134

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  134* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 49* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

         *అబీసీనియా వైపు మొదటి హిజ్రత్ (వలస)* 

హింసా దౌర్జన్యాల ఈ పరంపర దైవదౌత్యపు నాలుగవ సంవత్సరం మధ్య భాగంలో లేదా చివరి భాగంలో ఆరంభమైంది. ప్రారంభంలో ఇది మాములుగా సాగింది. కాలం గడచిన కొలది ఉధృతం కాసాగింది. చివరికి దైవదౌత్యపు అయిదవ సంవత్సర మధ్యభాగానికి చేరుకోగానే తారాస్థాయి నందుకుంది.

ఇలా ముస్లిములు మక్కాలో నిలువలేకపోయారు. బహుదైవారాధకుల ఆగడాల నుండి విముక్తి పొందేందుకు ఏదో ఒక మార్గానికి బంధురమైన పరిస్థితులలోనే *"కహఫ్"* సూరా (అధ్యాయం) అవతరించింది. ఇది అసలు బహుదైవారాధకులు వేసిన ప్రశ్నలకు సమాధానం. కాని ఈ సూరాలో మూడు సంఘటనలు వివరించబడ్డాయి. వీటిలో "అల్లాహ్" తరపు నుండి తన దాసుల భవిష్యత్తు గురించి సాంత్వన వచనాలు ఉన్నాయి. కాబట్టి అస్'హాబె కహఫ్ (గుహవారు) సంఘటనలో, ధర్మానికి, విశ్వాసానికి ప్రమాదం ఏర్పడినప్పుడు దైవధిక్కార, దౌర్జన్య కేంద్రాల నుండి హిజ్రత్ (వలస) చేసి "అల్లాహ్" పై భారం వేస్తూ బయటకి వెళ్ళిపోవాలనే సంకేతం కూడా ఉంది.

 *ఇప్పుడు మీరు వాళ్ళతోనూ, అల్లాహ్ ను గాకుండా వారు పూజిస్తున్న ఇతర దైవాలతోనూ తెగత్రెంపులు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏదన్నా గుహలోకి పోయి కూర్చోండి. మీ ప్రభువు మీపై తన కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు. మీ కార్యసిద్ధికై సౌలభ్యాన్ని సమకూరుస్తాడు. (ఖుర్ఆన్ 18:16).* 

 _(మానసికంగా మనం ఎలాగూ మన జాతి వారికి దూరం అయిపోయాము. ఇప్పుడు భౌతికంగా కూడా వారితో సంబంధాలు త్రెంచుకోవటం మంచిది అని గుహవాళ్ళు పరస్పరం చెప్పుకున్నారు. ఈ సమాలోచన తరువాత వారంతా ఒక గుహలోకి పోయి తలదాచుకున్నారు. నవ పథాన పురోగమిస్తున్న ఈ యువతరం కనిపించకపోయేసరికి ఆ జాతి ప్రజలు వాళ్ళను వెతకడం మొదలుపెట్టారు. కాని ఫలితం శూన్యం. ఎందుకంటే వారిప్పుడు సూక్ష్మదృష్ట అయిన అల్లాహ్ రక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.)_ 

హజ్రత్ మూసా మరియు ఖిజర్ (అలైహిముస్సలాం)ల గురించి వివరిస్తూ, ఫలితాలు ఎల్లప్పుడూ బాహ్యపరిస్థితులకు అనుకూలంగా ఉండవు అని, అప్పుడప్పుడూ బాహ్యపరిస్థితులకు భిన్నంగా ఉంటాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సంఘటనలో, ముస్లిములకు వ్యతిరేకంగా ఏ హింసా దౌర్జన్యాలు జరుగుతున్నాయో వాటి ఫలితాలు కూడా పూర్తిగా భిన్నంగానే బయటబడతాయని, ఈ విద్రోహులు, దైవధిక్కారులు ఇప్పుడు విశ్వసించకపోతే మునుముందు వారే దాసోహం అంటూ ముస్లిముల ఎదుట తల ఒగ్గి వారి అదృష్టం తీర్పుకు ప్రాధేయపడతారు అని భవిష్యవాణి చెప్పడం జరిగింది.

   "జుల్'ఖర్'నైన్" గురించి అవతరించిన వాక్యాల్లో కొన్ని ప్రత్యేక విషయాల వైపునకు దృష్టిని మరల్చడం జరిగింది.

 *――»* ఈ భూమండలం అల్లాహ్ దే. ఆయన తన దాసుల్లో తాను కోరిన వ్యక్తిని దాని వారసునిగా చేస్తాడు.

 *――»* ఈ సాఫల్యం, విజయం విశ్వాసమార్గంపై నడవడం వల్లనే సిద్ధిస్తుంది. దైవధిక్కార ధోరణి వల్ల కాదు.

 *――»* అల్లాహ్ అప్పుడప్పుడు ఆయా కాలాలకు చెందిన యాజూజ్, మాజూజ్ ల నుండి రక్షించడానికి తన దాసుల నుండి కొందరిని ఎంపిక చేసి నిలబెడతాడు.

 *――»* అల్లాహ్ కు భయపడే సద్వర్తనులే భూమండల వారసత్వానికి ఎక్కువ హక్కుదారులు.

 *"కహఫ్"* సూరా తరువాత *"జుమర్"* సూరా అవతరణ ఆరంభమైంది. అందు(లో) హిజ్రత్ (వలస) వైపునకు సంకేతం ఉంది. అందులో "అల్లాహ్" సృష్టించిన ఈ లోకం ఇరుకైనది ఎంతమాత్రం కాదని చెప్పడం జరిగింది.

 *(ఓ ప్రవక్తా!) ఇలా చెప్పు : విశ్వసించిన ఓ నా దాసులారా! మీ ప్రభువుకు భయపడుతూ ఉండండి. ఈ లోకంలో సత్కర్మలు చేసేవారికి మేలు జరుగుతుంది. అల్లాహ్ భూమి ఎంతో విశాలమైనది. సహనం వహించేవారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది. (ఖుర్ఆన్ 39:10).* 

 _(అల్లాహ్ కే విధేయత చూపండి. పాపకార్యాలకు దూరంగా ఉండండి. నిర్మలమైన మనస్సుతో దైవాన్ని ఆరాధించండి. ఆరాధనలో గాని, విధేయతలో గాని ఇంకొకరికి సాటి కల్పించకండి._ 

 _దైవభీతి వల్ల కలిగే మేలు ఇది. ఇక్కడ "మేలు జరగడం" అంటే స్వర్గం లభించడం. స్వర్గంలోని శాశ్వత అనుగ్రహాలు ప్రాప్తించడం అని భావం._

 _ఈ వ్యాక్యంలో "హిజ్రత్" గురించిన సంకేతం ఉంది. స్వస్థలంలో విశ్వాసంపై నిలకడ కలిగి ఉండడం, భయభక్తుల వైఖరిని అవలంబించడం కష్టమనుకుంటే జీవితాంతం అక్కడే మ్రగ్గుతూ ఉండటం వాంఛనీయం కాదు. ఆ ప్రాంతాన్ని వదిలి మరో ప్రాంతానికి (దైవాదేశాలకు అనుగుణంగా జీవితం గడిపేందుకు సానుకూలంగా ఉండే ప్రాంతానికి) వలస పోవాలి._ 

 _అదేవిధంగా విశ్వాస మార్గంలో కష్టనష్టాలు కూడా అనివార్యమే. ఈ మార్గంలో విషయలాలసను, మనోవాంఛలను త్యాగం చేయవలసి ఉంటుంది. ఇది సహనంతో, సాహసంతో కూడుకున్న పని. అందుకే ఇలాంటి సహనమూర్తులకు లభించే స్థానాలు కూడా ఉన్నతమైనవే. వారి సదాచరణలకు గాను పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. అది లెక్కలేనంతగా ఉంటుంది._ 

 _సహనానికిగాను లభించే ఈ ఉన్నత స్థానాన్నిఆర్జించటానికి ప్రతి ముస్లిం పాటుపడాలి. ఎందుకంటే తొందరపాటు వల్ల, క్రియాశూన్యత వల్ల వచ్చిపడిన విపత్తులు తొలిగిపోవు. జరిగిన నష్టం ఎలాగూ జరిగిపోయినప్పుడు నిందారోపణలతో కాలక్షేపం చేసి లాభం లేదు. అలాంటి పరిస్థితుల్లో మనిషి నిగ్రహం పాటిస్తే, దైవేచ్ఛతో రాజీపడిపోతే అందుకుగాను అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలాన్ని ఇస్తాడు.)_ 

――――

"అస్మహ్" నజాషీ అబీసీనియాకు చెందిన న్యాయవంతుడైన పరిపాలకుడనే విషయం దైవప్రవక్త (సల్లం)కు తెలుసు. అక్కడ ఎవ్వరిపైనా దౌర్జన్యం జరగదు. అందుకని ఆయన (సల్లం), ఉపద్రవాల నుండి తమ ధర్మాన్ని రక్షించుకునేందుకు అబీసీనియాకు వలస పోవాలని ముస్లిములకు ఆదేశమిచ్చారు. ఆ తరువాత అనుకున్న విధంగా రజబ్ నెల, దైవదౌత్య శకం అయిదవ సంవత్సరం సహాబా (రజి)కు చెందిన మొదటి జట్టు అబీసీనియా వైపునకు బయలుదేరింది. ఈ జట్టులో పన్నెండుగురు మగవారు, నలుగురు స్త్రీలు ఉన్నారు. హజ్రత్ ఉస్మాన్ బిన్ అప్ఫాన్ (రజి) దానికి నాయకులు. ఆయన వెంట దైవప్రవక్త (సల్లం) గారి కుమార్తె హజ్రత్ రుఖయ్యా (రజి) కూడా ఉన్నారు. దైవప్రవక్త (సల్లం) ఆమె గురించి చెబుతూ, “హజ్రత్ ఇబ్రాహీం (అలైహి) మరియు లూత్ (అలైహి) తరువాత "అల్లాహ్" మార్గంలో హిజ్రత్ చేసిన ప్రథమ కుటుంబం అది” అని సెలవిచ్చారు.

(అబీసీనియా కు మొదటి హిజ్రత్ చేసిన జట్టు : - ఉస్మాన్ బిన్ అప్ఫాన్, ఆయన భార్య రుఖియా (రుఖయ్యా), హుజైఫా బిన్ ఉఖ్బా, ఉస్మాన్ బిన్ మజ్'వూన్, అబ్దుల్లా బిన్ మసూద్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, జుబైర్ బిన్ అవ్వామ్, ముస్'అబ్ బిన్ ఉమైర్, ఆమిర్ బిన్ రబియా, సుహైల్ బిన్ బైజా (రజి))

ఈ జట్టు రాత్రి అంధకారంలో తమ క్రొత్త గమ్యానికి బయలుదేరింది. గోప్యంగా ఉండవలసిన విషయం గనక ప్రయాణం గురించి ఖురైష్ (జాతి ప్రజల)కు తెలియకూడదనే జాగ్రత్త తీసుకోబడింది. ఎర్ర సముద్రం ఓడరేవు “షుఅయిబా” వైపునకు పయనమైందీ జట్టు. అదృష్టవశాత్తు అక్కడ రెండు పడవలు ఉన్నాయి. అవి ఈ జట్టును ఎక్కించుకొని సముద్రానికి ఆవలి ఒడ్డున ఉన్న అబీసీనియా వైపునకు వెళ్లిపోయాయి.

ఖురైషీయులకు ఈ విషయం తెలియగానే, వారిని పట్టుకోవడానికి తీరం వరకు వెళ్ళగలిగారు. కాని అప్పటికి సహాబా (రజి) వెళ్ళిపోవడం వలన వెనక్కు తిరిగి వచ్చేశారు.

అటు ముస్లిములు అబీసీనియా చేరి ఊపిరి పీల్చుకున్నారు.

మిగిలినది Insha Allah రేపటి భాగములో....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment