135

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  135* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 50* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

 *విశ్వాసులపై, అవిశ్వాసుల హింసా దౌర్జన్యాలు ఉధృతమైన తరువాత, దైవప్రవక్త (సల్లం) ఆదేశంతో పన్నెండుమంది పురుషులు, నలుగురు స్త్రీలు గల మొదటి జట్టు అబీసీనియాకు వలస పోయింది. ఆ తరువాత జరిగిన సంఘటనలు....,* 

 *"సూరతుల్ నజ్మ్" యొక్క విశిష్టత : -* 

"సూరతుల్ నజ్మ్" అధ్యాయం నబవీశకం 5 వ ఏట అవతరించింది. ఇదివరకు దైవప్రవక్త (సల్లం) బహిరంగంగా "ఖుర్ఆన్" పఠిస్తున్నప్పుడల్లా అవిశ్వాసులు అల్లరిచేసి దైవవాణి జనానికి సరిగా వినిపించకుండా చేసేవారు. అయితే రమజాన్ నెలలో ఓ రోజు ఆయన (సల్లం) కాబాలో జనం ముందు ఈ అధ్యాయం పఠించసాగారు. అప్పుడు అవిశ్వాసులు అల్లరి చేయకుండా వినసాగారు. దైవప్రవక్త (సల్లం) ఈ అధ్యాయం పూర్తిగా పఠించి చివరి సూక్తి ముగింపులో సాష్టాంగప్రణామం (సజ్దా) చేశారు. ఇలా ఆయన (సల్లం)తో పాటు అవిశ్వాసులందరూ అప్రయత్నంగా సాష్టాంగప్రణామం చేశారు. తరువాత అవిశ్వాసులు తమ తప్పు తెలుసుకొని ఇస్లాంకు మరింత బధ్ధశత్రువులై పోయారు.

 *అబీసీనియాకు మొదటి హిజ్రత్ తర్వాత....,* 

విశ్వాసుల మొదటి జట్టు అబీసీనియాకు వలస వెళ్ళిన తర్వాత, మక్కాలో అవిశ్వాసులు మిగిలిన ముస్లిములను వేధిస్తూనే ఉన్నారు. అది రమజాన్ నెల. ఓ రోజు కాబా మందిరంలో ఖురైషీయులతో పాటు అనేకమంది సామాన్య ప్రజలు కూడా వచ్చి కూర్చున్నారు. అందరూ కబుర్లు చెప్పుకోవడంలో, నూతన ధర్మం గురించి ముచ్చటించుకోవడంలో మునిగిపోయారు.

అంతలో దైవప్రవక్త (సల్లం), ఆయన అనుచరగణం కాబాలోకి ప్రవేశించారు. అక్కడ ఖురైష్ ల గుంపు ఒకటి సమావేశమై ఉంది. వారిలో పెద్ద పెద్ద సర్దారులు కూడా ఉన్నారు. దైవప్రవక్త (సల్లం) హఠాత్తుగా నిలబడి "నజ్మ్" సూరా పఠనాన్ని ప్రారంభించారు. ఆ దైవధిక్కారులు ఇది వరకు "ఖుర్ఆన్" పఠనం వినలేదు. వారి వైఖరే అది. "దివ్యఖుర్ఆన్"లో వారి ఈ వైఖరి గురించి ఇలా చెప్పడం జరిగింది. ఈ సత్యతిరస్కారులు ఇలా అంటారు;

 *"ఈ ఖుర్ఆన్ ను అసలు వినకండి. అది వినిపించబడేటప్పుడు వినకుండా విఘ్నం కలిగించండి. బహుశా ఇలాగైనా మీరు ప్రాబల్యం వహించవచ్చు."* 

అయితే దైవప్రవక్త (సల్లం) హఠాత్తుగా "నజ్మ్" సూరా పఠనాన్ని ప్రారంభించారు. దైవప్రవక్త (సల్లం) "నజ్మ్" సూరా పఠించేటప్పుడు, వారి (అవిశ్వాసుల) చెవుల్లో అమృతం గ్రోలినట్లు తోచింది. దాని ఔన్నత్యాన్ని అనుభవించినప్పుడు ఎవ్వరికి తమ ధ్యాసే లేదు. ఎవరి మనస్సులోను ఎటువంటి చెడు ఉద్దేశ్యం జనించలేదు. చివరికి దైవప్రవక్త (సల్లం) సూరా చివరన హృదయాలను ప్రకంపించే ఆయత్ ను పఠిస్తూ....,

 *“అల్లాహ్ ముందు మోకరిల్లండి (సజ్దా చేయండి). ఆయనకు దాస్యం చేయండి”* 

అనే దైవాదేశాన్ని వినిపిస్తూ "సజ్దా" చేయగా ఏ ఒక్కడూ (ఏ ఒక్క అవిశ్వాసి కూడా) తన ఆధీనంలో లేక “సజ్దా” చేశారు (సాష్టాంగబడ్డారు). నిజం చెప్పాలంటే, ఈ పరిస్థితి, గర్విష్టులైన ఖురైషుల మొండితన్నాన్ని పటాపంచలు చేసేసింది. వారు తమ ఆధీనంలో లేక అందరూ "సజ్దా"లో పడిపోయారు.

కాని ఆ తరువాత దైవగ్రంథ పఠనం ఔన్నత్యం వారి (అవిశ్వాసుల) గర్వం అణచివేసిందని, దేన్నయితే అంతమొందించడానికి వారు కంకణబద్ధులై ఉన్నారో దాని కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారో అదంతా బూడిదలో పోసిన పన్నీరు చందాన వృధా అయిందని తెలియగానే, అవిశ్వాసులు నాలుక కరుచుకున్నారు.

 _(అంటే; "ఇస్లాంకు, ముహమ్మద్ (సల్లం)కు మరియు ఆయన (సల్లం) వినిపించే దైవసందేశానికి బద్ధశత్రువులైపోయిన బహుదైవారాధకులు, దైవసందేశాన్ని విని "సజ్దా" చేయగానే, ఇస్లాంను అంతమొందించాలని తాము చేసిన శపథం, చేసిన ప్రయత్నాలు అన్నీ వృధా అయ్యాయనే తెలియగానే అవిశ్వాసులు నాలుక కరుచుకున్నారు." అని అర్థం.)_ 

ముహమ్మద్ (సల్లం), దైవసందేశం వినిపించగానే అవిశ్వాసులు "సజ్దా" చేసిన సంఘటన జరిగాక, అన్ని వైపుల నుండి వారి (అవిశ్వాసుల)పై నిందల పరంపర వచ్చిపడ నారంభించింది.

""ఖుర్ఆన్"ను వినకూడదని ప్రజల్ని వారించే ఖురైష్ నాయకులకు ఈ రోజు ఏమైంది? ఈ రోజు "ఖుర్ఆన్"ను శ్రద్ధగా వినడమే గాక, దైవప్రవక్త (సల్లం)తో పాటు "సజ్దా" కూడా చేశారే!" ఈ విధంగా ప్రజల నుండి విమర్శలు మొదలయ్యాయి.

దీని నుండి తప్పుకోవడానికి, ఖురైష్ నాయకులు పసలేని సాకులు వెతకడం ప్రారంభించారు. చేసేదిలేక దైవప్రవక్త (సల్లం) పై అపనింద మోపుతూ...., "ముహమ్మద్ (సల్లం), లాత్ మరియు ఉజ్జా విగ్రహాలను గౌరవిస్తూ, "వీరు మహోన్నతమైన దేవతలు, వీరు మనకు సిఫార్సు చేస్తారు.” అని చెప్పారు, అందువల్లే "సజ్దా" చేయవలసి వచ్చింది." అని అవిశ్వాసులు బొంకారు.

ఇది పూర్తిగా అసత్య ప్రచారం. దీన్ని వారు అవలంభించింది, దైవప్రవక్త (సల్లం) సజ్దా చేసినప్పుడు తాము కూడా సజ్దా చేశామన్న నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికే. దైవప్రవక్త (సల్లం) గురించి సతతం అసత్యప్రచారం చేసే వీరు, తమను రక్షించుకోవడానికి ఇలాంటి అసత్య మాటల్ని చెప్పడానికి వెనకాడగలరా?

మొత్తానికి బహుదైవారాధకులు "సజ్దా" చేసిన ఈ సంఘటన వార్త అబీసీనియాకు కూడా చేరింది. వలస వెళ్ళిన ముహాజిర్లు (వలస వెళ్ళిన మొదటి జట్టులోని వారు) కూడా ఇది విన్నారు. అయితే వీరు విన్నది అసలు యధార్థానికి భిన్నమైన విషయం. అంటే, ఖురైషీయులంతా ముస్లిములైపోయారు అన్నదే ఆ విషయం.

అందువల్ల, అబీసీనియాకు వలస వెళ్ళిన వారు, షవ్వాల్ నెలలో మక్కాకు బయలుదేరారు. మక్కా నగరం ఇక ఒక రోజు ప్రయాణ దూరంలో ఉందనగా, ఆ వార్త నిజం కాదని అసలు విషయం వారికి తెలిసిపోయింది. ఖురైషీయులు యధాప్రకారం ముస్లిములను వేధిస్తూనే ఉన్నారని తెలిసింది. ఆ తరువాత కొందరు అటునుంచే తిరిగి అబీసీనియాకు వెళ్ళిపోయారు. కొందరు రహస్యంగా లేదా ఖురైష్ (తెగ)కు చెందిన ఎవరో ఒకరి రక్షణలో మక్కా నగరంలో ప్రవేశించారు.

 *అబీసీనియాకు రెండో హిజ్రత్ : -* 

ఆ తరువాత వలస నుండి తిరిగివచ్చిన ముహాజిర్లపై ప్రత్యేకంగాను, ఇతర ముస్లిములపై సాధారణంగాను హింసా దౌర్జన్యాలు బాగా పెరిగిపోయాయి. వారి కుటుంబసభ్యులు వారిని మరీ ఆగడాలకు గురి చేశారు. అబీసీనియా రాజు "నజాషీ" చక్రవర్తి, వారి ఎడల అవలంబించిన ఉదార వైఖరిని మరింత రెచ్చగొట్టింది. విధిలేక దైవప్రవక్త (సల్లం) తన అనుచరుల్ని (సహాబాలను) తిరిగి హిజ్రత్ చేయమని సలహా ఇచ్చారు.

అయితే, రెండవసారి చేసిన హిజ్రత్, మొదటి హిజ్రత్ కంటే అనేక కష్టాలను కొనివచ్చింది. ఈ సారి ఖురైష్ వారి ప్రయత్నాన్ని వమ్ముచేయడానికే సంసిద్ధులై ఉన్నారు గనుక ఎంతో జాగురూకతతో మెలగవలసిన పరిస్థితి ఏర్పడింది. కాని ముస్లిములు ఖురైష్ కంటే చురుకుగా ప్రవర్తించారు. "అల్లాహ్" వారి ఈ ప్రయాణాన్ని సులభతరమూ చేశాడు. వారు ఖురైష్ కు పట్టుబడక ముందే అబీసీనియా రాజు వద్దకు చేరుకోగలిగారు.

ఈ సారి (హిజ్రత్ చేసిన) వారి సంఖ్య మొత్తం 82 లేదా 83 మంది పురుషులు (అమ్మార్ గారి హిజ్రత్ దీనికి భిన్నమైనది), 18 లేక 19 మంది స్త్రీలు, "అల్లామా మన్సూర్ పూరి" అయితే స్త్రీలు ఖచ్చితంగా పద్దెనిమిది మందే అని అంటారు.

 *అబీసీనియా ముహాజిర్లకు వ్యతిరేకంగా ఖురైష్ కుట్ర : -* 

ముస్లిములు తమ విశ్వాసాన్ని, ప్రాణాలను కాపాడుకుంటూ ఓ ప్రశాంత ప్రదేశానికి పారిపోయారన్న అక్కసు ఖురైష్ ను వెంటాడుతూనే ఉంది. అబీసీనియాకు ముస్లిములు (రెండవ సారి) వలస సంగతి తెలిసి, ఖురైషీయులు అగ్గిమీదగుగ్గిలం అయ్యారు. వెంటనే వారందరూ సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చారు. 

వారిలో గొప్ప తెలివిగల ఇద్దరు వ్యక్తులు, "అమ్రూ బిన్ ఆస్" మరియు "అబ్దుల్లా బిన్ రబీ"లను (అప్పటికి వారింకా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు) ఎంపిక చేసి, అబీసీనియా రాజు "నజాషీ" మరియు "క్రైస్తవ పాదరీ"ల నాయకులకు సమర్పించుకోవడానికిగాను కానుకలిచ్చి తమ దూతలుగా అబీసీనియాకు పంపించడం జరిగింది.

వీరిద్దరు అబీసీనియాకు వెళ్ళి, మొదట క్రైస్తవ పాదరీల నాయకులను కలుసుకుని, తమ పని గడుపుకునేందుకు విలువైన కానుకలిచ్చి, ముస్లిములను అబీసీనియా నుండి వెళ్ళగొట్టడానికి తగు కారణాలను చూపెడుతూ మచ్చిక చేసుకున్నారు. 

ఆ తర్వాత, క్రైస్తవ పాదరీ నాయకులు, రాజు "నజాషీ"కి నచ్చచెప్పి ముస్లిములను వెనక్కు పంపిస్తామనే మాట ఇచ్చిన తరువాత, ఈ ఇద్దరు దౌత్యప్రతినిధులు "నజాషీ" దర్బారుకు హాజరయ్యారు. అతనికి కానుకలను సమర్పిస్తూ తమ మనోగతాన్ని ఇలా బయటపెట్టారు....,

“ఓ రాజా! మీ దేశంలోనికి, మాకు చెందిన కొందరు అవివేకులైన యువకులు పారిపోయివచ్చారు. వారు, వారి జాతి ధర్మాన్ని విడిచిపెట్టేశారు. అయితే ఇటు మీ ధర్మాన్ని (క్రైస్తవ ధర్మాన్ని) విశ్వసించలేదు సరికదా, ఓ క్రొత్త ధర్మాన్ని సృష్టించారు. ఆ ధర్మాన్ని మీరుగాని, మేముగాని ఎరుగము. అంచేత మా జాతి నాయకులు వీళ్ళను తీసుకురమ్మని మమ్మల్ని మీ వద్దకు పంపారు. వీరి గుణగణాలు ఎలాంటివో మా నేతలకు బాగా తెలుసు. ఇలాంటి మతభ్రష్టుల్ని, జాతివిద్రోహుల్ని ఇక్కడ మీ దేశంలో ఉంచుకోవడం మంచిది కాదు. కాబట్టి ఈ యువకుల్ని మా వెంట మా దేశానికి పంపించమని మనవి చేస్తున్నాం.” అని ప్రాధేయపడ్డారు.

వారిద్దరు కలిసి వారి మనోగతాన్ని బయటబెట్టిన తరువాత, వారి దగ్గరి నుంచి ముందే కానుకలు స్వీకరించిన క్రైస్తవ మతగురువులు అందుకుని...., "మహారాజా! వీరిద్దరు చెప్పిందే సబబు. ఇటీవల అరేబియా నుంచి కొంత మంది యువకులు ఇక్కడికి వచ్చి నివసించసాగారు. తమరు, ఆ యువకుల్ని వారికి అప్పగించండి. వీరు, వారిని వారి జాతి వారికి అప్పజెబుతారు. అలా చేయడమే మనకు అన్ని విధాలా శ్రేయస్కరం." అని వంతపాడారు.

ఒక్కసారిగా రాజదర్బారంతా నిశ్శబ్దాన్ని అలుముకుంది. రాజు "నజాషీ" ఏం ఆజ్ఞాపిస్తారో అని, సభికులంతా రాజు వైపే దృష్టి సారించి ఎదురుచూడసాగారు. దానికి రాజు "నజాషీ"....,

"వీల్లేదు వారు మా ఆశ్రయం కోరి, మా దగ్గర ఉండడానికి ఇష్టపడ్డారు. వాస్తవం ఏమిటో వారి నోటనే విందాం. వెంటనే వాళ్ళను మా సమక్షంలో హాజరుపరచండి." అని ఆజ్ఞాపించారు.

అయితే నజాషీ, ఈ విషయాన్ని బాగా ఆకళింపుజేసుకోవడానికి, అసలు విషయాన్ని తెలుసుకోవడానికిగాను మరింత లోతులోనికి వెళ్ళడం అవసరం అనుకొని ఆ ముస్లిం యువకుల్ని హాజరుకమ్మని ఆదేశించాడు.

రాజు మాటలు వినగానే, ఖురైష్ ప్రతినిధుల గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించాయి.

ఫలితం ఎలాగున్నా సరే, తాము పూర్తి యదార్థమైన విషయాన్నే తెలపాలన్న సంకల్పంతో ఆ ముస్లిం యువకులు రాజు సన్నిధికి హాజరయ్యారు.

ముస్లిములు దర్బారులోనికి వచ్చి నిలబడిన తర్వాత రాజు "నజాషీ" వారిని ఉద్దేశించి...., "మీరు మీ జాతి నుండి వేరుబడడానికి ఆధారభూతమైన ఆ క్రొత్త ధర్మం ఏమిటి? నేను విశ్వసించే ధర్మాన్ని కూడా మీరు అవలంబించలేదు. మరే మతాల్లో దేన్నయినా విశ్వసించడం లేదు. దానికి కారణం ఏమిటి?" అని ప్రశ్నించాడు.

రాజు కు సమాధానంగా ముస్లింల వైపు నుంచి, దైవప్రవక్త (సల్లం) పెదనాన్న "అబూ తాలిబ్" గారి కుమారుడు "హజ్రత్ జాఫర్ (రజి)" ముందుకొచ్చి తన సమాధానాన్ని ఇలా వినిపించారు.

 *"హజ్రత్ జాఫర్ బిన్ అబూ తాలిబ్ (రజి)" గారి సమాధానం Insha Allah రేపటి భాగములో....,* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment