257

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 257*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 172*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*7. రెండో బద్ర్ పోరాటం : -*

బద్దూలను అణచేసి, వారు ఇక ముస్లింలకు నష్టం చేకూర్చలేరనే స్థిమితం ఏర్పడిన తరువాత ముస్లింలు తమ పెద్ద శత్రువు (ఖురైష్)తో యుద్ధం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు.

ఖురైష్ సేనాపతి అబూ సుఫ్'యాన్ ఉహద్ యుద్ధం నుండి వెళ్ళిపోతూ, *"వచ్చే ఏడు మళ్ళీ బద్ర్ లో మన ఉభయవర్గాల మధ్య పోటీ ఉంటుంది."* అని ముస్లింలను హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది.

ముహమ్మద్ (సల్లం) మరియు ఆయన అనుచరులు యుద్ధరంగంలో అబూ సుఫ్'యాన్ మరియు అతని జాతితో బాహాబాహీ చేసే సమయం ఆసన్నమవుతోంది. జరగబోయే ఈ యుద్ధం పూర్తిగా ముస్లింల మనుగడకు మార్గం చూపేదై, ఇస్లాం ధర్మాన్ని వ్యాపింపజేసేదై ఉండాలని ఓ నిర్ణయాత్మకమైన రీతిలో యుద్ధం కోసం సంసిద్ధులవుతున్నారు ముస్లింలు.

ఇటు మరోవైపు, ముస్లిం యోధుల ధైర్యసాహసాలు, ప్రతిభా పరాక్రమాలను తలచుకుంటే అబూ సుఫ్'యాన్ గుండెలో దడ పుట్టసాగింది. తొందరపడి ముస్లింలకు హెచ్చరిక చేశానే అని పశ్చాత్తాప పడుతున్నాడు.

ఇప్పుడు ఏం చెయ్యాలి? చేతులు ముడుచుకొని కూర్చుందామా? అలాగైతే ఇది కూడా తమకు అవమానకరమే. నలుగురిలో అభాసుపాలు కావలసి వస్తుంది. అందరూ తమను చేతకాని వాజమ్మల క్రింద జమకడతారు. అయితే మరేం చెయ్యాలి? ఇలా పరిపరి విధాల ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు ఖురైష్ నాయకులు.

దాని ప్రకారం వారు కొందరు గూఢచారుల్ని ఎన్నుకొని మదీనా పంపనారంభించారు. ఈ గూఢచారులు మదీనా వెళ్ళి ముస్లింల దగ్గర మక్కా ఖురైషీయుల సైనిక శక్తిని గురించి, వారి యుద్ధ సామాగ్రిని గురించి గోరంతలను కొండంతలు చేసి చెప్పసాగారు. ఇలా చెప్పి ముస్లింల మనోస్థయిర్యాన్ని దెబ్బతీయాలని, యుద్ధం పట్ల వారి ఉత్సహాన్ని నీరుగార్చాలని ఖురైష్ నాయకులు ఆశించారు.

కొందరు ముస్లింలు వారి దుష్ప్రచారానికి ప్రభావితులయి భయపడసాగారు. 'హజ్రత్ ఉమర్ (రజి)' దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరించారు. ఖురైషీయులు విషవలయం పన్నారని దైవప్రవక్త (సల్లం) ఎప్పుడో గ్రహించారు.

అందువల్ల ఆయన (సల్లం), ఉమర్ (రజి) మాటలు విని, *"ఏ ఒక్కడూ రాకపోయినా వాగ్దానం ప్రకారం నేను మాత్రం అవిశ్వాసుల్ని ఎదుర్కోవడానికి తప్పకుండా బద్ర్ కు వెళ్తాను."* అని అన్నారు.

ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం) యుద్ధసన్నాహాలు ప్రారంభించారు. ఆయన (సల్లం)ను చూసి అనుచరులు కూడా సిద్ధమయ్యారు.

నిర్ణీత దినం వచ్చేసింది. హిజ్రీ శకం - 4, షాబాన్ నెల (క్రీ.శ. 626, జనవరి)లో మదీనా బాధ్యతను 'హజ్రత్ అబ్దుల్లా బిన్ రవాహా (రజి)'కు అప్పగించి ఈ నిర్ణయించబడిన యుద్ధం కోసం బద్ర్ వైపునకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు ప్రవక్త (సల్లం). ఆయన (సల్లం) వెంట 1500 మంది సైనికులు, పది గుర్రాలున్నాయి. యుద్ధ పతాకాన్ని 'హజ్రత్ అలీ (రజి)' గారికి ఇవ్వడం జరిగింది.

దైవప్రవక్త (సల్లం), తన ఈ సైన్యాన్ని తీసుకొని బద్ర్ ప్రాంతానికి బయలుదేరారు. అక్కడ ప్రతి ఏటా పెద్ద ఎత్తున సంత జరుగుతుంది. అందువల్ల ముస్లిం యోధులు తమ వెంట వ్యాపార సరుకు కూడా తెచ్చుకున్నారు. తీరా అక్కడికి చేరుకుంటే ఖురైష్ సైనికుల జాడేలేదు. ముస్లిం యోధులు మాత్రం అక్కడే విడిదిచేసి వారి కోసం ఎదురుచూడసాగారు.

ఖురైషీయులు తమ మాట నిలబెట్టుకోవడానికైనా యుద్ధరంగానికి బయలుదేరక తప్పలేదు. కాని మరోవైపు యుద్ధంలో దారుణంగా ఓడిపోతామనే భయం కూడా వారిని పట్టి పీడిస్తోంది. ముస్లింలతో పోరాడటానికి ధైర్యం చాలడం లేదు.

అయినప్పటికీ మొండి ధైర్యంతో బయలుదేరారు. రెండు రోజుల ప్రయాణం సాగించారు. బద్ర్ ప్రాంతం దగ్గరయ్యే కొద్దీ మనసులో భయాందోళనలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కాళ్ళు వణుకుతున్నాయి. ముందుకు అడుగు వేయలేక పోతున్నారు.

గూఢచారి సమాచారం వల్ల ముస్లింల సైనికుల సంఖ్య 1500 అని తెలిసింది. బద్ర్, ఉహద్ యుద్ధాలలో తాము మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నా ముస్లింల చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు తమ సైనిక సంఖ్య 2000 మాత్రమే. ఇలా ఆలోచించి వారు మరింత భయపడిపోయారు.

సేనాపతి అబూ సుఫ్'యాన్ అయితే, తాను సరాసరి మృత్యు ముఖంలోకి పోబోతున్నానని తలచుకొని బెంబేలెత్తిపోతున్నాడు. ముస్లింలతో యుద్ధం గురించి ఆలోచిస్తేనే అతనికి ఆపాదమస్తకం వణుకు పుట్టుకొస్తోంది. వద్దు, పరిస్థితి అంతవరకు రానియ్య కూడదు. ఎలాగైనా ఈ ఆపద నుంచి బయటపడదామని నిర్ణయించుకొని అనుచరులు ఇలా నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు.

*"మిత్రులారా! యుద్ధం అనేది పచ్చిక రోజుల్లో జరిగితేనే మంచిది. మన పశువులూ మేత మేయగలవు, మనము పాలూ త్రాగగలం. కాని ఇప్పుడు చూడండి అంతటా కరువు తాండవిస్తోంది. కాబట్టి నేను వెనక్కు మళ్ళిపోతున్నాను. మీరు కూడా వెనక్కు మళ్ళండి."* అని అన్నాడు.

ఆ సేన మొత్తం మీదనే భయభీతులు ఆవహించాయా అన్నట్లు ఉంది. అబూ సుఫ్'యాన్ ఇచ్చిన సలహాను ఎవరూ కాదనలేకపోయారు. *"అలాగే కావివ్వండి."* అంటూ సేనాపతి అభిప్రాయంతో ఏకీభవించారు. వారిలో చాలామంది లోలోన సంతోషించారు కూడా. ఈ విధంగా చివరికి ఖురైష్ సైనికులంతా వెనక్కి తిరిగి మక్కా దారిపట్టారు.

ముస్లిం యోధులు బద్ర్ ప్రాంతంలో ఖురైష్ సైన్యం కోసం ఎనిమిది రోజులు ఎదురుచూశారు. ఈలోగా వారు సంతలో తమతమ సరుకులు అమ్ముకున్నారు. అల్లాహ్ అనుగ్రహం వల్ల విపరీతమైన లాభాలు కూడా వచ్చాయి.

ఈసారి సమరసొత్తుకు బదులు ఇంత దూరం వచ్చినందుకు కనీసం వ్యాపారంలోనైనా మంచి లాభాలు వచ్చినందుకు ముస్లింలు ఎంతో సంతోషించారు. ఖురైష్ సైన్యం ఇక రాదని తలచి అల్లాహ్ చేసిన మహోపకారాలను కొనియాడుతూ దైవప్రవక్త (సల్లం) అనుచరులను తీసుకొని మదీనా బయలుదేరారు.

వారందరూ విజేతలై తిరిగివచ్చినట్లుగా మదీనా చేరుకున్నారు. ముష్రిక్కుల హృదయాలు వారి భయం వల్ల గడగడలాడుతూ ఉండగా, వాతావరణం అంతా వారికి అనుకూలంగా మారినట్లుగా వారు మదీనాకు తిరిగి వచ్చారు. ఈ గజ్వాను 'గజ్వయె బద్రె మౌఇద్'గా, 'బద్రె సానియా'గా, 'బద్రె ఆఖిరా'గా మరియు 'బద్రె సుగ్రా'గా కూడా పిలుస్తారు.

*మిగిలినది In Sha Allah రేపటి భాగంలో....; →*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment