలు ఎంతో ప్రభావితులైపోతారు. అసలు ఇది దైవవాణి కాదు. ముహమ్మద్ (సల్లం) సొంత వాణి.

ఈ మాట వినగానే హజ్రత్ జాఫర్ (రజి), వారిద్దరి వైపు ఉరిమిచూశారు.

జాఫర్ (రజి) : - అమ్ర్! నిజం చెప్పు. ముహమ్మద్ (సల్లం) చదవడం, వ్రాయడం రాణి నిరక్షరాసి అని నీకు తెలియదా?

అమ్ర్ : - ఆయన (సల్లం) వేరేవాళ్ళ చేత రాయిస్తారు.

ఈ మాటలు విన్న రాజు "నజాషీ" అందుకొని....,

నజాషీ : - అంటే నీవు మొదట అబద్దమాడావన్న మాట. ఆయన చదవడం, వ్రాయడం రాని వాడని నీవు అంగీకరిస్తుంటే, అలాంటి నిరక్షరాసి నోట ఇంతటి అద్భుతమైన వాణి వెలువడుతుందా? ద్వేషం, దురభిమానాలు నిన్ను అంధుడిగా చేశాయి.

ఈ మాట వినగానే అమ్ర్ భయపడిపోయాడు. ఇక తమను ఆయన దర్బారు నుంచి గెంటి వేయిస్తాడని భావించాడు. కొంచెం ధైర్యం తెచ్చుకుని చివరి అస్త్రం సంధించాడు. "మహారాజా! ఈ ముస్లింలు ఏసుక్రీస్తును గురించి చాలా చెడ్డగా మాట్లాడుతారు. ఆ మహానీయుడ్ని వీరు దేవుని కుమారుడిగా ఒప్పుకోరు."

"నిజమే ప్రభూ! ఈ కొత్త మతస్థులు ఏసు ప్రభువుని గురించి చెడుగా మాట్లాడుతారు” అంటూ ఒక పాదరీ ఖురైషీయులకు వంత పలికాడు. 

నజాషీ రాజు హజ్రత్ జాఫర్ (రజి) వైపు తిరిగి “ఏమిటీ ఇది నిజమా?” అని అడిగాడు.

(ఆ తర్వాత జరిగినందంతా, పైన చదువుకున్నట్టు యధాతథమే)

 *ఈ సంఘటనను గురించి వివరించిన "హజ్రత్ ఉమ్మె సల్మా (రజి)" ఇలా అంటారు.* 

“ఆ తరువాత వారిద్దరు తాము తెచ్చిన కానుకలను తమ చేతపట్టుకుని బిడియపడుతూ వెనక్కు తిరిగారు. మేము నజాషీ దగ్గర ఓ మంచి దేశంలో ఓ మంచి పొరుగువాని పంచన ఉండిపోయాము."

 *ఇది "ఇబ్నె ఇస్'హాక్ (రజి)" గారి కథనం : - ↓* 

ఇతర సీరత్ చరిత్రకారుల కథనం ప్రకారం, "నజాషీ" దర్బారులో "హజ్రత్ అమ్రూ బిన్ ఆస్" బద్ర్ యుద్ధం తరువాత గాని వెళ్ళారు. కొందరి పరిశోధన ప్రకారం, హజ్రత్ "అమ్రూ బిన్ ఆస్ (రజి)", "నజాషీ" దర్బారులో ముస్లిములను వెనక్కు తోడ్కొని రావడానికి రెండు మూడు సార్లు వెళ్ళారు. అయితే బద్ర్ యుద్ధం తరువాత "హజ్రత్ జాఫర్ (రజి)" మరియు "నజాషీ"ల నడుమ జరిగిన ప్రశ్నోత్తరాల వివరాలేవైతే చెప్పబడ్డాయో అవి దాదాపు ఇబ్నె ఇస్'హాక్ (రజి) చెప్పిన అబీసీనియా వలస సందర్భంలో జరిగిన ప్రశ్నోత్తరాల వివరాల్లాంటివే.

అయితే, ఈ ప్రశ్నల సారాంశాన్ని బట్టి తెలిసిందేమిటంటే, ఈ వ్యాజ్యం "నజాషీ" దర్బారులో మొదటిసారే ప్రవేశపెట్టడం జరిగింది అన్నదే. అందుకని, ముస్లిములను వెనక్కు తీసుకురావడానికి జరిగిన ప్రయత్నం అని గట్టిగా చెప్పగలం.

ఏది ఏమైనా బహుదైవారాధకుల ఈ కుట్ర, కుతంత్రాలు విఫలం అయిపోయాయి. తమ విద్వేషవైషమ్యాలను బహిర్గతం చేసుకోవడానికి, తమ అక్కసును కేవలం తమ అధికార పరిధిలోనే వెళ్లగక్కడం తప్ప మరే గత్యంతరంలేదనే విషయం వారికి తెలిసిపోయింది.

 *మిగిలినది Insha Allah రేపటి భాగములో....,* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment