296

🤝🏻  *అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు*  🤝🏻

🕋🇸🇦🕋   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    🕋🇸🇦🕋

*❂―――•――•――•―○―•――•――•―――❂*

🛐🕌☪         *ఇస్లాం చరిత్ర* *- 296*         ☪🕌🛐

🇸🇦🕋  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 211*  🕋🇸🇦

*❂―――•――•――•―●―•――•――•―――❂*

           *రెండవ దశ : - - : క్రొత్త మార్పు*

హుదైబియా ఒప్పందం, యధార్థంగా ముస్లిముల జీవితంలో వచ్చిన ఓ క్రొత్త మార్పే అనాలి. ఖురైష్ జాతి, ఇస్లాం పట్ల వైరంలోను, శత్రుత్వంలోనూ తీవ్రమైన మొండి వైఖరిగల జగడాల మారి జాతి. అందుకని వారు యుద్ధంలో అపజయంపాలై శాంతి వైపునకు మొగ్గుజూపినప్పుడు, అహ్జాబ్ యుద్ధంలో కలసి పోరాడిన మూడు పక్షాల్లో - ఖురైష్, గత్ఫాన్ మరియు యూదులు - పటిష్టమైన ఒక పక్షం చిన్నాభిన్నమైపోయింది. ఖురైషులే పూర్తి అరేబియా ద్వీపకల్పంలో విగ్రహారాధనకు ప్రాతినిధ్యం వహించేవారుగా, దానికి నాయకులుగా ఉన్నందువలన, వారు యుద్ధమైదానం నుండి వైదొలగిపోగానే విగ్రహారాధకుల భావోద్రేకాలు కాస్తా చల్లబడిపోయాయి. వారి శత్రుత్వ వైఖరిలో చాలా మటుకు మార్పు వచ్చేసింది. అందుకని ఈ ఒప్పందం జరిగిన తరువాత గత్ఫాన్ వారి వైపు నుండి ఎలాంటి గొడవలు జరిగినట్లు మనకు అగుపడదు. వారేదైనా చేయగలిగారంటే అది కూడా యూదులు రెచ్చగొట్టడం మూలంగానే.

ఇక యూదుల విషయానికి సంబంధించినంత మటుకు, వారు యస్రిబ్ (మదీనా) నుండి బహిష్కరింపబడిన తరువాత 'ఖైబర్' చేరి దాన్ని తమ కుట్రలకు, కుతంత్రాలకు కేంద్రంగా మలుచుకున్నారు. అక్కడ యూదులకు చెందిన కుట్రదారులు తమ ప్రయత్నాలలో నిమగ్నమైపోయి సంక్షోభాన్ని రేకెత్తించే ప్రయత్నంలో మునిగిపోయారు. తమ చుట్టుపట్ల నివసిస్తున్న బద్దూలను ఉసిగొలుపుతూ దైవప్రవక్త (సల్లం) మరియు ముస్లిములను హతమార్చేందుకు లేదా కనీసం వారికి భారీ నష్టాన్నయినా కలిగించే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. కాబట్టి హుదైబియా ఒప్పందం తరువాత దైవప్రవక్త (సల్లం) మొట్టమొదటిగా యూదుల ఆటపట్టువైన 'ఖైబర్'ను జయించి వారి ఆగడాలను మట్టుబెట్టేందుకు నిర్ణయాత్మక సైనిక చర్య చేపట్టారు.

ఎలాగైతేనేమి, హుదైబియా ఒప్పందం తరువాత ప్రారంభమైన శాంతి ఘట్టం ద్వారా ముస్లిములకు ఇస్లామీయ సందేశ ప్రచారాన్ని వ్యాపింపజేసే ముఖ్యమైన అవకాశం లభించినట్లయింది. ఇస్లామీయ ప్రచార కార్యక్రమాల కోసం, ఈ రంగంలో వారి కృషి, సైనిక చర్యలంటే ముఖ్యమైపోయింది. కాబట్టి ఆ కాలంలో జరిగిన కార్యక్రమాలను రెండు విధాలుగా విభజించి చూడడం సబబుగా తోస్తుంది.

*1. సందేశ ప్రచారం మరియు రాజులకు, సర్దారులకు లేఖలు పంపించడం.*

*2. యుద్ధ కదలికలు.*

ఈ దశలో, యుద్ధ కదలికలను గురించి చెప్పే బదులు, రాజులు ,సర్దారుల పేర పంపబడిన లేఖల గురించిన వివరాలు చెప్పడం ముఖ్యమని భావిస్తున్నాము. ఎందుకంటే, సహజంగా ఇస్లామీయ సందేశ ప్రచార ధ్యేయమే అసలు ఇస్లాం యొక్క ధ్యేయం. ఈ లక్ష్యాన్ని సాధించడానికే ముస్లిములు రకరకాల కష్టాలను, యుద్ధాలను, సంక్షోభాలను భరిస్తూ వస్తున్నారు.

*రాజులకు, సర్దారులకు పంపించిన లేఖలు : - 1*

హిజ్రీ శకం - 6 చివరన దైవప్రవక్త (సల్లం) హుదైబియా నుండి మదీనాకు తిరిగివచ్చాక, వివిధ రాజుల పేరున లేఖలు రాసి వారిని ఇస్లాం సందేశం వైపునకు ఆహ్వానించారు.

మహాప్రవక్త (సల్లం) వారికి ఆ లేఖలను రాయడానికి ఉపక్రమించినప్పుడు, ఏ రాజైనా, ఏ చక్రవర్తి అయినా ఆ లేఖను స్వీకరించాలంటే దానిపై ముద్ర తప్పక ఉండాలి అనే సలహా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన (సల్లం) ఓ వెండి ముద్రను తయారు చేయించారు. ఆ ముద్రపై *'ముహమ్మదుర్రసూలుల్లాహ్'* అనే అక్షరాలు చెక్కబడి ఉన్నాయి.

అలా లేఖలు రాయించి అనుభవజ్ఞులైన సహాబాలకిచ్చి దూతలుగా వారి వద్దకు పంపారు. ఈ దూతల్ని, ఖైబర్ యుద్ధానికి బయలుదేరడానికి కొన్ని రోజుల ముందు, ఒకటవ ముహర్రం హిజ్రీ శకం - 7న పంపారని 'అల్లామా మన్సూర్ పూరి' పూర్తి ఆధారాలతో చెబుతారు. వచ్చే పంక్తుల్లో ఆ లేఖలు ఆ లేఖల వలన కలిగిన ప్రతి స్పందనలను గురించి తెలుసుకుందాం.

*1. అబీసీనియా చక్రవర్తి 'నజాషీ' పేరున పంపిన లేఖ : -*

ఈ నజాషీ పేరు ''అస్'హమా బిన్ అబ్'హర్". దైవప్రవక్త (సల్లం) అతని పేర రాసిన లేఖను, 'అమ్రూ బిన్ ఉమయ్యా జమ్రీ (రజి)' చేతికిచ్చి హిజ్రీ శకం - 6 చివరన లేదా హిజ్రీ శకం - 7 ప్రారంభంలో పంపించారు. 'తిబ్రీ' ఈ లేఖలోని పూర్తి పాఠాన్ని కూడా ఉటంకించాడు. అయితే ఈ లేఖలో రాయబడిన విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తే, దీన్ని దైవప్రవక్త (సల్లం) హుదైబియా ఒప్పందం తరువాత రాసిన లేఖలా అగుపించదు. బహుశా ఈ లేఖలో రాసిన విషయాలు దైవప్రవక్త (సల్లం) మక్కాలో ఉన్నప్పుడే, హజ్రత్ జాఫర్ (రజి) అబీసీనియాకు హిజ్రత్ చేసి వెళ్ళేటప్పుడు రాసి ఇచ్చిన లేఖ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ లేఖ చివరన ముహాజిర్ల ప్రస్తావన ఈ క్రింది మాటల్లో ఉంది.

*"నేను మీ వద్దకు నా పినతండ్రి కుమారుడైన జాఫర్ వెంట ఓ బృందాన్ని పంపించాను. వీరు మీ వద్దకు వచ్చినప్పుడు వీరికి మీ దేశంలో శరణు ఇవ్వండి. వారిపై ఎలాంటి ఒత్తిడి చేయకండి."*

బైహఖీ, హజ్రత్ అబ్బాస్ (రజి) ఉల్లేఖించిన ఉల్లేఖనం ద్వారా మరో ఉత్తరం పూర్తి పాఠం ఇలా ఉందని రాస్తున్నారు. దాని అనువాదం ఇలా ఉంది....; ↓

*"ఈ లేఖ ముహమ్మద్ దైవప్రవక్త (సల్లం) తరఫున నజాషీ అస్'హమ్, అబీసీనియా చక్రవర్తికి రాయబడుతూ ఉంది.*

  *సన్మార్గాన్ని అనుసరిస్తూ, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించిన వారికి సలాం (శుభాలు). ఏ ఒక్కడూ సాటిగా రాని ఆ అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఆయనకు భార్య గాని, కుమారుడుగాని లేరు. అలాగే ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని కూడా నేను సాక్ష్యం ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ఇస్లాం వైపునకు ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే నేను అల్లాహ్ ప్రవక్తను గనుక. కాబట్టి మీరు ఇస్లాం స్వీకరిస్తే శాంతిని పొందగలరు. 'ఓ గ్రంథవహులారా! మాకూ, మీకూ నడుమ సమానంగా ఉన్న ఆ విషయం వైపునకు రండి. అదేమిటంటే, అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించము అని, ఆయనకు ఇంకెవ్వరినీ సాటి కల్పించము అని మరియు మనలో ఏ ఒక్కరూ మరి ఒకరిని అల్లాహ్ తప్ప ప్రభువుగా చేసుకోము అనేది. ఒకవేళ వారు దాన్ని తిరస్కరిస్తే చెప్పేయండి, మేము ముస్లిములము, మీరే దానికి సాక్షి అని'. మీరు ఈ సందేశాన్ని స్వీకరించకపోతే మీ జాతి నసారా (క్రైస్తవుల) పాపం అంతా మీదే అవుతుంది."*

డాక్టరు హమీదుల్లాహ్ (ప్యారిస్), ఇంకో లేఖలో ఉన్న వస్తువును తన గ్రంథంలో ఉటంకించారు. ఇది ఇటీవలే లభ్యమైన లేఖ. ఒకే ఒక పదం తేడాతో ఆ లేఖే, అల్లామా ఇబ్నె ఖైమ్ గ్రంథం జాదుల్ ముఆద్ లోనూ నిక్షిప్తమై ఉంది. డాక్టరు హమీదుల్లాహ్, ఈ లేఖలో రాసివున్న వస్తువు గురించి పరిశోధించడంలో ఆధునిక విధానాలను అనుసరించారు. ఈ లేఖ ఫోటోను తన గ్రంథంలో అచ్చువేయించారు కూడా. ఆ లేఖ అనువాదం ఇది. ↓

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

  *అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్, అబీసీనియా చక్రవర్తి నజాషీకి వ్రాయునది.*

  *సన్మార్గాన్ని అనుసరించే వ్యక్తికి సలాం (శాంతి కలుగుగాక). అల్లాహ్ తప్ప మరే పూజ్యుడు లేడనీ, ఆయన ఖుద్దూస్ (పవిత్రుడు) మరియు సలాం (దైవ సుగుణాల్లో ఓ సుగుణం, శాంతి) అనీ, శాంతి ప్రదాత, సంరక్షకుడు అనీ మీకు నేను తెలియపరుస్తున్నాను. 'ఈసా ఇబ్నె మర్యం (మరియం కుమారుడు ఈసా)', అల్లాహ్ తన ఆత్మను మర్యంలోకి ఊదడం వల్ల ఆమె గర్భవతి అయిందని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇది అల్లాహ్ ఆదం (అలైహి)ను సృష్టించిన తీరు అలాంటిదే. నేను, ఆయనకు ఎవరూ సాటిలేరని ఆ అల్లాహ్ వైపునకు, ఆయన విధేయతకు పరస్పరం సహకారాన్ని అందించే వైపునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దీనికితోడు, మీరు నన్ను అనుసరించాలని, నా వైపునకు ఏదైతే వచ్చిందో దాన్ని విశ్వసించమని పిలుపునిస్తున్నాను. ఎందుకంటే, నేను అల్లాహ్ ప్రవక్తను. నేను మిమ్మల్ని మీ సైన్యాన్ని అల్లాహ్ వైపునకు పిలుస్తున్నాను. నేను నా సందేశాన్ని మీకు వినిపించేశాను. కాబట్టి నా హితబోధను స్వీకరించండి. ధర్మమార్గాన్ని అనుసరించే వారికి శాంతి కలుగుగాక.★*

_(★→ జాదుల్ ముఆద్ లో చివరి పదం *'వస్సలాము అలా మనిత్తబ ఉల్ హుదా (ధర్మమార్గాన్ని అనుసరించే వారికి శాంతి కలుగుగాక)'* కు బదులు *'అస్లిమ్ అన్త (నీవు ముస్లిం అయిపో)'* అని ఉంది. చూడండి, జాదుల్ ముఆద్ - 3/60)_

ఏదైతేనేమి, అమ్రూ బిన్ ఉమయ్యా జమ్రీ (రజి), దైవప్రవక్త (సల్లం) పంపించిన ఈ లేఖను నజాషీకి అందించగా అతను దాన్ని తీసుకొని కళ్ళకు అద్దుకున్నాడు. అదే పరిస్థితిలో సింహాసనం నుండి క్రిందికి దిగి వచ్చి హజ్రత్ జాఫర్ బిన్ అబీ తాలిబ్ చేతుల మీదుగా ఇస్లాం స్వీకరించాడు. చక్రవర్తి నజాషీ, దైవప్రవక్త (సల్లం) గారి సన్నిధికి ఈ విషయం గురించి ఏ జవాబు అయితే రాసి పంపాడో దాని అనువాదాన్ని ఇక్కడ రాయడం జరిగింది. ↓

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

*దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) గారి సన్నిధికి అస్'హమా వ్రాయునది.*

  *ఓ దైవప్రవక్తా! ఆరాధనకు అర్హుడైన ఆ అల్లాహ్ తరఫున తమకు సలాములు, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక. ఆ తరువాత.*

  *ఓ అల్లాహ్ ప్రవక్తా! నాకు మీరు పంపిన లేఖ అందింది. ఈ లేఖలో హజ్రత్ ఈసా (అలైహి)గారి ప్రస్తావన ఉంది. భూమ్యాకాశాల ప్రభువు సాక్ష్యంగా, తమరు (తమ లేఖలో) ప్రస్తావించినట్లుగానే హజ్రత్ ఈసా (అలైహి) ఓ గడ్డిపోచకంటే ఎక్కువ ఏమీ కాదు. తమరు వర్ణించిన మనిషే ఆయన.*

  *తమరు మా వద్దకు పంపించిన సందేశాన్ని తెలుసుకున్నాము. మీ పినతండ్రి కుమారునికి మరియు మీ అనుచరులకు ఆతిథ్యం ఇచ్చాము. తమరు అల్లాహ్ యొక్క నిజమైన ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. నేను మీతో బైత్ చేశాను. మీ పినతండ్రి కుమారుని చేతి మీదుగానూ బైత్ చేశాను. ఆయన చేతి మీదుగానే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ కోసం ఇస్లాం స్వీకరించాను.*

ప్రవక్త మహనీయులు (సల్లం), హజ్రత్ జాఫర్ (రజి) మరియు అబీసీనియాకు వెళ్ళిన ఇతర ముహాజిర్లను వెనక్కు పంపించమని కూడా కోరి ఉన్నారు నజాషీని. అందుకని అతను, హజ్రత్ జాఫర్ (రజి), హజ్రత్ అబూ మూసా అష్అరీ (రజి)లను ఇంకా ఇతర సహాబా (రజి)లను, హజ్రత్ అమ్రూ బిన్ ఉమయ్యా జమ్రీ (రజి) వెంట వెళ్ళడానికి రెండు పడవలను కూడా సమకూర్చాడు. వీరు నేరుగా ఖైబర్ కు చేరి దైవప్రవక్త (సల్లం)ను దర్శించుకున్నారు. మరో పడవలో వీరి కుటుంబసభ్యులు నేరుగా మదీనాకు చేరుకున్నారు.

_(దైవప్రవక్త (సల్లం), అబీసీనియా రాజు నజాషీ వద్దకు పంపిన ఈ లేఖలో, ఉమ్మె హాబీబా (రజి)తో తమ నికాహ్ చేయమని కూడా రాశారు. నజాషీ, ఉమ్మె హాబీబా (రజి) స్వీకారంతో ఆమె నికాహ్ దైవప్రవక్త (సల్లం)తో చేసివేశాడు. ← ఈ వృత్తాంతంలోని వివరణను, 'రాజులకు మరియు సర్దారులకు పంపించిన లేఖలు' అనే వృత్తాంతాల తర్వాత తెలుసుకుందాం.)_

పైన పేర్కొన్న నజాషీ, తబూక్ యుద్ధానంతరం రజబ్ నెల హిజ్రీ శకం - 9లో మరణించగా, దైవప్రవక్త (సల్లం) అతని మరణం రోజున్నే సహాబా (రజి)కు అతని మరణ వార్తను తెలియజేశారు. ఆ తరువాత అతని 'గాయిబానా నమాజె జనాజా' చేశారు. అంటే అతని మృతదేహం ఎదురుగా లేకుండానే జనాజా నమాజు చేశారన్నమాట. అతని మరణాంతరం మరో రాజు సింహాసనాన్ని అధిష్టించగా దైవప్రవక్త (సల్లం) అతనికి కూడా ఓ లేఖ రాసి పంపించారు. అయితే అతను ఇస్లాం స్వీకరించింది లేనిది తెలిపే ఆధారాలు లభించలేదు.

*In Sha Allah రేపటి భాగంలో....; ↓*

*2. ఈజిప్టు చక్రవర్తి ముఖౌఖిస్ కు పంపిన లేఖ : -*

297

🤝🏻  *అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు*  🤝🏻

🕋🇸🇦🕋   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    🕋🇸🇦🕋

*❂―――•――•――•―○―•――•――•―――❂*

🛐🕌☪         *ఇస్లాం చరిత్ర* *- 297*         ☪🕌🛐

🇸🇦🕋  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 212*  🕋🇸🇦

*❂―――•――•――•―●―•――•――•―――❂*

*రాజులకు, సర్దారులకు పంపించిన లేఖలు : - 2*

*2. ఈజిప్టు చక్రవర్తి ముఖౌఖిస్ కు పంపిన లేఖ : -*

ప్రవక్త శ్రీ (సల్లం) ఓ లేఖను 'జరీహ్ బిన్ మత్తై'★ పేరున పంపించడం జరిగింది. అతని బిరుదు 'ముఖౌఖిస్'. ఇతను ఈజిప్టుకు, అలెగ్జాండ్రియాకు రాజు. ఆ లేఖ ఇలా ఉంది. ↓

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

  *అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త అయిన ముహమ్మద్, ఖిబ్త్ చక్రవర్తి అయిన ముఖౌఖిస్ కు వ్రాయునది.*

  *సన్మార్గాన్ని అవలంబించేవానికి శుభం కలుగుగాక. నేను మిమ్మల్ని ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానిస్తున్నాను. ఇస్లాం స్వీకరిస్తే మీరు క్షేమంగా ఉండగలరు. ముస్లిములైపోతే అల్లాహ్ మీకు రెట్టింపు ప్రతిఫలం ఇస్తాడు. కాని దీన్ని తిరస్కరిస్తే ఖిబ్త్ వారి పాపం కూడా మీదే. ఓ ఖిబ్త్ ప్రజలారా! మాకూ, మీకూ మధ్య సమానంగా ఉన్న ఆ విషయం వైపునకు రండి. అదేమిటంటే అల్లాహ్ తప్ప మనం మరెవ్వరినీ ఆరాధించము అనేది, ఆయనకు మరెవ్వరినీ సాటి కల్పించము అనేది మరియు మనలో ఏ ఒక్కడూ మరొకరిని అల్లాహ్ తప్ప ప్రభువుగా చేసుకోము అనేదే. ఒకవేళ వారు దాన్ని తిరస్కరిస్తే చెప్పేయండి, మేము ముస్లిములము, మీరే దానికి సాక్షి అని.*☆

ఈ లేఖను అందించడానికి ఆయన (సల్లం), ''హజ్రత్ హాతిబ్ బిన్ అబీ బల్'తఅ (రజి)''ను ఎంపిక చేశారు. ఆయన ముఖౌఖిస్ దర్బారుకు చేరి ఇలా అన్నారు. ↓

*"(ఈ భూమ్మీద) మీకంటే పూర్వం ఓ వ్యక్తి గతించాడు. అతను తనను తాను మహా దేవుడని పిలుచుకున్నాడు. అల్లాహ్ అతణ్ణి చివరి వారికి, మొదటి వారికి గుణపాఠంగా చేశాడు. మొదట అతను తన ఈ అధికారం ఉపయోగించి ప్రజల పగ తీర్చుకున్నాడు. ఆ తరువాత తానే ఆ పగకు బలైపోయాడు. కాబట్టి, ఇతరులు మిమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకోక మునుపే ఇతరులను చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి."*

ఇది విన్న ముఖౌఖిస్, *"మాకూ ఒక ధర్మమంటూ ఉంది. అంతకంటే మేలైన ధర్మం మాకు లభించనంతమట్టుకు దాన్ని త్యజించేవారము కాము"* అని అన్నారు.

దానికి హజ్రత్ హాతిబ్, *"మేము మిమ్మల్ని ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానిస్తున్నాము. దీన్ని అల్లాహ్ తక్కిన (ధర్మాల) వాటి కంటే ఉత్తమమైనదిగా చేశాడు. చూడండి! ఆ ప్రవక్త ప్రజలను ఇస్లాం వైపునకు ఆహ్వానించినప్పుడు ఖురైషులు అందరి కంటే కఠినులై దాన్ని వ్యతిరేకించారు. యూదులు అందరికంటే ఎక్కువగా శత్రుత్వాన్ని వహించారు. కాని 'నసారా' (క్రైస్తవులే) దీనికి దగ్గరగా ఉన్నారు. నా ఈ వయస్సు సాక్షిగా! హజ్రత్ మూసా (అలైహి), హజ్రత్ ఈసా (అలైహి) ఆగమన శుభవార్త ఇచ్చినట్లే, హజ్రత్ ఈసా (అలైహి), హజ్రత్ ముహమ్మద్ (సల్లం) గారి ఆగమన వార్తనిచ్చారు. మీరు తౌరాత్ గ్రంథవహులకు ఇంజీల్ (బైబిల్) గ్రంథం గురించి బోధించినట్లే మేము మీకు దివ్య ఖుర్ఆన్ బోధనల వైపునకు రమ్మంటున్నాం. ఏదైనా ఓ జాతిలో ప్రవక్త ప్రభవిస్తే ఆ జాతి ఆయన సమాజమైపోతుంది. ఆ జాతి ఇక ఆ ప్రవక్తను విధేయించడం తప్పనిసరి. మీరు ఆయన కాలంలో ఉన్నవారు. అదేకాదు, మేము మిమ్మల్ని మెసయ్యా ధర్మం నుండి అడ్డుకోవడం లేదు. ఆ ధర్మం భోదించిన విషయాన్నే మేము మీకు బోధిస్తున్నాం."* అని అన్నారు.

ముఖౌఖిస్ ఆ ఉత్తరాన్ని అందుకొని, గౌరవపూర్వకంగా దాన్ని ఏనుగు దంతంతో చేయబడిన డబ్బీలో వేసి దానిపై సీలు వేశాడు. దాన్ని తన స్త్రీ బానిసకు దాయమని ఇచ్చాడు. అరబీ భాష రాయగల ఒక మనిషిని పిలిపించి దైవప్రవక్త (సల్లం) గారి సన్నిధికి ఈ క్రింది లేఖ రాయించాడు. ↓

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

  *ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ కు చక్రవర్తి ముఖౌఖిస్ రాయునది.*

  *మీకు సలాము. అనంతరం, నేను తమ లేఖను చదివాను. ఆ లేఖలో ప్రస్తావించబడిన విషయాన్ని, తమ సందేశాన్ని అర్థం చేసుకున్నాను. నాకు తెలిసినంతమట్టుకు ఓ ప్రవక్త ఇంకా రావలసి ఉంది. ఆయన సిరియా దేశం నుండి ప్రభవిస్తాడని నా అంచనా. నేను తమ దూతను గౌరవించాను. తమ సన్నిధికి ఇద్దరు స్త్రీ బానిసలను పంపిస్తున్నాను. వీరికి ఖిబ్తీలలో గొప్ప గౌరవం ఉంది. కొన్ని వస్త్రాలను, తమరు స్వారీ చేయడానికి గాను ఓ ఖచ్చర్ (కంచర గాడిద)ను కూడా కానుకలుగా పంపిస్తున్నాను. మీకు సలాం (శుభాలు కలుగుగాక).*

ముఖౌఖిస్ అంతకంటే మరింకేమీ రాయలేదు. ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. ఇద్దరు స్త్రీ బానిసలు 'మారియా' మరియు 'సిరీన్'లు. ఖచ్చర్ పేరు 'దుల్ దుల్'. ఇది 'హజ్రత్ అమీరె మావియా' కాలం వరకు జీవించి ఉండింది.

దైవప్రవక్త (సల్లం), 'మారియా'ను తమ వద్దే ఉంచుకున్నారు. ఆమె గర్భాన దైవప్రవక్త (సల్లం) కుమారుడు 'ఇబ్రాహీం' జన్మించారు. ఇక 'సిరీన్'ను 'హజ్రత్ హస్సాన్ బిన్ సాబిత్ అన్సారి (రజి)'కు అప్పజెప్పారు.

_(★→ ఈ పేరును 'అల్లామా మన్సూర్ పూరి' గారు రహెమతుల్ లిల్ ఆలమీన్ 1/78లో ప్రస్తావించారు. డాక్టర్ హమీదుల్లాహ్ గారు అతని పేరు 'బిన్ యామీన్' అని వ్రాశారు. చూడండి దైవప్రవక్త (సల్లం) గారి రాజకీయ జీవితం (రసూలె అక్రమ్ కి సియాసి జిందగి) పేజీ 141.)_

_(☆→ జాదుల్ ముఆద్ అల్ ఇబ్నె ఖైమ్ - 3/61. ఇటీవలి కాలంలోనే ఈ లేఖ లభించింది. డాక్టర్ హమీదుల్లాహ్ ఏ ఫోటో అయితే తన గ్రంథంలో ప్రచురించారో దానికి మరియు జాదుల్ ముఆద్ లేఖలో కేవలం రెండే రెండు అక్షరాల తేడా ఉంది. జాదుల్ ముఆద్ లో 'అస్లమ్ తస్లిమ్. అస్లమ్ యూతికల్లాహ్ - చివరి వరకు'. లేఖలో 'ఫస్లిమ్ తస్లిమ్ యూతికల్లాహ్' అని ఉంది. అలాగే జాదుల్ ముఆద్ గ్రంథంలోని లేఖలో 'అసిమ్ అహ్లల్ ఖిబ్త్' అని, ఈ లేఖలో 'అసిముల్ ఖిబ్త్' అని ఉంది. చూడండి, 'ప్రవక్త రాజకీయ జీవితం పుట' - 136, 137.)_

*3. పర్షియా చక్రవర్తి ఖుస్రో పర్వేజ్ కు పంపిన లేఖ : -*

దైవప్రవక్త (సల్లం) ఓ లేఖను పర్షియా చక్రవర్తి కిస్రా (ఖుస్రో)కు పంపించారు. ఆ లేఖ ఇది. ↓

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

  *ముహమ్మద్ రసూలుల్లాహ్ తరఫున పర్షియా చక్రవర్తి కిస్రాకు రాసిన లేఖ ఇది:*

  *సన్మార్గాన్ని అవలంభించే వ్యక్తికీ, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసిస్తూ, అల్లాహ్ తప్ప వేరెవరూ ఆరాధనలకు అర్హులు కారని, ఆయన ఒక్కడూ, ఆయనకు మరెవ్వరూ సాటిలేరని, ముహమ్మద్ అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యం ఇచ్చే వ్యక్తికి శుభాలు కలుగుగాక. నేను మిమ్మల్ని అల్లాహ్ వైపునకు ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే, జీవించి ఉన్న వానికి అతని దుష్పరిణామాలను గురించీ, తిరస్కారులకు సత్యమేదో తెలియజేయటానికీ నేను మానవులందరి తరఫున అల్లాహ్ ద్వారా పంపించబడినవాణ్ణి గనుక. కాబట్టి మీరు ఇస్లాం స్వీకరించండి క్షేమంగా ఉండగలరు. దాన్నే గనక తిరస్కరిస్తే మీ భుజస్కంధాలపై మజూస్ ల (అగ్ని ఆరాధకుల) పాప భారం కూడా పడగలదు.*

ఈ లేఖను కిస్రాకు అందించడానికి దైవప్రవక్త (సల్లం), 'హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఖుజాఫా సహమీ(రజి)'గారిని ఎంపిక చేశారు. ఆయన ఈ ఉత్తరాన్ని బహ్రైన్ పాలకునికి అందజేశారు. బహ్రైన్ పాలకుడు ఈ లేఖను తన మనిషికి ఇచ్చి కిస్రాకు పంపించాడా లేదా ఖుద్దు అబ్దుల్లాహ్ బిన్ ఖుజాఫా సహమీ (రజి) గారినే అక్కడకు పంపించాడా అనే విషయం గ్రంథాల ఆధారంగా తెలియరాలేదు.

మొత్తానికి ఈ లేఖను 'ఖుస్రో'కు చదివి వినిపించగా, అతను దాన్ని చించివేశాడు. ఎంతో గర్వాన్ని ప్రదర్శిస్తూ, *"నా పాలితుల్లో ఓ నీచమైన బానిస, తన పేరును నా పేరుకంటే ముందు రాస్తాడా?"* అని మండిపడ్డాడు.

దైవప్రవక్త (సల్లం)కు ఈ వార్త తెలియగా ఆయన (సల్లం), *"అల్లాహ్ అతని రాచరికాన్ని ఛిన్నాభిన్నం చేయుగాక"* అని శపించారు. (ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) గారు శపించినట్లే జరిగిపోయింది.)

అనంతరం కిస్రా, తన యమన్ గవర్నరు అయిన 'బాజాన్'కు లేఖ రాస్తూ, హిజాజ్ (సౌదీ)లో ఉన్న ఆ వ్యక్తి (సల్లం) వద్దకు ఇద్దరు బలాఢ్యులైన మనుషుల్ని పంపి, బంధించి నా సన్నిధికి హాజరుపరచమని ఆదేశించాడు.

బాజాన్, ఆ ఆదేశాన్ని శిరసావహిస్తూ ఇద్దరు వ్యక్తుల్ని ఎంపిక చేశాడు.  వారి ద్వారా దైవప్రవక్త (సల్లం)కు ఓ లేఖ కూడా రాసి పంపాడు. ఆ లేఖలో, దైవప్రవక్త (సల్లం), ఈ ఇద్దరి వెంట వెళ్ళి కిస్రా దర్బారులో హాజరుకావాలనే ఆదేశం ఉంది.

వారిరువురు మదీనాకు వెళ్ళి దైవప్రవక్త (సల్లం) సన్నిధికి చేరిన తరువాత వారిలో ఒకడు ప్రవక్త (సల్లం)తో, *"చక్రవర్తి కిస్రా, బాజాన్ గవర్నరుకు ఓ ఉత్తరం ద్వారా మిమ్మల్ని కిస్రా వద్దకు హాజరుపర్చమని ఉత్తరం రాయడం వలన ఆయన నన్ను మీ వద్దకు పంపించాడు. మీరు నా వెంట కిస్రా దగ్గరకు బయలుదేరి రావాలి."* అన్నాడు.

ఇదేకాకుండా వారిరువురు బెదిరింపు ధోరణిని అవలబించారు కూడా. దైవప్రవక్త (సల్లం) వారిరువురిని రేపు వచ్చి కలవమని చెప్పారు.

ఇటు మదీనాలో ఆసక్తికరమైన కార్యం జరుగుతూ ఉండగానే, అటు 'ఖుస్రో పర్వేజ్' కుటుంబంలోనే అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు జ్వాల భగ్గుమంది. దీని ఫలితంగా కైసరు సైన్యాల చేతిలో పార్సీ సైన్యాలు ఎడతెగకుండా అపజయాలను ఎదుర్కొంటున్నాయి. ఆ అదనులోనే ఖుస్రో తనయుడు 'షేరూయా' తన తండ్రిని హతమార్చి రాజైపోయాడు. అది మంగళవారం రాత్రి, జమాదిల్ అవ్వల్ నెల, పదవ తారీఖు హిజ్రీ శకం - 7 నాడు జరిగిన సంఘటన. దైవప్రవక్త (సల్లం)కు ఈ విషయం వహీ (దివ్యావిష్కృతి) ద్వారా తెలిసింది.

మరుసటి రోజు ఆ ఇద్దరు పర్షియా ప్రతినిధులు దైవప్రవక్త (సల్లం) గారి సన్నిధికి హాజరు కాగానే, ఆయన (సల్లం) వారికి ఈ సంఘటన గురించి తెలియజేశారు.

ఇది విన్న వారిద్దరూ, *"ఏమిటీ మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? మేము ఇంతకంటే మామూలు విషయాలను మీ నేరాల్లో చేర్చి ఉన్నాం. మరి మీ ఈ మాటల్ని మేము మా చక్రవర్తికి రాసి పంపించాలా?"* అని బెదిరించారు.

*"అవును, అతనికి నా ఈ మాటలను గురించి తప్పకుండా తెలియజేయండి. అతనికి ఇంకా ఇలా కూడా రాసి పంపించండి. అతనితో చెప్పండి. నా ధర్మం, నా పాలన, కిస్రా ఇప్పటి వరకు చేరినంత దూరం చేరగలదని. అంతేకాదు ఈ పాలన అలా విస్తరిస్తూ, గుర్రాలుకాని, ఒంటెలుకాని వెళ్ళలేనంత వరకు వెళ్ళి ఆగిపోగలదని కూడా చెప్పండి. మీరిరువురు అతనితో, నీవే గనక ముస్లిం అయిపోతే ప్రస్తుతం నీ అధికారంలో ఉన్నదంతా నీదే అవుతుంది, నిన్ను నీ జాతికి రాజుగా చేస్తాను అని కూడా చెప్పండి."* అని అన్నారు ప్రవక్త (సల్లం).

ఆ తరువాత వారిద్దరు మదీనా నుండి బయలుదేరి 'బాజాన్' దగ్గరకు వెళ్ళారు. అతనికి వివరాలన్నీ తెలియజేశారు. కొన్ని రోజుల అనంతరం అతనికి ఓ లేఖ అందింది. 'షేరూయా' తన తండ్రి 'కిస్రా'ని హతమార్చాడని, ఏ వ్యక్తి గురించి తన తండ్రి 'బాజాన్'కు రాశాడో తిరిగి ఆదేశం వచ్చే వరకు అతని (సల్లం) జోలికి పోవద్దని ఉంది ఆ లేఖలో.

ఈ సంఘటన జరిగిన తోడనే 'బాజాన్' మరియు యమన్ లో ఉంటున్న అతని పర్షియన్ సహచరులంతా ముస్లిములైపోయారు.

*In Sha Allah రేపటి భాగంలో....; ↓*

*4. రోము చక్రవర్తి 'కైజరు'కు పంపించిన లేఖ : -*


298

🤝🏻  *అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు*  🤝🏻

🕋🇸🇦🕋   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    🕋🇸🇦🕋

*❂―――•――•――•―○―•――•――•―――❂*

🛐🕌☪         *ఇస్లాం చరిత్ర* *- 298*         ☪🕌🛐

🇸🇦🕋  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 213*  🕋🇸🇦

*❂―――•――•――•―●―•――•――•―――❂*

*రాజులకు, సర్దారులకు పంపించిన లేఖలు : - 3*

*4. రోము చక్రవర్తి కైజరుకు పంపిన లేఖ : -*

సహీ బుఖారీ గ్రంథంలోని ఓ సుదీర్ఘమైన హదీసులో ఓ లేఖ గురించిన ఆధారం లభిస్తోంది. ఈ లేఖను దైవప్రవక్త (సల్లం) రోమన్ చక్రవర్తి 'హిరక్ల్'కు పంపించింది. ఆ లేఖ ఇది: ↓

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

  *అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త అయిన ముహమ్మద్ తరఫున మూడవ హిరక్ల్ చక్రవర్తికి.*

  *సన్మార్గాన్ని అవలంభించే వ్యక్తికి శుభాలు. మీరు ఇస్లాంను స్వీకరించండి క్షేమంగా ఉంటారు. ఇస్లాం స్వీకరించండి అల్లాహ్ మీ ప్రతిఫలాన్ని రెట్టింపుజేస్తాడు. మీరే గనక దీన్ని తిరస్కరిస్తే 'పరారీసీల' (మీ ప్రజల) పాపభారం కూడా మీ భుజస్కంధాలపైన్నే పడుతుంది.*

  *ఓ గ్రంథవహులారా! మాకూ, మీకు మధ్య సమానంగా ఉన్న విషయం వైపునకు రండి. అదేమిటంటే అల్లాహ్ తప్ప మనం మరెవ్వరినీ ఆరాధించము అనీ, ఆయనకు మరెవ్వరినీ సాటి కల్పించము అనీ మరియు మనలో ఏ ఒక్కడూ మరొకరిని, అల్లాహ్ తప్ప ప్రభువుగా చేసుకోము అనేదే. ఒక వేళ వారు దాన్ని తిరస్కరిస్తే చెప్పేయండి, మేము ముస్లిములము, మీరే దీనికి సాక్షి అని.*

ఈ లేఖను అందించడానికి 'దిహ్యా బిన్ ఖలీఫా కలబీ (రజి)'ను ఎంచుకోవడం జరిగింది. దైవప్రవక్త (సల్లం) ఆయనకు ఆదేశమిస్తూ, *"మీరు దీన్ని బస్రా గవర్నరుకు అందించండి, అతను దీన్ని కైసరు వద్దకు పంపుతాడు"* అని చెప్పారు.

ఈ లేఖ రోమ్ చక్రవర్తికి జెరుసలేంలో ఉన్నప్పుడు అందింది. అప్పుడాయన దైవప్రవక్త (సల్లం) వివరాలు తెలుసుకోవడానికి అరబ్బు వర్తకుల్ని గురించి ఆరాదీశాడు. యాదృచ్ఛికంగా ఆ రోజుల్లో మక్కా నుండి అబూ సుఫ్యాన్, మరికొందరు ఖురైషీయులు వ్యాపార నిమిత్తం బయలుదేరి జెరుసలేంకు వచ్చి ఉన్నారు. రోమ్ చక్రవర్తి వెంటనే వాళ్ళను తన దర్బారుకు పిలిపించుకున్నాడు. సంభాషణానువాదం కోసం ఓ 'దుబాషీ'ని కూడా నియమించాడు.

*"ఇప్పుడు తనను తాను దైవప్రవక్తగా ప్రకటించిన ఈ వ్యక్తికి, మీలో ఎవరు వంశం రీత్యా దగ్గరి సంబంధం కలిగి ఉన్నారు?"* అని అడిగారు.

*"నేను ఆయన వంశం రీత్యా అతనికి (సల్లం) దగ్గరివాణ్ణి"* అని బదులిచ్చాడు అబూ సుఫ్యాన్.

*"ఇతణ్ణి (అబూ సుఫ్యాన్ ని) నాకు దగ్గరగా తీసుకురండి, ఇతని (అబూ సుఫ్యాన్) అనుచరుల్ని కూడా అతని వెనుకాలే కూర్చోబెట్టండి"* అని ఆదేశించాడు హిరక్ల్.

అనంతరం అతను తన దుబాషీని సంబోధిస్తూ, *"ఆయన (అబూ సుఫ్యాన్) వెంట ఉన్న మనుషులతో చెప్పు, ఇతనే (అబూ సుఫ్యాన్) గనక అసత్యమాడితే వెంటనే దాన్ని మీరు ఖండించాలి"* అని అన్నాడు

అప్పుడు అబూ సుఫ్యాన్ తన మదిలో, *"దైవసాక్షి! అగౌరవం పాలు అవుతాననే భయమే లేకుండా ఉండి ఉంటే నేను ముహమ్మద్ (సల్లం) గురించి అసత్యమాడేవాణ్ణే కదా!"* అని అనుకున్నాడు.

దుబాషీ మాధ్యమంగా ఆ ఇరువురి నడుమ కొనసాగిన సంభాషణ ఇలా ఉంది....; ↓

అతను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, *"ఆయన (సల్లం) వంశం ఎలాంటిది అని అనుకుంటున్నారు మీరు?"*

*అబూ సుఫ్యాన్ : -* ఆయన (సల్లం) గొప్ప వంశానికి చెందినవాడు.

*హెరక్ల్ : -* నీవే కాకుండా ఈ మాట మీరెవరైనా ఇది వరకు అని ఉన్నారా?

*అబూ సుఫ్యాన్ : -* లేదు.

*హెరక్ల్ : -* ఈయన తాతముత్తాతల్లో ఎవరైనా రాజుగా రాజ్యమేలారా?

*అబూ సుఫ్యాన్ : -* లేదు.

*హెరక్ల్ : -* సరే, ధనవంతులు ఆయన్ను అనుసరించారా లేదా బలహీనులా?

*అబూ సుఫ్యాన్ : -* అందరూ బలహీనులే.

*హెరక్ల్ : -* వీరి సంఖ్య అధికం అవుతుందా లేదా క్షీణిస్తుందా?

*అబూ సుఫ్యాన్ : -* పెరుగుతూనే ఉంది.

*హెరక్ల్ : -* ఈ ధర్మంలో ప్రవేశించిన తరువాత ఏ ఒక్కడైనా ఈ ధర్మం నుండి బయటపడి ధర్మ భ్రష్టుడయ్యడా?

*అబూ సుఫ్యాన్ : -* లేదు.

*హెరక్ల్ : -* ఈయన ఏ విషయాన్నయితే చెబుతున్నాడో ఆ విషయం గురించి ఇంతకు పూర్వం అతని కంటే ఎవరైనా చెప్పి ఉన్నారా?

*అబూ సుఫ్యాన్ : -* లేదు.

*హెరక్ల్ : -* ఆయన చెప్పిన మాటను ఎప్పుడైనా తప్పడం జరిగిందా?

*అబూ సుఫ్యాన్ : -* లేదు. అయితే మేము ఇప్పుడు అతనితో చేసుకున్న ఒప్పందంలో కుదుర్చుకున్న కాలాన్ని గడుపుతున్నాం. ఈ కాలంలో అతను తన మాటను నిలుపుకుంటాడో లేదో మాకు తెలియదు.

అబూ సుఫ్యాన్ కథనం ప్రకారం....; *"ఈ ఒక్క మాట తప్ప మరే మాటనూ నేను నా తరపు నుంచి చెప్పే అవకాశం నాకు లభించలేదు."*

*హెరక్ల్ : -* మీరు ఆయనతో యుద్ధం చేయడం జరిగిందా?

*అబూ సుఫ్యాన్ : -* అవును, మేము ఆయనతో యుద్ధం కూడా చేశాము.

*హెరక్ల్ : -* అయితే మీకు ఆయనకు మధ్య జరిగిన యుద్ధ పరిణామాలు ఎలాగున్నాయి?

*అబూ సుఫ్యాన్ : -* యుద్ధం మాకు ఆయనకు నడుమ ఓ బొక్కెన లాంటిది. ఆయన మమ్మల్ని నష్టబెడితే మేము ఆయన్నూ నష్టానికి గురిచేసేవారం.

*హెరక్ల్ : -* ఆయన మీకు దేని గురించి ఆదేశిస్తున్నాడు.

*అబూ సుఫ్యాన్ : -* ఆయన చెప్పేది, మేము కేవలం అల్లాహ్ నే ఆరాధించాలని, ఆయనకు మరెవ్వరినీ సాటి కల్పించరాదని, మీ తాతముత్తాతలు ఏవైతే చెబుతూ వచ్చారో దాన్ని వదిలేయమని. ఆయన మాకు నమాజు చేయమని, సత్యం పలకమని, చెడుకు దూరంగా ఉండమని, సౌశీల్యం మరియు బంధువుల ఎడల సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఆదేశిస్తున్నాడు.

ఆ తరువాత హెరక్ల్ తన దుబాషీని సంభోదిస్తూ, నీవు ఇతనితో (అబూ సుఫ్యాన్ తో) ఇలా చెప్పు అంటూ తన అభిప్రాయాన్ని ఇలా బహిర్గతం చేశాడు.

*"నేను ఆయన వంశం గురించి అడిగినప్పుడు, ఆయన ఉన్నతమైన వంశానికి చెందినవాడని నీవు చెప్పావు. ప్రవక్తలు తన జాతిలోని ఉన్నత వంశం నుండే ప్రభవింపజేయబడతారు.*

*ఈ మాటలు మీలో ఇంకెవరైనా చెప్పి ఉన్నారా? అని అడిగినప్పుడు, అలా ఎవరూ చెప్పలేదని నీవు అన్నావు. ఈ మాటలు ఇంతకు పూర్వం ఇంకెవరైనా చెప్పి ఉండి ఉంటే, ఇతను వాటినే వల్లిస్తున్నాడని నేను అనుకుని ఉండేవాణ్ణి.*

*ఈయన తాతముత్తాతల్లో ఎవరైనా రాజుగా చెలామణి అయ్యారా? అని అడిగినప్పుడు, లేదు అని సమాధానమిచ్చావు నీవు. ఇతని తాతముత్తాతల్లో ఎవరైనా రాచరికం చేసి ఉంటే, ఈయన తన తాతముత్తాతల రాచరికాన్ని కోరుకుంటున్నాడని అనుకొని ఉండేవాణ్ణి.*

*అలాగే, ఏ మాట అయితే ఆయన అంటున్నాడో అంతకు పూర్వం మీరు దాన్ని అసత్యంగా ఖండించి ఉన్నారా? అని నేను అడిగినప్పుడు, అలా జరగలేదని నీవు అన్నావు. అందుకని ఆయన మీతో ఎప్పుడూ అసత్యం పలకనప్పుడు అల్లాహ్ గురించి ఎలా అసత్యం పలుకగలడు?*

*సంపన్నులు ఆయనను అనుసరిస్తున్నారా లేదా పేదవారా? అని నేను అడిగినప్పుడు, బలహీన ప్రజలు, పేదలే ఆయన్ను అనుసరిస్తున్నారని నీవు అన్నావు. యధార్థంగా ఇలాంటివారే ప్రవక్తలను అనుసరించేవారుగా ఉంటారు.*

*ఆయన ధర్మాన్ని అవలంభించిన తరువాత ఏవరైనా తిరిగి ఆ ధర్మాన్ని వదలి మార్గభ్రష్టులైపోతున్నారా? అని అడగగా, లేదు అని నీవు సమాధానమిచ్చావు. యదార్థం ఏమిటంటే, విశ్వాస మాధుర్యం హృదయాల్లో చోటు చేసుకున్నప్పుడే అలా జరుగుతుంది.*

*ఆయన ఆడిన మాట ఎప్పుడైనా తప్పారా అని అడగగా, అలా ఎప్పుడు జరగలేదని నీవు సమాధానమిచ్చావు. ప్రవక్తలు అలాగే అంటారు. ఎప్పుడూ ఆడిన మాటను జవదాటరు.*

*నేను నిన్ను, ఆయన వేటిని గురించి ఆదేశిస్తున్నాడు? అని అడిగినప్పుడు, ఆయన అల్లాహ్ ను ఆరాధించమని, ఆయనకు మరెవ్వరినీ సాటి కల్పించకు అనే ఆదేశం ఇస్తున్నాడు అనీ, విగ్రహారాధన విడువమనీ, నమాజు, సత్యం మరియు సౌశీల్యం గురించి బోధిస్తున్నాడని నీవు చెప్పావు.*
  *నీవు చెప్పిందే నిజమైతే ఈ వ్యక్తి అతి త్వరలోనే నా ఈ కాళ్ళ క్రింద ఉన్న భూభాగానికి యజమాని అవుతాడు. ఓ ప్రవక్త వస్తాడన్న విషయం నాకు తెలుసు. అయితే ఆయన మీ జాతి నుండి ప్రభవించడని నేను అనుకున్నాను. నేను ఆయన వద్దకు వెళ్ళే నమ్మకమే ఉండివుంటే ఆయన వద్దకు వెళ్ళే శ్రమ తీసుకునేవాణ్ణే. ఆయన సాన్నిధ్యంలోనికి వెళ్ళగలిగితే ఆయన రెండు కాళ్ళను కడిగేవాణ్ణే."*

ఆ తరువాత హిరక్ల్, దైవప్రవక్త (సల్లం) గారి లేఖను తెప్పించి అక్కడున్న వారందరికీ చదివి వినిపించాడు. లేఖ చదవడం పూర్తి కాగానే అక్కడ బిగ్గరగా మాట్లాడుకోవడం, పెద్ద గోల జరగడం వినిపించింది.

ఆ తర్వాత రోమ్ చక్రవర్తి, అరబ్బు వర్తకుల్ని బయటకు పంపించేయమని ఆదేశమివ్వగా, వారిని బయటకు పంపించడం జరిగింది.

అబూ సుఫ్యాన్ కథనం ప్రకారం....; ↓

*"మేము బయటకు వచ్చిన తరువాత నేను నా అనుచరులతో, _"'అబూ కబ్షా★' కుమారుని వ్యవహారం బాగా ముదిరిపోయింది. ఇతనంటే, బనుల్ అస్ఫర్ (రోమనుల)☆ రాజు కూడా భయపడుతున్నాడు."_ అన్నాను. ఈ సంఘటన తరువాత నాకు దైవప్రవక్త (సల్లం) గారి ధర్మమే ప్రాబల్యం పొందగలదనే గట్టి నమ్మకం కుదిరింది. చివరకు నా హృదయ కవాటాలను అల్లాహ్ ఇస్లాం కోసం తెరిచేశాడు."*

కైసరుపై, దైవప్రవక్త (సల్లం)గారి లేఖ ఎలాంటి ప్రభావం చూపిందో అబూ సుఫ్యాన్ మాటల వల్ల అర్థం చేసుకోవచ్చు. కైసరు, దైవప్రవక్త (సల్లం) గారి లేఖ నందించడానికి వెళ్ళిన దూత 'హజ్రత్ దిహ్యా కలబీ (రజి)' గారికి డబ్బు, వస్త్రాలిచ్చి సత్కరించాడు. కాని హజ్రత్ దిహ్యా కలబీ (రజి) వాటిని తీసుకొని మదీనాకు వచ్చేటప్పుడు 'జిజామ్' తెగకు చెందిన కొందరు వ్యక్తులు దోపిడీ చేసి అవన్నీ దోచుకోవడం జరిగింది. ఆయన మదీనాకు చేరి నేరుగా దైవప్రవక్త (సల్లం) గారి సన్నిధికే వెళ్ళారు. వివరాలన్నీ ఆయన (సల్లం)కు తెలియజేశారు. మహాప్రవక్త (సల్లం), 'జైద్ బిన్ హారిసా (రజి) నేతృత్వంలో అయిదు వందల మంది సహాబాల ఓ సైనిక పటాలాన్నిచ్చి 'హుస్మా'కు పంపించారు.

హజ్రత్ జైద్ (రజి), జిజామ్ తెగ వారిపై రాత్రి పూట దాడి చేసి చాలా మందిని సంహరించారు. వారి పశువుల్ని, స్త్రీలను తోలుకొని మదీనాకు వచ్చారు. పశువుల్లో వేయి ఒంటెలు, అయిదు వేల మేకలు ఉన్నాయి. ఖైదీల్లో వంద మంది స్త్రీలు, పిల్లలూ ఉన్నారు.

జిజామ్ తెగ వారికి, దైవప్రవక్త (సల్లం)కు నడుమ అప్పటికే సంధి కుదిరి ఉన్నందువలన ఆ తెగకు చెందిన ఓ సర్దారు 'జైద్ బిన్ రిఫాఅ జిజామీ' పరుగున దైవప్రవక్త (సల్లం) వద్దకు వచ్చి నిరసన ప్రకటిస్తూ వేడుకున్నాడు. జైద్ బిన్ రిఫాఅ, ఆ తెగకు చెందిన కొందరు వ్యక్తులతో సహా ఇదివరకే ఇస్లాం స్వీకరించి ఉండడం, దోపిడి జరిగినప్పుడు ఆయన హజ్రత్ జైద్ (రజి)కు కూడా సహాయపడి ఉండడం మూలంగా దైవప్రవక్త (సల్లం) అతని నిరసనను స్వీకరించి యుద్ధధనాన్ని, ఖైదీలను అతనికి అప్పజేప్పేశారు.

'గజ్వా'ల చరిత్ర రాసేవారు చాలా మంది ఈ సంఘటన హుదైబియా ఒప్పందం కంటే ముందు జరిగిన సంఘటన అని చెబుతారు. కాని ఇది పెద్ద పొరపాటు. ఎందుకంటే కైసరు వద్దకు లేఖ పంపించింది హుదైబియా ఒప్పందం తరువాతనే. అందుకని, అల్లామా ఇబ్నె ఖైమ్ గ్రంథస్తం చేసిన దాని ప్రకారం, ఈ సంఘటన హుదైబియా ఒప్పందం తరువాతనే సంభవించిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

_(★→ 'అబూ కబ్షా' కుమారుడు అంటే దైవప్రవక్త (సల్లం) అన్నమాట. అబూ కబ్షా, ఆయన (సల్లం)గారి తాతో పితామహులు లేదా మాతామహుల్లో ఒకరి మారు పేరు. ఆయనకు పాలు పట్టిన తల్లి 'హలీమా' గారి భర్త పేరు కూడా అదే అని చెప్పడం జరుగుతోంది. మొత్తానికి అబూ కబ్షా పేరు అంత ప్రాచుర్యంలో లేని పేరు. అరబ్బుల్లో, ఎవరినైనా అగౌరవపర్చాలంటే అతని వంశంలోనే అప్రసిద్ధ వ్యక్తితో జోడించి చెప్పడం ఆచారంగా వస్తూ ఉండేది.)_

_(☆→ బనుల్ అస్ఫర్ (అస్ఫర్ సంతతి, అస్ఫర్ అంటే పసుపు రంగు అని అర్థం). రోమనులను బనుల్ అస్ఫర్ అనడానికి కారణం ఏమిటంటే, రోమనుల ఏ వ్యక్తి ద్వారా అయితే రోమను సంతతి వికసించిందో అతణ్ణి 'అస్ఫర్' (పసుపు రంగువాడు) అని ప్రాచుర్యం పొందడమే.)_

*5. మున్జిర్ బిన్ సావీ పేరున రాసిన లేఖ : - ↓*

*In Sha Allah రేపటి భాగంలో....; →*