133

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  133* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 48* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

 *విశ్వాసులపై విరుచుకుపడిన కష్టాలు : - 2* 

                         *హజ్రత్ అమ్మార్ (రజి)* 

ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి, అత్యంత కఠిన శిక్షలకు గురైన వారిలో యాసిర్ (రజి), ఆయన అర్థాంగి సుమయ్యా (రజి), తనయుడు అమ్మార్ (రజి) కూడా ఉన్నారు. వీరు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన కారణంగా, వారిపై ప్రళయమే విరుచుకుపడింది.

బహుదైవారాధకులు, యాసిర్ (రజి)ను మధ్యాహ్నపు మండే ఎండలో ఇసుక నేల మీద నగ్నంగా పడేసి కొరడాలతో ఒళ్ళు హునమయ్యేలా కొట్టేవారు. నిప్పుతో వాతలు పెట్టేవారు. నీళ్ళలో ముంచి ఊపిరాడకుండా చేసేవారు.

హజ్రత్ అమ్మార్ బిన్ యాసిర్ (రజి) బనూ మగ్జూమ్ తెగవారికి బానిస. యాసిర్ (రజి) కుటుంబాన్ని హింసించడంలో "అబూ జహల్" ముందడుగుగా ఉండేవాడు. తీవ్రమైన ఎండలో ఈ బహుదైవారాధకులు వారిని రాళ్ళుదేలిన నేలపై పడుకోబెట్టి శిక్షించేవారు.

ఓసారి వారిని ఈ విధంగా శిక్షించేటప్పుడు దైవప్రవక్త (సల్లం) ఆ బాటన వెళ్ళడం తటస్థించింది. అది చూసిన ఆయన (సల్లం)...., "ఓ యాసిర్ (రజి) కుటుంబమా! సహనం వహించండి. మీ నివాస స్థలం స్వర్గమే" అంటూ ధైర్యం చెప్పారు.

చివరికి, అవిశ్వాసులు పెట్టే చిత్రహింసలను భరించలేక హజ్రత్ యాసిర్ (రజి) మరణించారు.

ఇక యాసిర్ (రజి) గారి సతీమణి హజ్రత్ సుమయ్యా (రజి) గారి దుస్థితి కూడా దయనీయమైనదే. పరమ దుర్మార్గుడైన తన యజమాని "అబూ జహల్" చేతిలో అనేక యాతనలకు గురయ్యింది. కేవలం ఇస్లాం ధర్మం స్వీకరించినందుకు సుమయ్యా (రజి)ను, అబూ జహల్ కఠినంగా శిక్షించసాగాడు. ఆ క్రూరుడు అంతటితో ఊరుకోకుండా, సుమయ్యా (రజి) మర్మాంగంలో బరిశె దిగగొట్టి చంపేశాడు.

 *ఈమె ఇస్లాం యొక్క మొట్టమొదటి "మహిళా షహీద్ (అమరత్వం పొందిన స్త్రీ)".* 

హజ్రత్ అమ్మార్ (రజి)పై హింసా దౌర్జన్యాలు అలానే కొనసాగుతూపోయాయి. ఆయన (రజి)ను ఒక్కోసారి ఎండలో బాధిస్తే, మరోసారి ఆయన వక్షస్థలంపై ఎర్రగా కాలిన బండరాయిని ఉంచడం జరిగేది. ఇంకొకసారి ఆయన (రజి)కు ఇనుప కవచాన్ని తొడిగి, భగ భగ మండే ఎండలో చాలా సేపు నిలబెట్టేవారు. మండుతున్న ఇసుక నేలపై పడేసి స్పృహ తప్పేవరకు కొట్టేవారు.

ఆ బహుదైవారాధకులు ఈ విధంగా హింసిస్తూ, "నీవు ముహమ్మద్ (సల్లం)ను తిట్టనంతవరకు లేదా మా ఆరాధ్య దైవాలైన లాత్, ఉజ్జాలను శ్లాఘించనంతవరకు నిన్ను విడిచి పెట్టేదేలేదని" బలవంతపెట్టేవారు.

చివరికి హజ్రత్ అమ్మార్ (రజి), వారు పెట్టే చిత్రహింసలను భరించలేక వారు చెప్పిన మాటల్ని ఒప్పుకోవలసి వచ్చింది.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) సన్నిధికి రోదిస్తూ వచ్చి నా వల్ల తప్పు జరిగిందని విన్నవించుకున్నారు. దీనికి "అల్లాహ్" ఈ దైవవాణిని అవతరింపజేశాడు : ↓

 *ఎవరయితే విశ్వసించిన తరువాత అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరికి పాల్పడతాడో - కాని బలవంతం చేయబడి (తిరస్కారాన్ని ప్రకటిస్తే), అదే సమయంలో అతని హృదయం విశ్వాసంపై స్థిరంగా ఉంటే (అది వేరే విషయం) - అలాగాకుండా ఎవరైనా హృదయ పూర్వకంగా తిరస్కార వైఖరికి పాల్పడితే మాత్రం వారిపై దైవాగ్రహం పడుతుంది. అలాంటి వారి కోసమే చాలా పెద్ద శిక్ష ఉంది. (ఖుర్ఆన్ 16:106).* 

 _(ఏ వ్యక్తికయినా సత్య తిరస్కారం కోసం బలవంతం చేయగా, అతను ప్రాణరక్షణ నిమిత్తం వాక్కు ద్వారా, కర్మద్వారా తిరస్కార (కుఫ్ర్) ప్రకటన చేసినప్పటికీ, అతని మనసు గనక విశ్వాసంపై స్థిరంగా ఉంటే అతను అవిశ్వాసి అవడు. అట్టి పరిస్థితుల్లో అతని భార్య అతన్నుంచి వేర్పడజాలదు. అవిశ్వాసానికి సంబంధించిన ఏ ఆదేశమూ అతనికి వర్తించదు._ 

 _ఈ విషయంలో విద్వాంసులందరి మధ్య ఏకాభిప్రాయం ఉందని ఖుర్తుబీ చెప్పారు. (ఫత్'హుల్ ఖదీర్)_ 

 _ఎవరైనా హృదయ పూర్వకంగా తిరస్కార వైఖరికి పాల్పడితే మాత్రం వారిపై దైవాగ్రహం పడుతుంది. అలాంటి వారి కోసమే చాలా పెద్ద శిక్ష ఉంది. ఇది ధర్మభ్రష్టత (ఇర్తిదాద్)కు ఒడిగట్టేవారికి లభించే శిక్ష. వారు దైవాగ్రహానికీ, పెద్ద శిక్షకు పాత్రులవుతారు. ప్రాపంచికంగా వారు హతమార్చబడతారని హాదీసు ద్వారా విదితమవుతోంది.)_ 

 *మరొక ఉల్లేఖనంలో : - ↓* 

చివరికి హజ్రత్ అమ్మార్ (రజి), వారు పెట్టే చిత్రహింసలను భరించలేక వారు చెప్పిన మాటల్ని ఒప్పుకోవలసి వచ్చింది.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) సన్నిధికి రోదిస్తూ వచ్చి నా వల్ల తప్పు జరిగిందని విన్నవించుకున్నారు.

అమ్మార్ (రజి) : - దైవప్రవక్తా! నేను మీ గురించి చెడుగా, వారి ఆరాధ్య దైవాలైన లాత్, ఉజ్జా ల గురించి మంచిగా పలకనంతవరకు వారు నన్ను విడిచిపెట్టలేదు.

ముహమ్మద్ (సల్లం) : - ఆ సమయంలో నీ హృదయ పరిస్థితి ఎలా ఉండింది?

అమ్మార్ (రజి) : - అప్పుడు నేను పూర్తి విశ్వాస (ఈమాన్) స్థితిలోనే ఉన్నాను.

ముహమ్మద్ (సల్లం) : - అయితే! ఆ బహుదైవారాధకులు ఇలానే దౌర్జన్యం చేస్తే నీవు మళ్ళీ ఆ మాటలే పలుకు.

                        *హజ్రత్ ఖబ్బాబ్ (రజి)* 

"హజ్రత్ ఖబ్బాబ్ బిన్ అరత్ (రజి)" ఖుజాఅ తెగకు చెందిన ఒక స్త్రీ "ఉమ్మె అన్మార్"కు బానిస. బహుదైవారాధకులు ఆయన (రజి)ను రకరకాలుగా హింసించేవారు. ఆయన (రజి) తలవెంట్రుకల్ని పీకేవారు. గట్టిగా పట్టి మెడను మెలివేసేవారు. ఆయన (రజి)ను కణకణలాడే నిప్పురవ్వలపై పడుకోబెట్టి పైకి లేవకుండా బండరాళ్ళను ఉంచేవారు.

ఉమ్మె అన్మార్ ఇనుప కడ్డీ కాల్చి తరచుగా ఖబ్బాబ్ (రజి) తల మీద వాతలు పెట్టి భాధిస్తుండేది. ఒకసారి ఆమె బొగ్గులు కాల్చి వాటిపై ఖబ్బాబ్‌ (రజి)ని వెల్లకిలా పండబెట్టింది. ఆ వేడికి ఖబ్బాబ్‌ (రజి) శరీరం కాలి చిట్లిపోయింది. చివరికి చిట్లిన దేహం నుండి కారిన ద్రవంతోనే నిప్పులు చల్లారాయి.

ఈ బాధలు భరించలేక ఆయన (రజి) ఒక రోజు దైవప్రవక్త (సల్లం)తో తన కష్టాలు చెప్పుకోవడానికి కాబా (దగ్గరకు) వెళ్ళారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) కాబా గోడకు ఆనుకొని కూర్చొని ఉన్నారు.

“దైవప్రవక్తా! మా కోసం దైవాన్ని ప్రార్థించరూ?” అని అన్నారు హజ్రత్‌ ఖబ్బాబ్ (రజి).

ఈ మాట వినగానే దైవప్రవక్త (సల్లం) ముఖం కోపంతో జేవురించింది. ఒక్కసారిగా ఆయన (సల్లం) కదలి నిటారుగా కూర్చున్నారు.

“ఏమిటీ! మీ పై కష్టాలు వచ్చిపడ్డాయా? గత కాలంలోని విశ్వాసులపై మీకంటే ఘోరమైన కష్టాలు వచ్చిపడ్డాయి. వారిలో ఒకడ్ని, నేలలో గుంట తవ్వి అందులో కూర్చోబెట్టి అతని తల మీద రంపం పెట్టి చీల్చివేయడం జరిగింది. మరొకర్ని, ఇస్లాం నుండి మరల్చడానికి అతని కీళ్ళలోకి ఇనుప దువ్వెనలు గుచ్చి లాగివేయడం జరిగింది.

దైవసాక్షి! ఈ పని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరుతుంది. చివరికి ఒక స్త్రీ విలువైన నగలు ధరించి "సనా" నుండి "హజ్రెమౌత్" వరకు నిర్భయంగా ప్రయాణం చేస్తుంది. అప్పుడు, ఆమె మనసులో దైవభయం తప్ప మరెవరి భయమూ ఉండదు." అని అన్నారు మహానీయ ముహమ్మద్ (సల్లం).

ఆ తరువాత ఆయన (సల్లం), "ప్రభు! ఖబ్బాబ్ ని కాపాడు" అని దైవాన్ని ప్రార్థించారు.

ఈ ప్రార్థన ఫలితాన్నిచ్చింది. ఉమ్మె అన్మార్ తలలో ఏదో రోగం పుట్టి, ఆమెను తీవ్రంగా బాధించడం మొదలెట్టింది. వైద్యులు ఆమెను పరీక్షించి, ఇనుప చువ్వ ఎర్రగా కాల్చి తల మీద వాత పెడితే రోగం నయం అవుతుందని చెప్పారు. శిరోబాధ భరించలేని ఉమ్మె అన్మార్ అలాగే చేయించుకుంది. దాంతో ఉమ్మె అన్మార్, హజ్రత్ ఖబ్బాబ్ (రజి)కు పెట్టిన బాధలకు విరుగుడయి, ఆమె శాశ్వతంగా మృత్యుకొరల్లోకి పోయింది.

 *అవిశ్వాసుల చేతిలో చిత్రహింసలకు గురైన మరికొందరు విశ్వాసులు గురించి : - ↓* 

హజ్రత్ ఫకాహా, అసలు పేరు అఫ్లాహ్. ఈయన బనీ అబుద్దార్ బానిస. ఆయన యజమానులు, ఆయన్ను కాళ్ళకు తాళ్ళుకట్టి నేలపై ఈడ్చేవారు. 
జిన్నీరా (మిస్కినా), నహ్దియా, ఆమె కుమార్తె ఉమ్మె అబీస్, వీరంతా స్త్రీ బానిసలు. వీరు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. బహుదైవారాధకులు పెట్టే బాధలన్నింటినీ భరించారు. ఆ బాధలు, హింసలు ఎలాగుండేవో ఇది వరకు చెప్పుకున్నాం.

బనీ అద్దీ తెగకు చెందిన ఓ కుటుంబం "బనీ మూమిల్"కు సంబంధించిన ఓ బానిస స్త్రీ ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తే, హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ ★ అలసిపోయే అంతవరకు బాదేవారు. ఆ తరువాత, "నేను నిన్ను దయదలిచి వదిలి పెట్టలేదు, అలసిపోయి వదిలిపెట్టాను" అని చెప్పేవారు.

 _(★ → ఈయన అద్దీ తెగకు చెందినవారు. అప్పటికి ఇంకా ముస్లిం కాలేదు)_ 

చివరికి హజ్రత్ అబూ బక్ర్ (రజి), హజ్రత్ బిలాల్ (రజి) మరియు ఆమిర్ బిన్ ఫహీరాను కొని స్వతంత్రులుగా చేసినట్లే ఈ స్త్రీ బానిసల్ని కూడా కొని స్వతంత్రులుగా చేసేశారు.

బహుదైవారాధకులు పెట్టే హింసల్లో ఓ హింస ఏమిటంటే, కొందరు సహాబాలను (ప్రవక్త (సల్లం) గారి అనుచరులను) అప్పుడే వలచిన ఒంటె లేదా ఆవు చర్మాల్లో చుట్టి ఎండలో పడవేసేవారు. కొందరిని ఇనుప కవచాలను తొడిగి కాలే బండరాయిపై పరుండబెట్టేవారు. నిజానికి "అల్లాహ్" మార్గంలో హింసలు, దౌర్జన్యాలకు గురి అయ్యేవారి జాబితా సుదీర్ఘమైనదీ, బాధాకరమైనదీను. పరిస్థితి ఎలాగుండేదంటే, ఎవరైనా ముస్లిముగా మారాడని తెలియగానే బహుదైవారాధకులు అతని పాలిట రాక్షసులుగా మారిపోయేవారు.

ఈ హింసాదౌర్జన్యాల నుండి రక్షింపబడాలంటే, దైవప్రవక్త (సల్లం) ముస్లిములను మాటలచేత, చేతల రూపంగా, ఇస్లామ్ ధర్మం స్వీకరించారనే విషయం ఖురైష్ కు తెలియకుండా ఉండేందుకు వారిని రహస్యంగా ఓ చోట చేరాలని ఆదేశించాల్సి ఉంటుంది. కారణం ఏమిటంటే, వారు బాహాటంగా ఓ చోట చేరితే బహుదైవారాధకులు ఆయన (సల్లం) బోధించే బోధనలను, ఆత్మా ప్రక్షాళనను అడ్డుకునే ప్రమాదం ఉంది. ఫలితంగా ఉభయ వర్గాల్లో ఘర్షణ తలెత్తవచ్చు. ఇలాంటి పరిస్థితి దైవదౌత్యం వచ్చిన నాలుగవ సంవత్సరం కూడా ఎదురైంది. దాని వివరణ ఏమిటంటే, సహాబా (రజి) కొండ లోయల్లో కూడి నమాజు చేసేవారు. దైవతిరస్కారులు కొంతమంది దీన్ని చూసి దుర్భాషలకు, దొమ్మీకీ దిగారు. జవాబుగా హజ్రత్ సఅద్ బిన్ అబీవికాస్ (రజి) ఒక్కడిని రక్తం ప్రవహించేటట్లు కొట్టడం కూడా జరిగింది. ఇది ఇస్లామ్ చేత ప్రప్రథమంగా ప్రవహించిన రక్తం.

ఒకవేళ ఇదే పరిస్థితి మాటిమాటికీ తలెత్తి కొనసాగితే, ముస్లిములు అంతం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సందేశ ప్రచారం రహస్యంగానే జరగాలన్నది వివేకంతో కూడుకున్న పని. అందుకని సహాబా (రజి)లందరూ తమ శ్రేయం కోసం, తమ ఆరాధనలు, సందేశ ప్రచారం మరియు సామూహిక సమావేశాల కోసం రహస్యంగానే కలువవలసి ఉంటుంది. అయితే మహాప్రవక్త (సల్లం) మాత్రం తమ సందేశ ప్రచారాన్ని, దానికి తోడు తమ ఆరాధనలను బహుదైవారాధకుల ఎదుట బాహాటంగా చేస్తూ ఉండేవారు. ఏ విషయం కూడా ఆయన (సల్లం)ను ఈ పని నుండి అడ్డుకోలేకపోయింది. అయినా ఆయన (సల్లం) కూడా ముస్లిములతో వారి సంరక్షణ దృష్ట్యా రహస్యంగానే సమావేశమయ్యేవారు. ఇటు అర్కమ్ అబిల్ అర్ఖమ్ మగ్జూమీ గృహం, సఫా కొండపై విద్రోహుల దృష్టి పడకుండా వారి సమావేశాలకు దూరంగా ఉండేది. అందుకని దైవప్రవక్త (సల్లం) దైవదౌత్యం లభించిన ఐదవ సంవత్సరం ఆ ఇంటినే తన సందేశ ప్రచారానికి, ముస్లిములతో సమావేశమవడానికి కేంద్రంగా చేసుకున్నారు.

 *"అబిసీనియా"కు వలస : -* 

సత్యతిరస్కారులు ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలు ఉధృతం చేశారు. ముఖ్యంగా ప్రవక్త (సల్లం) అనుచరులపై వారి దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. దైవప్రవక్త (సల్లం) ఈ పరిస్థితిని చూసి చాలా ఆందోళన చెందారు. ఇక ఈ దేశంలో ఇస్లాం పట్ల పరిపూర్ణత విశ్వాసంతో ప్రశాంతంగా మనుగడ సాధించడం సాధ్యం కాదని భావించారు.

"దేవుని భూమి విశాలంగా ఉంది. మీరు దుర్మార్గులకు దూరంగా మరో ప్రాంతానికి వెళ్ళిపోండి." అని చెప్పారు ఆయన (సల్లం) తన అనుచరులకు సలహా ఇస్తూ.

"దైవప్రవక్తా! ఎక్కడికి వెళ్ళమంటారు? అదీ మీరే చెప్పండి?" అనుచరులు.

"అబిసీనియా వెళ్ళండి. అక్కడి రాజు నజాషీ (నీగస్) క్రైస్తవ మతస్థుడు. చాలా ధర్మాత్ముడు. మీకు ఏ లోటు రానివ్వడు." అన్నారు దైవప్రవక్త (సల్లం).

Insha Allah రేపటి భాగములో ప్రవక్త (సల్లం) అనుచరుల హిజ్రత్ (వలస) గురించి....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment