132

🛐 🕋 ☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪ 🕋 🛐

                     🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌    

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

                    💎 *ఇస్లాం చరిత్ర* *-  132* 💎            

    🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 47* 🇸🇦

◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇

 *విశ్వాసులపై విరుచుకుపడిన కష్టాలు : - 1* 

ఇస్లాం ప్రచారం నుండి దైవప్రవక్త (సల్లం)ను అడ్డుకోవడానికి, అవిశ్వాసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కాని అవేమి ఫలించకపోవడంతో ఆయన (సల్లం) అనుచరులపై దాడి చేయడానికి పూనుకున్నారు. ఈ పని కోసం వారు ఇతరతెగలను కూడా కలుపుకున్నారు. దాంతో ముస్లింలపై పెద్ద విపత్తు వచ్చి పడింది.

ముఖ్యంగా పేద ముస్లింలు దుర్భర దౌర్జన్యకాండకు గురయ్యారు. కొందరు అవిశ్వాసులు, వారిని కొరడాలతో కొట్టి హింసించసాగారు. మరికొందరు, వారి శరీరాల మీద వాతలు పెడుతున్నారు. ఇంకొందరు, విశ్వాసులను నీళ్ళలో ముంచి ఊపిరాడకుండా చేస్తున్నారు.

ఇక బానిసలుగా ఉన్న ముస్లింలపై జరుగుతున్న అఘాయిత్యాలయితే చెప్పనలవి కావు. గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చీకటి కొట్లలో బంధించి, ఆ తరువాత మండుటెండలో కాలే ఇసుక తిన్నెల మీద పడేసి ఈడుస్తూ, వారిని రకరకాలుగా హింసిస్తున్నారు.

భూమ్యాకాశాలు రోధిస్తున్నా, మానవత్వం నెత్తీ నోరు కొట్టుకున్నా ఈ కిరాతకుల రాతిగుండెల్లో కనికరం కాస్తయినా కలగడం లేదు. ఈ హింసా దౌర్జన్యాలు చూసి కొందరు ముస్లింలు తమ విశ్వాసాన్ని లోలోపలే దాచుకుంటున్నారు. అయితే సత్యధర్మాన్ని నమ్మి, దాని ప్రకారం నడచుకునే దృఢమనస్కులు, సహన స్థయిర్యాలతో శత్రువుల దౌర్జన్యాలను తట్టుకుంటూ ఇస్లామీయ ఉద్యమంలో పురోగమిస్తున్నారు.

 *అవిశ్వాసుల చేతిలో, అత్యంత కఠిన శిక్షలకు గురైన కొంతమంది గురించి రాబోయే పుటల్లో తెలుసుకుందాం*

                     *హజ్రత్ బిలాల్ (రజి)* 


దైవప్రవక్త (సల్లం) కాలంలో ఇస్లాం ధర్మాన్ని విశ్వసించి, అత్యంత కఠినపరీక్షలలో నెగ్గిన అదృష్టవంతుల్లో హజ్రత్ బిలాల్ (రజి) ఒకరు. ఈయన (రజి), "ఉమయ్యా బిన్ ఖల్ఫ్" కు బానిసగా ఉండేవారు. కేవలం ఇస్లాం ధర్మాన్ని విశ్వసించినందువల్ల, ఆయన (రజి)ను, ఉమయ్యా రకరకాలుగా హింసించసాగాడు. అప్పుడప్పుడు కూడునీళ్ళు ఇవ్వకుండా కడుపు మాడ్చేవాడు.

 _↑ దీని గురించి మరింత వివరంగా ↓_ 

 *బిలాల్ (రజి) ఇస్లాంను స్వీకరించాడని ఉమయ్యా కు అందిన సమాచారం : -* 

మక్కా నగరం. ఖల్ఫ్ కుమారుడు ఉమయ్యా, ఇంట్లో కూర్చుని ఉన్నాడు. అంతలో ఉమయ్యా స్నేహితుడు ఒకతను వచ్చి, ఉమయ్యా ప్రక్కన కూర్చున్నాడు. వచ్చీ రాగానే ఆ వ్యక్తి....,

ఉమయ్యా స్నేహితుడు : - ఉమయ్యా! నీకు ఈ విషయం తెలుసా?.... అబిసీనియాకు చెందిన నీ నీగ్రో బానిస బిలాల్ (రజి), రాత్రులు ముహమ్మద్ (సల్లం)ను సందర్శించడానికి దొంగచాటుగా వెళుతున్నాడు. వాడు కొత్త మతం స్వీకరించాడనీ, ఇతరులను కూడా కొత్త మతం స్వీకరించేలా ప్రేరేపిస్తున్నాడని నాకు తెలిసింది.

ఈ మాటలు వినగానే ఉమయ్యా ఉలిక్కిపడ్డాడు. కానీ, ఉమయ్యా ఈ మాటలను నమ్మలేదు. అపుడు....,

ఉమయ్యా : - నువ్వు చెప్పేది నిజమేనా?

ఉమయ్యా స్నేహితుడు : - నా దగ్గర సాక్ష్యాలున్నాయి. నీకు చెబితే నీ బానిసను అదుపులో ఉంచుకుంటావని వచ్చాను. ఇతర బానిసలు కూడా పెడదారి పట్టకుండా నీ బానిసను కట్టడి చేయి. అసలే మనవాళ్ళలో ఉన్నత వంశాల వాళ్ళు కూడా కొత్త మతం స్వీకరిస్తున్నారు.

ఉమయ్యాకు తీవ్రమైన కోపం వచ్చింది. బిలాల్ (రజి)కు మరిచిపోలేని పాఠం నేర్పాలనుకున్నాడు. ఆ వెంటనే బిలాల్ (రజి)ను పిలిపించాడు. బిలాల్ (రజి) వచ్చిన తర్వాత ఉమయ్యా....,

ఉమయ్యా : - బిలాల్ (రజి)! రాత్రులు దొంగచాటుగా ముహమ్మద్ (సల్లం)ని కలువడానికి వెళుతున్నావా లేదా? ముహమ్మద్ (సల్లం) మతాన్ని స్వీకరించావా లేదా? మన దేవుళ్ళు లాత్, ఉజ్జాలను నువ్వు తిరస్కరిస్తున్నావా?

ఉమయ్యా, ఈ విధంగా ప్రశ్నల వర్షం కురిపించాడు. తన యజమాని చాలా కోపంగా ఉండడం చూసి, బిలాల్ (రజి) మొదట కంగారుపడ్డారు. అయినా జవాబిస్తూ....,

బిలాల్ (రజి) : - నేను ఇస్లాం స్వీకరించానన్న విషయాన్ని కాదనడం లేదు. నేను ముహమ్మద్ (సల్లం) సందేశాన్ని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను.

ఈ మాటలు విని, ఉమయ్యా కోపంతో ఊగిపోయాడు.

ఉమయ్యా : - బిలాల్ (రజి)! నువ్వు ఒక బానిసవు మాత్రమే. నిన్ను కొన్న రోజునే నేను నీ శరీరాన్ని, నీ మనస్సును, నీ ఆత్మను కూడా కొనేశాను. అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఆలోచించడానికి, చేయడానికి ఎలాంటి స్వేచ్ఛ లేదు. ఇక్కడ నువ్వు నా ఆదేశాలు వినడం మాత్రమే చేయాలి. నేను ఆరాధించే దేవుళ్ళను మాత్రమే నువ్వు కూడా ఆరాధించాలి. 

ఉమయ్యా ఇలా చిందులేశాడు. అయినా బిలాల్ (రజి) మాత్రం బెదరలేదు.

బిలాల్ (రజి) : - నా శరీరం మాత్రమే మీకు బానిస. నా మనసు, నా ఆత్మ కాదు. నా విశ్వాసం, హృదయం నుంచి జనించింది. నా హృదయంపై మీకు ఎలాంటి అధికారం లేదు.

ఉమయ్యా : - నువ్వు ఒక బానిసవు మాత్రమే. నీ తల నుంచి నీ పాదాల వరకు అంతా ఒక బానిసవు మాత్రమే. నీ హృదయం, నీ ఆత్మ అన్నీ నేను కొనేశాను. నేను చెప్పిన మాట వినకుండా తలబిరుసుగా మాట్లాడినందుకు నీకు శిక్ష తప్పదు. నీ బుర్రలోంచి ఈ పిచ్చి పిచ్చి మతవిశ్వాసాలన్నీ వదిలేవరకు నిన్ను శిక్షిస్తాను. (అంటూ మండిపడ్డాడు)

ఆ వెంటనే ఉమయ్యా, తన ఇతర బానిసలను పిలిచాడు. వారితో, బిలాల్ (రజి) కాళ్ళూచేతులు కట్టెయ్యమన్నాడు. బహిరంగ స్థలంలో తీసుకువెళ్ళి కొరడాతో కొట్టమన్నాడు. తమ యజమాని ఆజ్ఞప్రకారం, ఉమయ్యా ఇతర బానిసలు, బిలాల్ (రజి)ను బహిరంగ స్థలంలోకి తీసుకువెళ్ళి గొడ్డును బాదినట్టు బాదారు. విచక్షణా రహితంగా కొట్టారు.

బిలాల్ (రజి) శరీరం రక్తసిక్తమయ్యేలా కొట్టిన తర్వాత వాళ్ళు, బిలాల్ (రజి) శరీరాన్ని ఈడ్చుకుంటూ బానిసల కొట్టంలో పారేశారు.

ఆ తర్వాత వారు ఉమయ్యా వద్దకు వెళ్ళి...., "అయ్యా! మామూలు మనిషయితే మా దెబ్బలకు ఎప్పుడో లొంగిపోయేవాడు. కాని, బిలాల్ (రజి) సాధారణమైన వ్యక్తి కాదు. కొరడా శరీరాన్ని తాకి మాంసఖండాలు ఎగసిపడినా ఆయన మాత్రం "దేవుడు ఒక్కడే" అన్న మాట తప్ప మరేమీ చెప్పలేదు. కనీసం బాధను కూడా వ్యక్తం చేయలేదు." అని అన్నారు.

ఉమయ్యా ఏం చెప్పాలో తెలియక వారిని వెళ్ళిపొమ్మన్నాడు.

 *అదే రోజు సాయంత్రం : -* 

ఆ రోజు సాయంత్రం ఉమయ్యా, బానిసల కొట్టంలోనికి వెళ్ళి చూశాడు. అక్కడ కనపడిన దృశ్యం మనిషన్న వాడినెవడినైనా కదిలించేస్తుంది. నెత్తురుతో కలిసిన శరీరం నేలపై పడి ఉంది. శరీరమంతా కొరడా దెబ్బల గుర్తులు. ఒళ్ళంతా దెబ్బలమయమే. కాని, ఆ దృశ్యం ఉమయ్యాను ఏమాత్రం కదిలించలేదు. నిర్దయగా కాలితో తన్నాడు. ఆ శరీరం నుంచి ఎలాంటి బాధను వ్యక్తం చేసే శబ్దం వినబడలేదు. కాని, ఉమయ్యా రెండు కళ్ళు బిలాల్ (రజి)ని సూటిగా చూశాయి. అపుడు ఉమయ్యా, వెటకారంగా బిలాల్ (రజి)తో మాట్లాడుతూ....,

ఉమయ్యా : - ఈ దెబ్బలతో నీకు బుద్ధి వచ్చి ఉంటుంది. నువ్వు చెప్పే ఒకే దేవుడికి ఏమయ్యింది? నిన్ను రక్షించలేదా?

బిలాల్ (రజి) తన యజమాని వైపు ఎలాంటి బెదురు లేకుండా తిన్నగా చూస్తూ....,

బిలాల్ (రజి) : - నీ కొరడా దెబ్బలు నా శరీరాన్ని తునాతునకలు చేయవచ్చు గాక, కాని ఒకే ఒక్క దేవుడిపై నా విశ్వాసం చెక్కుచెదరదు.

ఆ వెంటనే బిలాల్ (రజి) కళ్ళపై మగత కమ్ముకుంది. దేవుడొక్కడే అంటూ పలవరిస్తూ స్పృహ కోల్పోయారు.

 *ఆ తరువాతి రోజు : -* 

మరుసటి రోజు మధ్యాహ్నం, ఎంత తీవ్రంగా ఉంది. వేడి పొగలు సెగలు క్రక్కుతోంది. ఉమయ్యా తన బానిసలను పిలిచి బిలాల్ (రజి)ను బహిరంగ ప్రదేశానికి ఈడ్చుకురమ్మన్నాడు.

వారు బిలాల్ (రజి)ను, కాళ్ళూచేతులు కట్టేసి, తీసుకొచ్చి ఎండలో పారేశారు. ఆ వెంటనే ఒక పెద్ద బండరాతిని ఆయన రొమ్ముపై ఉంచారు. అలా ఆ ఎండలో రొమ్ముపై కాలే బండరాతిని ఉంచి గంటలకొద్ది వదిలేశారు. అపుడు ఉమయ్యా, బిలాల్ (రజి)తో...., "ఇప్పటికైనా మించిపోయిందిలేదు. ఇస్లాంను విడిచిపెట్టి లాత్, ఉజ్జా విగ్రహాలను పూజించు. లేకపోతే నీ గతి ఇంతే. చచ్చేవరకు నిన్ను వదిలిపెట్టను." అని అన్నాడు.

బిలాల్ (రజి)కు, ఆయన శరీరం క్రింద ఉన్న వేడి ఇసుక చర్మాన్ని మలమల మాడుస్తోంది. ఎడారి వేడిగాలికి, ఇసుక ఆయన ముక్కు పుటాల్లోకి, కళ్ళలోకి వచ్చిపడుతోంది. తల, ఎండ తీవ్రతకు పగిలిపోయేలా బాధిస్తోంది. ఒక విధమైన మగతలోకి ఆయన జారిపోయారు. అయినా ఆయన నోటి వెంట "దేవుడు ఒక్కడే" అన్న మాటలు తప్ప మరో మాట వినపడలేదు.

ఈ విధంగా ఉమయ్యా అనేక రోజుల పాటు బిలాల్ (రజి)ను హింసించడం కొనసాగించాడు. కాని, బిలాల్ (రజి) వైఖరిలో రవ్వంత మార్పు కూడా రాలేదు. ఆయనను ఎంతగా హింసిస్తే, ఆయన అంతగా ఏకైక దేవుని పట్ల నిబద్ధతను ప్రదర్శించసాగారు. ఎలాంటి బాధలు, హింసలు ఆయన్ను చలించేలా చేయలేకపోయాయి.

 *బానిసత్వం నుంచి విముక్తి : -* 

ఒకరోజు ప్రవక్త (సల్లం) ప్రియ సహచరుడు అబూబక్ర్ సిద్దీఖ్ (రజి) మక్కా శివార్లలో నడిచి వెళుతున్నారు. ఆయన చెవులకు "దేవుడు ఒక్కడే" అన్న పదాలు, అతి గంభీరమైన పదాలు వినిపించాయి. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని ఆసక్తిగా అటుగా వచ్చారు అబూబక్ర్ (రజి). అక్కడ ఉమయ్యా, అత్యంత క్రూరంగా బిలాల్ (రజి)ను హింసిస్తున్న దృశ్యం కనబడింది. ఉమయ్యా, బిలాల్ (రజి)పై నిలబడి పైశాచికంగా నవ్వుతున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి అబూబక్ర్ (రజి), ఉమయ్యాతో ఇలా అన్నారు....,

అబూబక్ర్ (రజి) : - (ఉమయ్యా!) ఆ మనిషి అలమటిస్తుంటే నీ హృదయంలో ఎలాంటి జాలి పుట్టడంలేదా? ఇలాంటి అమానుష హింసలకు గురిచేస్తున్నావు. ఇతను చేసిన నేరం ఏమిటి?

అని అడిగారు అబూబక్ర్ (రజి). దానికి ఉమయ్యా గర్వంగా....,

ఉమయ్యా : - వీడు నా బానిస. నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. నన్ను తప్పు పట్టవద్దు. 
              దీనికంతటికీ కారణం నువ్వూ, నీ సహచరులే. నీకంత జాలిగా ఉంటే వీడిని కొనుక్కొని ఈ బాధల నుంచి విముక్తి కలిగించవచ్చు కదా? ఆ రకంగా అయినా నేను వీడిని వదిలించుకుంటాను.

ఆ వెంటనే అబూబక్ర్ (రజి) తన సొమ్ముతో బిలాల్ (రజి)ను కొని, ఉమయ్యా హింసల నుంచి విముక్తి లభించేలా చేశారు. ఆ తరువాత అబూబక్ర్ (రజి), బిలాల్ (రజి)తో...., "అల్లాహ్ ప్రసన్నత కోసం నేను నీకు స్వేచ్ఛ ప్రసాదిస్తున్నాను. కాని, ముందు నాతో రా.... నీ గాయాలకు చికిత్స చేయడం అవసరం." అన్నారు. తనతో పాటు బిలాల్ (రజి)ను ఇంటికి తీసుకెళ్ళి, ఆయన గాయాలకు చికిత్స చేయించారు.

 *ఇదే విషయమై మరొక ఉల్లేఖనంలో...., ↓* 

హజ్రత్ బిలాల్ (రజి), ఉమయ్యా బిన్ ఖల్ఫ్ హుమ్'జయీ కి బానిస. ఉమయ్యా, బిలాల్ (రజి) మెడలో త్రాడువేసి పోకిరి పిల్లల చేతికి ఇచ్చేవాడు. వారు ఆయన్ను మక్కా కొండల్లో త్రిప్పేవారు. అలా త్రిప్పడం వలన త్రాడు గుర్తులు ఆయన మెడపై పడేవి. స్వయంగా ఉమయ్యా ఆయన్ను కట్టేసి కర్రలతో చితక బాదేవాడు. మధ్యాహ్నం మండుటెండలో బలవంతంగా కూర్చుండబెట్టేవాడు. అన్నపానీయాలు ఇవ్వకుండా పస్తులుంచేవాడు. అంతకంటే మించిన దౌర్జన్యం ఏమిటంటే, మధ్యాహ్నం ఎండ బాగా తీవ్రమైనప్పుడు మక్కాలోని రాళ్ళుదేలిన ప్రదేశంలో పడుకోబెట్టి, ఆయన ఛాతీపై బరువైన బండరాయి పెట్టించి ఇలా చెప్పేవాడు; "దైవసాక్షి! నీవిలానే పడి ఉంటావు. చివరికి నీ ప్రాణం పోతుంది. ముహమ్మద్ (సల్లం)ను తిరస్కరించు. బ్రతికిపోతావు" అని.

హజ్రత్ బిలాల్ (రజి), ఆ పరిస్థితిలోనే "అహద్" "అహద్" (ఒక్కడే, ఒక్కడే) అని పలికేవారు. ఓ రోజు ఇలాంటి సంఘటనే జరుగుతూ ఉండగా అటు నుంచి హజ్రత్ అబూబక్ర్ (రజి) వెళుతూ చూశారు. ఆయన, బిలాల్ (రజి)ను ఓ నల్లని నీగ్రో బానిసను బదులుగా కొనేశారు.

మరో ఉల్లేఖనం ప్రకారం; రెండొందల దిర్హమ్ లకు (735 గ్రాముల వెండి) లేదా 280 దిర్హమ్ లకు (ఒక కిలో పెచ్చువెండి) ఇచ్చి కొన్నట్లు ఉంది.

 *రేపటి భాగములో, విశ్వాసులపై విరుచుకుపడిన కష్టాలు : - 2 గురించి....,* 

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment